
కాన్ సీక్వెన్షియల్ సీనియారిటీ వర్తించదంటూ సర్కారు ఉత్తర్వులు
ముందు సెక్రటేరియెట్‌లో.. తర్వాత రాష్ట్రమంతా అమలుకు ప్లాన్
తమకు అన్యాయం చేసేలా నిర్ణయమంటూ ఎస్సీ, ఎస్టీల ఆగ్రహం
ఏ పోస్టులో ఉన్నోళ్లు ఆ పోస్టులోనే రిటైరవుతారని ఆందోళన
కోర్టులో కేసు నడుస్తుండగానే ఉత్తర్వులు ఇవ్వడంపై మండిపాటు
హైదరాబాద్, వెలుగు: రిజర్వేషన్ కోటాలో ప్రమోషన్లు పొందిన ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు తరువాతి ప్రమోషన్‌లో కాన్ సీక్వెన్షియల్ సీనియారిటీ వర్తించదని సర్కారు స్పష్టం చేసింది. ఈ మేరకు సీఎస్ సోమేష్ కుమార్ శుక్రవారం జీవో జారీ చేశారు. ఈ నోటిఫికేషన్‌పై సెక్రటేరియట్‌లో పనిచేస్తున్న 40 మంది ఎంప్లాయీస్ అబ్జెక్షన్స్ ఇచ్చినా వాటన్నింటినీ రిజెక్ట్ చేసినట్లు తెలిపారు. సెక్రటేరియట్‌లో పూర్తి చేశాక తర్వాత రాష్ట్రమంతా ఉత్తర్వులు అమలు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. సర్కారు నిర్ణయంతో సెక్రటేరియట్‌లోని 300 మంది, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్షన్నర మంది ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లపై ప్రభావం పడనుంది. తాజా జీవో వల్ల తాము నష్టపోతామని.. తమ ప్రమోషన్లు అడ్డుకునేందుకే జీవో తెచ్చారని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కాన్ సీక్వెన్షియల్ సీనియారిటీపై హైకోర్టులో జడ్జిమెంట్ పెండింగ్‌లో ఉండగానే ఉత్తర్వులివ్వడంపై మండిపడుతున్నారు.
దళితులు ఎదగాలంటూనే..
ఓవైపు సీఎం కేసీఆర్ దళిత బంధు అని , దళితులు ఎదగాలని అంటుంటే.. పాలనకు గుండెకాయ లాంటి సెక్రటేరియట్‌లో తమకు అన్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంటులో 85వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించిన క్యాచ్ ఆఫ్ రూల్ విధానాన్ని పరోక్షంగా అమలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. దీని వల్ల తమకు ప్రమోషన్లు రావని, ఏ పోస్టుల్లో ఉన్న దళిత ఉద్యోగులు ఆ పోస్టుల్లోనే రిటైరయ్యే పరిస్థితి వస్తుందని ఎస్సీ, ఎస్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. క్యాచ్ ఆఫ్ రూల్ తొలగించాక రిజర్వేషన్ కోటాలో ప్రమోషన్ వచ్చిన ఎస్సీ, ఎస్టీ ఉద్యోగికి ఆ రోజు నుంచే కాన్ సీక్వెన్షియల్సీనియారిటీ వర్తిస్తుంది. ఇతర ఉద్యోగుల మాదిరి పై స్థాయి ప్రమోషన్లకు అర్హులు అవుతారు. పైన ఎస్సీ, ఎస్టీ కోటాలో పోస్టులు ఉన్నా లేకున్నా కాన్ సీక్వెన్షియల్ సీనియారిటీ ప్రకారం ప్రమోషన్ ఇవ్వాలి. అయితే ప్రమోషన్ వచ్చే స్థానంలో అంతకు ముందే ఒక్క ఎస్సీ, ఎస్టీ ఆఫీసర్ ఉన్నా మిగతా వారికి ప్రమోషన్ఇవ్వకుండా ఇప్పుడు ఉత్తర్వులు ఇచ్చారు. ఇక ఆ ఆఫీసర్ ఇక ఎప్పటికీ ఆ పోస్టులోనే కొనసాగాల్సి ఉంటుంది. గతంలో ప్రమోషన్లు పొందిన కొందరు ఎస్సీ, ఎస్టీ సెక్రటేరియట్ ఉద్యోగులు ఇప్పుడు
రివర్షన్‌లో మళ్లీ పాత పోస్టులకే వెళ్లే అవకాశం ఉంది.
ఉమ్మడి ఏపీలో అలా.. ఇప్పుడిలా
85వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రభుత్వానికి వచ్చిన అధికారాన్ని వాడుకుని ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు కాన్ సీక్వెన్షియల సీనియారిటీ వర్తింపజేయాలని ఉమ్మడి ఏపీలో జీవో 26ను జారీ చేశారు. ఇప్పుడు అందుకు వ్యతిరేకంగా మరో జీవో 247ను రిలీజ్ చేశారు. జీవో 26 ఎస్సీ, ఎస్టీలకు వర్తిస్తుందని 2018లోనే హైకోర్టు తీర్పు చెప్పింది.