ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న నో రిలీజియన్ గ్రూప్

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న నో రిలీజియన్ గ్రూప్

లండన్/న్యూయార్క్: మీది ఏ మతం? అని ఎవరైనా అడిగితే.. ఏదో ఒక మతం పేరు చెప్పేటోళ్లే ఎక్కువ. కానీ.. తమకు ఏ మతమూ లేదు అని చెప్పేటోళ్లు చాలా అరుదుగా కన్పిస్తుంటరు. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో తమకు ఏ మతమూ వద్దని చెప్తున్న ‘నో రిలీజియన్’ గ్రూపు వాళ్ల సంఖ్య రానురాను ఊహించనంతగా పెరుగుతోందని అమెరికాకు చెందిన ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ప్రధానంగా చైనా, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల్లో కొన్నేండ్లుగా ‘నో రిలీజియన్’ అనేటోళ్ల సంఖ్య ఎక్కువగా పెరుగుతోందని ఇందులో తేలింది. ప్రపంచవ్యాప్తంగా మతాలను నమ్మేవారితో పోలిస్తే.. క్రిస్టియానిటీ, ఇస్లాం మతాల తర్వాత నో రిలీజియన్ గ్రూప్ వాళ్లే మూడో స్థానంలో ఉన్నారని వెల్లడైంది. ప్యూ రీసెర్చ్ సెంటర్ కు చెందిన ‘ప్యూ ఫోరమ్ ఆన్ రిలీజియన్ అండ్ పబ్లిక్ లైఫ్’ ఇటీవల విడుదల చేసిన ‘ది గ్లోబల్ రిలీజియస్ ల్యాండ్ స్కేప్’ స్టడీలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నిర్వహించిన 2,500 సెన్సస్ రిపోర్టులు, సర్వేలు, పాపులేషన్ రిజిస్టర్ల వివరాల ఆధారంగా ఈ స్టడీ నిర్వహించారు.  ‘నో రిలీజియన్’ అంటే పూర్తిగా నాస్తికులు అనడానికి లేదు.‘దేవుడు ఉన్నాడా లేదా అనేది మాకు అనవసరం. మాకు దేవుడి అవసరం లేదు’ అనేవాళ్లే ఈ ‘‘నో రిలీజియన్” లో ఎక్కువగా ఉన్నారు.

ఆస్ట్రేలియాలో వీళ్లదేసెకండ్ ప్లేస్  

ఆస్ట్రేలియాలో ‘‘నో రిలీజియన్’’ అనే వాళ్లు సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. 2016 నాటి ఆస్ట్రేలియా జనాభా లెక్కల ప్రకారం.. తమకు ఏ మతమూ లేదని చెప్పిన వాళ్లు 30.1 శాతం వరకూ ఉండగా, తాజాగా 2021 జనాభా లెక్కల్లో వీరి సంఖ్య 38.9 శాతానికి పెరిగింది. దీంతో ఆస్ట్రేలియాలో వీళ్లే సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. సెక్యులర్ కంట్రీగా, మతపరమైన ఆంక్షలు చాలా తక్కువగా ఉండే దేశంగా పేరున్న ఆస్ట్రేలియాలో నో రిలీజియన్ గ్రూప్ వాళ్ల సంఖ్య స్పీడ్ గా పెరుగుతోందని సర్వేలో వెల్లడైంది. అట్లనే ఆస్ట్రేలియాలో గత కొన్నేండ్లుగా మ్యారేజ్ ఈక్వాలిటీ (సేమ్ సెక్స్ మ్యారేజ్), యూథనేసియా (కోలుకోలేని ఆరోగ్య సమస్య కారణంగా మరణించే హక్కు), అబార్షన్ వంటి వాటి పట్ల ఎల్జీబీటీలు, సెక్యులరిస్టులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని, మతపరమైన అడ్డంకులను తొలగించుకుంటేనే ఈ హక్కులు సాధ్యమవుతాయని భావిస్తున్నందున మతాన్ని వదులుకుంటున్నారని ఎక్స్ పర్ట్ లు చెప్తున్నారు.  

అమెరికాలో ప్రతి 10 మందిలో ముగ్గురు.. 

‘‘నో రిలీజియన్’’ గ్రూప్ వాళ్ల సంఖ్య అమెరికాలో కూడా వేగంగా పెరుగుతోందని ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వేలో వెల్లడైంది. ప్రస్తుతం దేశ జనాభాలో 6 శాతం మంది ఏ మతానికీ కట్టుబడని వాళ్లు ఉన్నారని, పదేండ్ల కిందటితో పోలిస్తే ఇప్పుడు దేశంలో వీరి సంఖ్య బాగా పెరిగిందని తేలింది. ప్రస్తుతం అమెరికాలో ప్రతి 10 మందిలో ముగ్గురు (29%) నో రిలీజియన్ గ్రూప్ లో (ఎథీస్ట్ లు, అగ్నోస్టిక్స్ కలిపి) ఉన్నారని సర్వే పేర్కొంది. 2007 నుంచీ దేశంలో ఈ గ్రూప్ వాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోందని తెలిపింది. అయితే, అమెరికాలోని పెద్ద వయసు వాళ్లలో ప్రతి 10 మందిలో నలుగురు మాత్రం మతం తమ జీవితాల్లో చాలా ముఖ్యమని 
చెప్పినట్లు వివరించింది.

బ్రిటన్ లో 53% మంది వీళ్లే.. 

తమకు ఏ మతమూ వద్దని చెప్తున్న వాళ్లు బ్రిటన్ లో ఏకంగా 53% మంది ఉన్నారని నాట్ సెన్స్ బ్రిటిష్ సోషల్ అటిట్యూడ్స్ సర్వే వెల్లడించింది. 2015లో వీరి సంఖ్య 48 శాతమే ఉండగా, ప్రస్తుతం దేశ జనాభాలో సగానికిపైగా వీళ్లే ఉన్నారని సర్వే తెలిపింది. బ్రిటన్ లో ఈ సర్వే తొలిసారిగా 1983లో చేయగా, అప్పట్లో 31 శాతం మంది మాత్రమే ‘‘నో రిలీజియన్’’ గ్రూప్ లో ఉన్నారు. అప్పటి నుంచి ఏటేటా ఈ గ్రూప్ వాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోందని సర్వే వివరాలను బట్టి తెలుస్తోంది. ప్రధానంగా మతాలను వదులుకుంటున్న వాళ్లు యువతలోనే ఎక్కువగా ఉంటున్నారని తేలింది. 2015లో తమకు ఏ మతమూ లేదని 62% మంది (18 నుంచి 24 ఏండ్లలోపు వాళ్లు) చెప్పగా.. 2016లో 71% మంది ‘‘నో రిలిజియన్’’ అని చెప్పారని వెల్లడైంది. ఇతర ఏజ్ గ్రూపుల్లోనూ ‘‘నో రిలీజియన్’’ అంటున్న వాళ్ల సంఖ్యనే వేగంగా పెరుగుతోందని తేలింది.