గందరగోళంగా నేషనల్ బాక్సింగ్..తిండి లేకుండా స్టేడియంలో బాక్సర్ల పడిగాపులు

గందరగోళంగా నేషనల్ బాక్సింగ్..తిండి లేకుండా స్టేడియంలో బాక్సర్ల పడిగాపులు
  •     రింగ్స్‌ రెడీగా లేక నాలుగు గంటలు ఆలస్యంగా పోటీలు
  •     తిండి లేకుండా స్టేడియంలో బాక్సర్ల పడిగాపులు

గ్రేటర్ నోయిడా: బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్​ ఇండియా (బీఎఫ్ఐ) తొలిసారి  మెన్స్, విమెన్స్ కోసం ఒకేసారి, ఒకే వేదికపై ఏర్పాటు చేసిన సీనియర్‌‌‌‌  నేషనల్ బాక్సింగ్ చాంపియన్‌‌షిప్‌‌ మొదటి రోజే వివాదాలకు కేంద్రబిందువైంది. నిర్వహణ లోపాలు, సాంకేతిక సమస్యల కారణంగా పోటీలు దాదాపు నాలుగు గంటల పాటు ఆలస్యంగా ప్రారంభం కావడంతో బాక్సర్లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గ్రేటర్ నోయిడాలోని గౌతమ్ బుద్ధ యూనివర్సిటీలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు  షురూ అవ్వాల్సిన బౌట్లు సాయంత్రం ఆరున్నర గంటల వరకు మొదలుకాలేదు. పోటీల కోసం మూడు రింగ్స్‌‌ సిద్ధం చేయాల్సి ఉండగా.. సాయంత్రం 4 గంటల వరకు కనీసం ఒక్క రింగ్ కూడా పూర్తిస్థాయిలో రెడీ కాలేదు. దాంతో ఉదయం నుంచి మ్యాచ్‌‌ల కోసం ఎదురుచూస్తున్న బాక్సర్లు, కోచ్‌‌లు వేదిక వద్దే పడిగాపులు కాశారు. వరల్డ్ చాంపియన్‌‌ మీనాక్షి హూడా లాంటి స్టార్ బాక్సర్లు కూడా యోగా మ్యాట్స్‌‌పై పడుకుని నిరీక్షించాల్సి వచ్చింది. కొందరు బాక్సర్లు ఆహారం కూడా తీసుకోకుండా ఎదురుచూడటం తీవ్ర విమర్శలకు దారితీసింది.  వెండర్లకు సరైన సమయంలో చెల్లింపులు చేయకపోవడం వల్లే రింగ్స్ ఏర్పాటులో జాప్యం జరిగిందని తెలుస్తోంది. ఇలాంటి పోటీలకు కనీసం ఒక్క రోజు ముందైనా అన్ని బౌట్లను రెడీగా ఉంచుతారు.  అయితే, దీన్ని లాజిస్టికల్ సమస్యగా  బీఎఫ్ఐ కొట్టిపారేయడం గమనార్హం. 

అమిత్ శుభారంభం

ఇన్ని అడ్డంకుల మధ్య ప్రారంభమైన పోటీల్లో స్టార్ బాక్సర్ అమిత్ పంగల్  సత్తా చాటాడు. బాంటమ్‌‌ వెయిట్ (50–---55 కేజీ) విభాగంలో  అమిత్ 5–0తో బీహార్‌‌కు చెందిన ఉస్మాన్ మహ్మద్ సుల్తాన్‌‌పై ఏకపక్ష విజయం సాధించాడు. మరో బౌట్‌‌లో మిజోరం బాక్సర్    లాల్రామ్ బట్ కూడా 5–0తో ఒడిశాకు చెందిన సంతోష్ కుమార్‌‌ను ఓడించాడు. హెవీ వెయిట్  (85-–90 కేజీ)లో  హర్యానా బాక్సర్ సాగర్..  కేరళకు చెందిన ఎడ్విన్‌‌పై  పోరాడి గెలిచాడు.