ఎన్నిసార్లు చెప్పాలయ్యా : రూ.500 నోటు పోదు.. వెయ్యి నోటు రాదు

ఎన్నిసార్లు చెప్పాలయ్యా : రూ.500 నోటు పోదు.. వెయ్యి నోటు రాదు

దేశంలో నోట్ల రద్దు, ఉపసంహరణపై పెద్ద ఎత్తున ప్రజల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజల్లోనూ ఎన్నో సందేహాలతోపాటు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. మొన్నటికి మొన్న 2 వేల నోట్ల రూపాయలు ఉప సంహరణ తర్వాత.. వెయ్యి రూపాయల నోట్లు మళ్లీ వస్తాయనే ప్రచారంతోపాటు.. 500 రూపాయల నోట్లను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీనిపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్.. 2023, జూన్ 8వ తేదీ గురువారం ఓ ప్రకటన చేశారు. వడ్డీ రేట్ల విషయంపై జరిగిన సమావేశంలో.. 500, వెయ్యి నోట్ల ప్రచారంలో కీలక ప్రకటన చేశారాయన.

మళ్లీ వెయ్యి రూపాయల నోట్లను తీసుకు వచ్చే ఉద్దేశం, ఆలోచన అస్సలు లేదని స్పష్టంగా చెప్పారాయన. అదే విధంగా 500 రూపాయల నోట్లను ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకునే ఆలోచన సైతం లేదని వివరించారాయన. ఇలాంటి ప్రచారం ఎందుకు జరుగుతుందో.. ఎందుకు చేస్తున్నారో అర్థం కావటం లేదని.. ప్రజలు ఎవరూ ఇలాంటి వార్తలను నమ్మొద్దని పిలుపునిచ్చారు. 

పదే పదే చెబుతున్నాం.. వెయ్యి నోటు రాదు.. 500 రూపాయలు నోటు పోదు అని తేల్చిచెప్పారాయన. ఈ విషయాలపై ప్రజల్లో ఉన్న గందరగోళాలను తొలగించాల్సిన బాధ్యత మీడియాపై ఉందన్నారు శక్తికాంత్ దాస్. ప్రస్తుతానికి మార్కెట్ లో అతిపెద్ద నోటు 500 రూపాయలు మాత్రమే అని.. అదే కంటిన్యూ అవుతుందని.. దాన్ని వెనక్కి తీసుకునే ఆలోచన అస్సలు చేయటం లేదని వెల్లడించారాయన.