పండుగ పూటా జీతాలు ఇయ్యలె

పండుగ పూటా జీతాలు ఇయ్యలె
  • ఆర్టీసీ ఉద్యోగులకు పండుగ పూటా జీతాలు ఇయ్యలె
  • ఈ నెల జీతాలు ఇంకా చెల్లించని సంస్థ 
  • లోన్ డబ్బు 500 కోట్లు, ఆగస్టు కలెక్షన్ 297 కోట్లున్నా ఇస్తలే 
  • ఇంటి రెంటు, కిరాణా సామాన్లకు తిప్పలు పడుతున్నామని ఆవేదన

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఆర్టీసీ ఉద్యోగులకు పండుగపూట జీతాలందలేదు. సంస్థ దగ్గర రూ. 500 కోట్ల లోన్​డబ్బులున్నా, ఆగస్టు కలెక్షన్​ రూ. 297 కోట్లు వచ్చినా ఈ నెల జీతమింకా పడలేదు. ప్రతి నెలా జీతాలు లేట్​గానే వస్తున్నాయని.. కుటుంబ పోషణ కష్టమవుతోందని ఉద్యోగులు వాపోతున్నారు. ఇంటి కిరాయి, పిల్లల ఫీజులు, కిరాణా సామానుకు ఇబ్బందవుతోందని చెబుతున్నారు. అప్పులు, ఈఎంఐలు టైమ్​కు కట్టక చెక్కులు బౌన్స్ అవుతున్నాయని, ఫైన్లు పడుతున్నాయని ఆవేదన చెందుతున్నారు.

2019 సమ్మె తర్వాత మారిన సీన్​
రాష్ట్రంలో 49 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు. సాధారణంగా ఒకటో తేదీనే ఉద్యోగుల జీతాలు చేతికి వచ్చేవి. ఒకటో తేదీన సెలవుంటే ముందు రోజే అందేవి. కానీ 2019 ఆర్టీసీ సమ్మె తర్వాత పరిస్థితి మారింది. ఒకటో తేదీ పోయి ఐదో తేదీ వచ్చింది. ఆ తర్వాత 10వ తేదీకి చేరింది. ఇప్పుడు పదో తేదీన కూడా జీతాలు రావట్లేదు. ఆదివారం సెలవు కావడంతో జీతాలు పడే చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేదు. సోమవారమైనా వస్తాయేమోనని ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఆర్టీసీ దగ్గర పైసలున్నా..
కరోనాకు తోడు డీజిల్‌‌‌‌ చార్జీల పెంపుతో ఆర్టీసీ అతలాకుతలమవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో సంస్థకు ప్రభుత్వం రూ. 3 వేల కోట్లను ప్రతిపాదించింది. ఇందులో రూ.1,500 కోట్లను బడ్జెట్​లో, మరో రూ.1,500 కోట్లను బడ్జెటేతర పద్దుగా చూపింది. ఇందులో భాగంగా ప్రభుత్వం పూచీకత్తులో వెయ్యి కోట్ల లోన్‌‌‌‌కు అనుమతి వచ్చింది. అయితే ఏ బ్యాంకు కూడా ముందుకు రాలేదు. నెలల తరబడి ఎదురుచూశాక ఆఖరికి ఓ బ్యాంక్‌‌‌‌ రెండు నెలల కిందట 8.22 శాతం ఇంట్రస్ట్‌‌‌‌ కింద తొలి విడతగా రూ.500 కోట్ల లోన్‌‌‌‌ ఇచ్చింది. కానీ వాటిలో పైసా ఖర్చు చేయలేదు. ఆ డబ్బులను మరో బ్యాంక్‌‌‌‌లో 6 శాతం వడ్డీకి ఉత్తగనే అధికారులు జమ చేశారు. అంటే 2.22 శాతం వడ్డీ ఎక్కువగా కడుతున్నారు. దీని వల్ల 2 నెలలకు రూ. 2 కోట్లకు పైగా అదనపు వడ్డీ భారం పెరిగింది. కరోనా ఫస్ట్‌‌‌‌, సెకండ్‌‌‌‌ వేవ్‌‌‌‌ తర్వాత ఆగస్టులో మంచి కలెక్షన్‌‌‌‌ వచ్చింది. రూ. 297 కోట్ల ఆదాయం సమకూరింది. లోన్‌‌‌‌ రూ. 500 కోట్లు, రూ. 297 కోట్ల కలెక్షన్‌‌‌‌ ఉన్నా ఉద్యోగులకు మాత్రం జీతాలివ్వకుండా ఆపుతున్నారు. ఆర్టీసీకి ఒక నెల నెట్‌‌‌‌ శాలరీస్‌‌‌‌కు రూ. 120 కోట్లు అవసరమవుతాయి.

పైసలున్నా ఎందుకియ్యరు?
పండగ పూట కూడా జీతాలు ఇవ్వకపోవడం దారుణం. ఆగస్టులో సంస్థకు టికెట్‌‌‌‌ ఆదాయం రూ. 297 కోట్లు వచ్చింది. 2 నెలల కిందటే రూ. 500 కోట్ల బ్యాంక్‌‌‌‌ లోన్‌‌‌‌ అందింది. అవి తీసుకెళ్లి వేరే బ్యాంక్‌‌‌‌లో వేశారు. ప్రతి నెలా జీతాలు లేట్​గా ఇస్తున్నారు. సమస్యను కొత్త ఎండీ వెంటనే పరిష్కరించాలి. 
‑ ఎం. నాగేశ్వర్‌‌‌‌‌‌‌‌రావు, ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌