భారత్‌‌కు శాశ్వత శత్రువులు లేరు ...దేశ శాశ్వత ప్రయోజనాలే ముఖ్యం: రాజ్‌‌నాథ్ సింగ్

భారత్‌‌కు శాశ్వత శత్రువులు లేరు ...దేశ శాశ్వత ప్రయోజనాలే ముఖ్యం: రాజ్‌‌నాథ్ సింగ్
  • ఈ శతాబ్దం అత్యంత సవాళ్లతో కూడుకున్నది
  • డిఫెన్స్​ రంగంలో ఆత్మ నిర్భరత సాధించాలి
  • రికార్డు స్థాయిలో దేశ రక్షణ రంగ ఎగుమతులు
  • ఆపరేషన్ ​సిందూర్ ​విజయం వెనుక వ్యూహాత్మక సన్నద్ధత

 న్యూ ఢిల్లీ:  భారత్‌‌కు శాశ్వత శత్రువులంటూ లేరని రక్షణ శాఖ మంత్రి రాజ్‌‌నాథ్ ​సింగ్​ పేర్కొన్నారు. భారత్ ఎవరినీ శత్రుదేశంగా పరిగణించదని వెల్లడించారు. దేశ శాశ్వత ప్రయోజనాలే తమకు ముఖ్యమని తెలిపారు. మన రైతులు, ఆంత్రప్రెన్యూర్స్​ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యమిస్తామని తెలిపారు. శనివారం ఎన్డీటీవీ నిర్వహించిన డిఫెన్స్​సమిట్‌‌లో రాజ్‌‌నాథ్‌‌ సింగ్​ ప్రసంగించారు. 

నేటి ప్రపంచం చాలా వేగంగా మారుతున్నదని, ప్రతిరోజూ మన ముందు కొత్త సవాళ్లు పుట్టుకొస్తున్నాయని చెప్పారు. మహమ్మారులు, ఉగ్రవాదం,  ప్రాంతీయ ఘర్షణలతో  ఈ శతాబ్దం అత్యంత సవాలుతో కూడి ఉందని తెలిపారు. ఈనేపథ్యంలో ఆత్మ నిర్భరత కేవలం ఒక ప్రయోజనం మాత్రమే కాకుండా అత్యావశ్యకమైనదిగా మారిందని  చెప్పారు. ట్రంప్ టారిఫ్‌‌లు, ప్రధాని మోదీ చైనా పర్యటన నేపథ్యంలో రాజ్‌‌నాథ్​ సింగ్​ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

సొంత సామర్థ్యాలపైనే ఆధారపడాలి

ప్రస్తుతం మారుతున్న భౌగోళిక రాజకీయాల కారణంగా దేశ రక్షణ రంగం స్వయం స్వావలంబన సాధించాల్సిన అవసరం ఉన్నదని రాజ్‌‌నాథ్ ​సింగ్​ తెలిపారు. రక్షణ రంగం పరంగా ఏ దేశంపైనా భారత్​ ఆధారపడకూడదని చెప్పారు. 2014లో మన డిఫెన్స్​ సెక్టార్ ఎగుమతుల విలువ రూ.700 కోట్లుగా ఉంటే.. అదిప్పుడు రికార్డు స్థాయిలో రూ.24 వేల కోట్లకు చేరిందని చెప్పారు. ఇప్పుడు భారత్‌‌ ఒక కొనుగోలుదారు కాదని.. ఎగుమతిదారుగా వేగంగా ఎదుగుతున్నదని వివరించారు. 

ఆపరేషన్​ సిందూర్ విజయం వెనుక ఏండ్లనుంచి చేసిన వ్యూహాత్మక సన్నద్ధత ఉందని తెలిపారు. మన బలగాలు స్వదేశీ పరికరాలతో లక్ష్యాలపై కచ్చితత్వంతో చేసిన దాడులు.. దూరదృష్టి, సమన్వయానికి నిదర్శనమని పేర్కొన్నారు. రాబోయే పదేండ్లలో ‘సుదర్శన చక్ర’ అనే ఎయిర్​ డిఫెన్స్​ సిస్టమ్‌‌తో దేశాన్ని పూర్తిస్థాయి ఏరియల్​ సెక్యూరిటీ కిందకు తీసుకొస్తామని చెప్పారు. రక్షణ రంగంలోనే ‘సుదర్శన చక్ర’ గేమ్ చేంజర్ అవుతుందని తెలిపారు.