అత్తగారింట్లో అవ్వగారి కారట!.. ఐదేండ్లుగా రేషన్ కార్డుల్లేవ్

అత్తగారింట్లో అవ్వగారి కారట!.. ఐదేండ్లుగా రేషన్ కార్డుల్లేవ్
  • అత్తగారింట్లో అవ్వగారి కారట!
  • కొత్తగా పెండ్లయినోళ్లకు ఐదేండ్లుగా రేషన్ కార్డుల్లేవ్.
  • కార్డు ఉన్నోళ్లకు పిల్లలను చేర్చే ఆప్షన్ లేదు
  • కార్డుల కోసం 8 లక్షల కొత్త జంటల ఎదురుచూపులు
  • రేషన్, ఆరోగ్యశ్రీకి తిప్పలు
  • ఎన్నికలొస్తే తప్ప  పట్టించుకోని ప్రభుత్వం

కరీంనగర్, వెలుగు:  పెండ్లయి ఐదారేండ్లయినా రాష్ట్రంలో అర్హులైన కొత్త జంటలకు రేషన్ కార్డులు రావడం లేదు. మీ సేవ కేంద్రాల్లో అప్లికేషన్ పెట్టినా, కలెక్టరేట్‌‌ లో, తహసీల్దార్ ఆఫీసుల్లో దరఖాస్తులు సమర్పించినా ప్రభుత్వం నుంచి స్పందన కనిపించడం లేదు. దీంతో పెండ్లయి ఏండ్లు గడిచినా, సపరేట్ ఫ్యామిలీ అయినా కూడా చాలా మంది మహిళల పేర్లు వారి పుట్టింటి రేషన్ కార్డులోనే కొనసాగుతున్నాయి. దీంతో ఆరోగ్య శ్రీ, ఇతర అవసరాల కోసం తల్లిగారింట్లోని వైట్ రేషన్ కార్డే వాడాల్సి వస్తోంది. మరోవైపు కార్డు ఉన్న దంపతులకు  పిల్లలు పుడితే వారి పేర్లు చేర్చే ఆప్షన్ సర్కార్ ఇవ్వడం లేదు. మీ సేవ కేంద్రాల ద్వారా కొందరు గతంలో ఆన్ లైన్ లో ఎంట్రీ చేసిన పిల్లల పేర్లు ఫుడ్ సెక్యూరిటీ కార్డు వెబ్ సైట్ లో చూపెట్టడం లేదు. అంతేగాక టెక్నికల్ కారణాలతో ఫ్యామిలీ మెంబర్స్ లో ఒకరిద్దరి పేర్లు ఆన్ లైన్ లో డిలీట్ అవుతున్నాయి. దీంతో రేషన్ కార్డులో పేర్లున్నా ఆన్ లైన్ లో లేని కారణంగా డీలర్లు రేషన్ ఇవ్వడం లేదు. దీంతో పేదలకు ఇబ్బందులు తప్పడం లేదు. 

6 లక్షల కొత్త జంటల ఎదురు చూపులు

2018 లో ముందస్తు ఎలక్షన్స్​ఉండటంతో పెండింగ్ అప్లికేషన్లు పరిశీలించి 1.65  లక్షల కార్డులిచ్చారు. కరోనా నేపథ్యంలో 2020లో కొత్త కార్డులు మంజూరు చేసినా, అందులో పెండింగ్​లో ఉన్న అప్లికేషన్లనే అప్రూవ్​ చేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక 2019లో దాదాపు 7 లక్షలకు పైగా అప్లికేషన్లు వస్తే.. 3.09 లక్షల కార్డులకే అప్రూవల్​ఇచ్చారు. మిగతా అప్లికేషన్లు రిజెక్ట్‌‌ చేశారు. వీరిలో సగం మంది అర్హులున్నారనే వాదన ఉంది. 2020లో అయితే కేవలం 11 కార్డులే ఇచ్చారు. నిజానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఏటా సుమారు లక్షన్నర నుంచి మూడు లక్షల పెండ్లిళ్లు జరుగుతున్నాయని అంచనా. ఈ లెక్కన గడిచిన ఐదేండ్లలో తక్కువలో తక్కువగా10 లక్షల పెండ్లిళ్లు జరిగినా ఇందులో 8 లక్షల జంటలు కొత్త రేషన్ కార్డుకు అర్హత కలిగి ఉండే అవకాశం ఉంది. వీరంతా రేషన్ తోపాటు ఆరోగ్యశ్రీ, ఇతర అవసరాల కోసం కొత్త కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు మూడేండ్ల నుంచి మీసేవ సెంటర్ల ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కూడా ప్రభుత్వం తీసేసింది. 

అన్ని స్కీమ్ లకు రేషన్ కార్డే లింక్.. 

రేషన్ కార్డు ఉన్నోళ్లనే బిలో పావర్టీ లైన్(బీపీఎల్) పరిధిలోని వ్యక్తులుగా ప్రభుత్వం గుర్తిస్తున్న విషయం తెలిసిందే. దీంతో రేషన్ కార్డు లేనివారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందడంలో ఇబ్బందులు తప్పడం లేదు. ఆరోగ్యశ్రీ ద్వారా హాస్పిటల్స్ లో ట్రీట్ మెంట్ కు, దళితబంధు, కార్పొరేషన్ లోన్లు, విద్యార్థుల ఇన్ కం సర్టిఫికెట్ కు రేషన్ కార్డునే  ప్రామాణికంగా తీసుకుంటున్నారు.  

ఏడేండ్లలో 19 లక్షల రేషన్ కార్డుల తొలగింపు 

రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్డులు ఇవ్వకపోగా..తెలంగాణ ఏర్పాటు నుంచి 2021 వరకు19 లక్షల రేషన్‌‌‌‌ కార్డులను తొలగించింది. సరిగ్గా ఏడాది క్రితం ఏప్రిల్ లో సుప్రీం కోర్టులో పిల్ దాఖలు కాగా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. 2016లో కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ ఆధారంగా మళ్లీ ఫీల్డ్​లెవెల్​లో పరిశీలన చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇలా రద్దయిన రేషన్ కార్డుల రీసర్వేనే రాష్ట్రంలో ఇంకా పూర్తి కాలేదు.  

పెండ్లయి తొమ్మిదేండ్లయినా పుట్టింటి కార్డులోనే పేరు..

చొప్పదండికి చెందిన స్వాతి, గంగాధర మండలం గట్టుభూత్కూర్ గ్రామానికి చెందిన మంచాల శంకర్ కు 2014లో పెండ్లయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు. పెండ్లయినప్పటి నుంచి రేషన్ కార్డు కోసం రెవెన్యూ, మీ సేవ కేంద్రాల చుట్టూ చాలాసార్లు తిరిగారు. ఎన్నిసార్లు అప్లికేషన్లు పెట్టినా కార్డు రాలేదు. ఏడాది కింద కూడా మీసేవా ద్వారా మరోసారి అప్లై చేశారు. ఇక్కడ కొత్త కార్డు రాకపో వడంతో స్వాతి పేరు తన తల్లిగారి రేషన్ కార్డులోనే కొనసాగించాల్సి వస్తోందని ఆమె భర్త మంచాల శంకర్ చెప్పాడు. ప్రభుత్వ పథకా లకు రేషన్ కార్డు తప్పనిసరి చేయడంతో ఇబ్బంది అవుతుందన్నాడు. 

పిల్లల పేర్లు తీసేశారు.. 

జమ్మికుంట మండలం అంబేద్కర్ కాలనీకి చెందిన కనకం చంద్రమౌళి, లక్ష్మీకి పెండ్లయి పదేండ్లవుతోంది. వారికి అప్పట్లోనే రేషన్ కార్డు వచ్చింది. పోయిన ఏడాది లక్ష్మి, కూతురు శ్రీవర్షిణి పేర్లను రేషన్ కార్డు నుంచి తొలగించారు. ఫుడ్ సెక్యూరిటీ కార్డు పోర్టల్ లో ప్రస్తుతం కనకం చంద్రమౌళి, కొడుకు ఈశ్వర్ పేర్లు మాత్రమే కనిపిస్తున్నాయి. దీంతో డీలర్ వీరిద్దరి పేరిట మాత్రమే బియ్యం ఇస్తున్నారు. మీ సేవ ద్వారా ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టుకున్నా పేర్లు కలపడం లేదు.  

అక్కడ పోయింది..ఇక్కడ రాలే..


వీరు మేకల కిరణ్, శారద దంపతులు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంAట మండలం శ్రీరాములపల్లికి చెందిన వీరికి నాలుగేండ్ల క్రితం పెండ్లయ్యింది. ఒక పాప ఉంది. మీ సేవ ద్వారా రేషన్ కార్డు కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా రాలేదు. అప్లికేషన్ రిజెక్ట్ అవుతుందని శారద పుట్టింట్లోని రేషన్ కార్డులో తన పేరు తీయించేయగా, కిరణ్ కూడా తన పేరెంట్స్ తో ఉన్న కార్డులో తన పేరు డిలీట్ చేయించాడు. అయినా కొత్త కార్డు రాలేదు. దీంతో రెండు రకాలుగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పిల్లల పేర్లు ఎంట్రీ చేయలే.. 

నాకు పెండ్లయి ఎనిమిదేండ్లవుతోంది. ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు ఉన్నారు. వారి పేర్లు రేషన్ కార్డులో ఎంట్రీ చేయాలని అప్లై చేసి ఐదేండ్లవుతోంది. ఇప్పటివరకు కార్డులో వాళ్ల పేర్లు రాలేదు. దీంతో రేషన్ బియ్యం ఇవ్వడం లేదు. తహసీల్దార్ ఆఫీసుకు ఎన్నిసార్లు తిరిగినా లాభం లేకుండా పోయింది. కరీంనగర్ డీఎస్ఓ ఆఫీస్ లో పెండింగ్ ఉందంటూ అధికారులు సమాధానం చెప్తున్నారు. ఇప్పటికైనా రేషన్ కార్డులో మార్పు చేర్పులకు ప్రభుత్వం అవకాశం కల్పించాలి.  
-
 మాతంగి అనిల్, గన్నేరువరం