61 కార్పొరేషన్ల ఉద్యోగులకు నో పీఆర్సీ

61 కార్పొరేషన్ల ఉద్యోగులకు నో పీఆర్సీ
  • లాభాల్లో ఉన్న కార్పొరేషన్లకే పీఆర్సీ?
  • 61 కార్పొరేషన్లకు పర్మిషన్ ఇవ్వని ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్
  • ఆందోళనలో 60 వేల మంది ఉద్యోగులు
  • 2015 పీఆర్సీ ఉత్తర్వుల్లో బోర్డు అనుమతితోనే శాలరీల పెంపు
  • ఇప్పుడు ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ అనుమతి తీసుకోవాలని మెలిక

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఉన్న కార్పొరేషన్లు, పబ్లిక్ ​సెక్టార్ అండర్​ టేకింగ్స్, కో ఆపరేటివ్​ సొసైటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పీఆర్సీ అమలుపై గందరగోళం నెలకొంది. పీఆర్సీ ప్రకారం జీతాల పెంపుపై ప్రపోజల్స్ పంపినా, కొన్ని కార్పొరేషన్ల నుంచి ఫైల్స్ వెళ్లినా ఇంతవరకు ఫైనాన్స్ డిపార్ట్​మెంట్ అప్రూవల్ ఇవ్వలేదు. లాభాల్లో ఉన్న మూడు కార్పొరేషన్లు.. మినరల్​ డెవలప్​మెంట్, టూరిజం, బేవరేజేస్ కార్పొరేషన్లకు మాత్రమే అనుమతినిచ్చింది. దీంతో మిగిలిన 61 కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. మొత్తం 60 వేల మంది రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్​సోర్సింగ్ ఎంప్లాయ్స్​ ఆయా కార్పొరేషన్లలో పని చేస్తున్నారు. వీరంతా తమకు పీఆర్సీ ప్రకారం జీతం వస్తుందా? లేదా అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పీఆర్సీ అమలుపై రాష్ట్ర సర్కార్​ ఇచ్చిన ఉత్తర్వుల్లో పబ్లిక్ అండర్​ టేకింగ్స్, కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాల పెంపుపై మెలిక పెట్టింది. హెడ్​ఆఫ్ ది డిపార్ట్​మెంట్​అనుమతితో ఫైనాన్స్​డిపార్ట్ మెంట్ నుంచి అప్రూవల్ తీసుకోవాలని పేర్కొంది.

2015లో ఇలా.. ఇప్పుడు మరోలా

రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇచ్చిన పీఆర్సీ ఉత్తర్వుల్లో అంతకుముందు ఫిట్​మెంట్​ఎలా అమలు చేస్తున్నారో అలాగే చేసుకోవాలని పేర్కొన్నారు. దీంతో 2015లో రాష్ట్రంలోని ఆయా ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్లు, కో ఆపరేటివ్​ సొసైటీలు వారి బోర్డుల్లో ఎజెండాగా పెట్టుకుని నేరుగా అప్రూవ్ చేసుకున్నారు. కానీ ఈసారి అలా ఇవ్వలేదు. ప్రతి కార్పొరేషన్​ నుంచి వారు హెచ్ వోడీ నుంచి పీఆర్సీపై ఒక ప్రపోజల్​ను ఫైనాన్స్ ​డిపార్ట్​మెంట్​కు పంపాల్సి ఉంటుంది. అక్కడి నుంచి స్పెషల్ మెమో కానీ జీవో తెచ్చుకోవాలని పేర్కొన్నారు. అయితే  ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ పర్మిషన్ మాత్రం ఇవ్వడం లేదు. రాష్ట్రంలో మొత్తం 93 కార్పొరేషన్లు, పబ్లిక్​ అండర్ సెక్టార్​ అండర్​ టేకింగ్స్​ఉన్నాయి. ఇందులో 3 కార్పొరేషన్లు ఆర్టీసీ, ఎలక్ట్రిసిటీ, సింగరేణి వేజ్​బోర్డ్ పరిధిలో ఉంటాయి. వీటికి సపరేట్ పీఆర్సీ ​అమలు చేస్తారు. మిగిలిన 90లో 26 కార్పొరేషన్లలో ఇతర డిపార్ట్​మెంట్ల నుంచి ఉద్యోగులు డిప్యుటేషన్​పై పనిచేస్తున్నారు. వారికి మాములుగానే పీఆర్సీ అమలవుతుంది. మిగిలిన 64లో లాభాల్లో ఉన్న మూడింటికి పర్మిషన్ వచ్చింది. మిగిలిన 61 కార్పొరేషన్లకు అనుమతి రాలేదు. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సివిల్​ సప్లయ్స్​ వంటి కార్పొరేషన్లు వెల్ఫేర్​ యాక్టివిటీస్ నిర్వహిస్తున్నాయి. వీటికి ఎటువంటి వ్యాపారాలు ఉండవు. అదే సమయంలో ఆయిల్​ఫెడ్, హాకా, వేర్ ​హౌసింగ్​వంటి కార్పొరేషన్లు అంతంత మాత్రంగానే నడుస్తున్నాయి. మార్క్​ఫెడ్ ​వంటివి నష్టాల్లో ఉన్నాయి. కొన్ని కార్పొరేషన్లు కేవలం అప్పులు తీసుకునేందుకే ఏర్పాటు చేశారు. రెవెన్యూ తీసుకొచ్చే దాంట్లో బేవరేజేస్, మైనింగ్, టూరిజం వంటివి ఉన్నాయి. దీంతో లాభాల్లో ఉన్న వాటికే అనుమతులిస్తే తమ పరిస్థితేంటని ఉద్యోగులు వాపోతున్నారు. 

రిటైర్​ మెంట్ ఏజ్ పెంచినట్లే పీఆర్సీ ఇయ్యాలె..

కార్పొరేషన్లలో పీఆర్సీ అమలుకు కొత్త విధానం తీసుకురావడంపై  తెలంగాణ పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయ్​మెంట్ ఫెడరేషన్ ​అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అసలు తమకు పెరిగిన జీతాలు అమలు చేయాలనే ఉద్దేశం సర్కార్ ఉందో లేదోననే అనుమానం కలుగుతుందని ఆ ఫెడరేషన్  నేతలు అంటున్నారు. బోర్డు అనుమతి కాకుండా, కొత్తగా ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ పర్మిషన్ తీసుకోవడమేంటని, ప్రపోజల్స్ పంపినా అప్రూవల్ ఇవ్వకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగుల రిటైర్ మెంట్ వయసు పెంపు చేసినప్పుడు ఎలా కార్పొరేషన్లకు వర్తింపజేశారో, ఇప్పుడు కూడా ఉద్యోగులందరితో పాటు తమకూ పీఆర్సీ అమలు చేయాలని కోరుతున్నారు.