పాల రేట్లు ఇప్పట్లో తగ్గవు..దీపావళి దాకా ఆగాల్సిందే

పాల రేట్లు ఇప్పట్లో తగ్గవు..దీపావళి దాకా ఆగాల్సిందే
  • ఇండియన్​ డెయిరీ అసోసియేషన్​ ప్రెసిడెంట్​ రూపిందర్​ సింగ్ సోధి

న్యూఢిల్లీ: దేశంలో పాల రేట్లు ఇప్పట్లో కిందకి దిగి రాకపోవచ్చని ఇండియన్​ డెయిరీ అసోసియేషన్​ ప్రెసిడెంట్​ రూపిందర్​ సింగ్​​ సోధి వెల్లడించారు. పాల రేట్లు తగ్గడానికి బహుశా దీపావళి దాకా వెయిట్​ చేయాల్సిందేనని అన్నారు. గత 15 నెలల్లో పాల రేట్లు 13 నుంచి 15 శాతం దాకా పెరిగాయి. అకాల వర్షాల వల్ల తగినంతగా దాణా దొరక్కపోవడంతో మిల్క్​ ప్రొడక్షన్​లో ఇబ్బందులెదురయ్యాయి. పాలు ఇచ్చే పశువుల సంఖ్య కూడా కొన్ని కారణాల వల్ల తగ్గిపోయింది.

సాధారణంగానే అక్టోబర్​–ఫిబ్రవరి టైములో పాల ప్రొడక్షన్​ ఎక్కువవుతుంది. ఆ సమయంలో డెయిరీ కంపెనీలు కూడా తమ ప్రొక్యూర్​మెంట్​ (పాల సేకరణ) రేట్లను తగ్గిస్తాయి. రూపిందర్​ సింగ్​​ సోధి గతంలో అమూల్​ డెయిరీ కో–ఆపరేటివ్​కు మేనేజింగ్​ డైరెక్టర్​గా ఉన్నారు. రాబోయే రెండేళ్లలో తగినంతగా పాలు అందుబాటులో ఉండాలంటే రైతులకు సమంజసమైన రేట్లను చెల్లించాల్సిందేనని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మే నెల దాకా కొనసాగిన శీతాకాలం, గత రెండు నెలల్లో కురిసిన అకాల వర్షాల వల్ల దేశంలో పాల ప్రొడక్షన్​ 5 శాతం దాకా పెరిగే వీలు కల్పిస్తున్నాయని సింగ్​ పేర్కొన్నారు.