బీసీ బిల్లులపై 4 నెలలుగా నో రెస్పాన్స్‌..‌‌‌ అభ్యర్థించిన, ఆందోళన చేసిన స్పందించని కేంద్రం

బీసీ బిల్లులపై 4 నెలలుగా నో రెస్పాన్స్‌..‌‌‌ అభ్యర్థించిన, ఆందోళన చేసిన స్పందించని కేంద్రం
  • బీసీ బిల్లులపై నో రెస్పాన్స్‌‌‌‌ రాష్ట్రపతి కార్యాలయం నుంచి రాని క్లారిటీ 
  • 4 నెలలుగా పెండింగ్‌‌‌‌.. ఢిల్లీలో ఆందోళనలు చేసినా స్పందించని కేంద్రం  
  • నాడు బిహార్‌‌‌‌ బిల్లులకు 10 రోజుల్లోనే గవర్నర్ ఆమోదం  
  • తెలంగాణ బిల్లులు మాత్రం రాష్ట్రపతికి ట్రాన్స్‌‌‌‌ఫర్ 
  • కేంద్రం కావాలనే జాప్యం చేస్తున్నదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఫైర్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన బీసీ రిజర్వేషన్ల బిల్లులపై రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఎలాంటి క్లారిటీ రాకపోవడం రాజకీయ చర్చకు దారితీసింది. బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక ఎన్నికల్లో 42%  రిజర్వేషన్లు కల్పిస్తూ రెండు బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది. ఆ బిల్లులను గవర్నర్‌‌‌‌‌‌‌‌కు పంపగా.. ఆయన వాటిని ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపించారు. ఈ బిల్లులు పంపి నాలుగు నెలలు గడిచినా రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. బిల్లులను ఆమోదించాలని సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఇండియా కూటమి నేతలు ఢిల్లీలో ఆందోళనలు చేసినా కేంద్రం నుంచి స్పందన లేదు. రాష్ట్ర ప్రతినిధులకు రాష్ట్రపతి అపాయింట్‌‌‌‌మెంట్ కూడా ఇవ్వలేదు.  

అక్కడో తీరు.. ఇక్కడో తీరు 

బీసీ బిల్లుల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీటి విషయంలో కేంద్రం ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇతర రాష్ట్రాలు తెచ్చిన బిల్లులకు గవర్నర్ స్థాయిలోనే త్వరితగతిన ఆమోదం లభించిందని గుర్తు చేస్తున్నారు. కానీ తెలంగాణ బిల్లుల విషయంలో మాత్రం వేరేలా జరుగుతున్నదని పేర్కొంటున్నారు. కులగణన సర్వే ఆధారంగా ఈబీసీల రిజర్వేషన్లను 18 శాతం నుంచి 25 శాతానికి పెంచుతూ.. తద్వారా రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లను 65 శాతానికి పెంచుతూ 2023 నవంబర్ 9న బిహార్ అసెంబ్లీ బిల్లును ఆమోదించింది. 

దానికి అదే నెల 10న కౌన్సిల్ కూడా ఆమోదం తెలిపింది. ఆ తర్వాత 10 రోజుల్లోనే బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపగా, నవంబర్ 21న చట్టంగా మారింది. అయితే దీనిపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నది. బిహార్ లెక్కనే తెలంగాణ కూడా కులగణన సర్వే ఆధారంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ.. తద్వారా మొత్తం రిజర్వేషన్లను 67 శాతానికి పెంచుతూ ఈ ఏడాది మార్చి 17న బిల్లులను ఆమోదించింది. వాటికి మరుసటి రోజే కౌన్సిల్ కూడా ఆమోదం తెలిపింది. అయితే ఆ బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా.. అదే నెల 30న రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు.  

అందుకే విమర్శలు.. 

రాష్ట్రంలో పకడ్బందీగా చేపట్టిన కులగణన సర్వే ఆధారంగా ప్రభుత్వం బీసీ బిల్లులు తెచ్చింది. అయితే వాటిని గవర్నర్ ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపారు. ఒకవేళ గవర్నర్ ఆమోదం తెలిపితే చట్టంగా మారేవి. ఎవరైనా కోర్టులకు వెళ్తే అమలు ఎలా అన్నది..? తర్వాత విషయం. కానీ ఒకే రకమైన బిల్లుల విషయంలో గవర్నర్ల తీరు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉండటంపైనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం జోక్యం కారణంగానే తెలంగాణ బీసీ బిల్లులు గవర్నర్ నుంచి రాష్ట్రపతికి వెళ్లాయని, అక్కడ ఉద్దేశపూర్వకంగానే పెండింగ్‌‌లో పెడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

సీఎం సహా మంత్రులు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి అపాయింట్‌‌మెంట్ అడిగినా ఇవ్వకపోవడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని అంటున్నారు. కనీసం పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్‌‌కు ఆమోదం లభించినా స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలయ్యేవని, కానీ ఈ ఆర్డినెన్స్ విషయంలోనూ కేంద్రం కావాలనే జాప్యం చేస్తున్నదని చెబుతున్నారు.