
ఈ ఏడాది స్కూల్స్ ప్రారంభం నాటికి స్టూడెంట్స్‌కు కొత్త బట్టలు అందేలా లేవు. మరో 20 రోజుల్లో బడులు తెరుచుకోనుండగా ఇప్పటికీ స్కూళ్లకు క్లాత్ చేరలేదు. తెలంగాణ చేనేత సహకార సంస్థ (టెస్కో)తో ఒప్పందం కుదుర్చుకొని నాలుగు నెలలైనా, సకాలంలో డబ్బులివ్వకపోవడంతో క్లాత్ సరఫరా నిలిచిపోయింది. పైసలిస్తేనే క్లాత్ ఇస్తామని టెస్కో తేల్చిచెప్పడంతో ఇటీవలే కొంత మొత్తం ఇచ్చినట్టు సమాచారం. అయితే మిగిలింది ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి.
ఏప్రిల్‌లోనే స్కూళ్లకు పంపాలి…
స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో సుమారు 25 వేల బడుల్లో 23,65,138 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వీరందరికీ ప్రభుత్వం ఏటా ఉచితంగా రెండు జతల స్కూల్ డ్రెస్ ఇస్తోంది. అయితే గడిచిన రెండేండ్లలో అటూఇటూగా మార్చి నెలాఖరు వరకు డ్రెస్సులు అందించగా, ఈసారి బాగా ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. ఒప్పందం ప్రకారం జనవరిలోనే టెస్కోకు పాఠశాల విద్యాశాఖ స్కూల్ డ్రెస్‌కు సంబంధించిన ఇండెంట్‌ను పంపించింది. మొత్తం 23.65 లక్షలకు 121.19 లక్షల మీటర్ల క్లాత్ అవసరమని ప్రతిపాదించింది. దీంట్లో 35.94 లక్షల మీటర్ల ప్యాంట్ పీస్, 85.25 లక్షల షర్ట్ పీస్ కావాలని కోరింది. ఏప్రిల్‌లోనే స్కూల్స్‌కు పంపాలని సూచించింది. కానీ మే మొదటి వారం దాకా టెస్కోకు ప్రభుత్వం పైసా ఇవ్వలేదు. అయినా టెస్కో ఆదిలాబాద్‌తోపాటు మరో రెండు జిల్లాలకు కొంత క్లాస్ సరఫరా చేసింది. తాజాగా రూ.25 కోట్లు మాత్రమే అందినట్టు అధికారులు తెలిపారు.
పంద్రాగస్టుకూ కష్టమే!…
విద్యాశాఖ ప్రతిపాదనల ప్రకారం క్లాత్ సరఫరా చేసేందుకు టెస్కో అంగీకరించినా, ముందు పైసలివ్వాలని కండీషన్ పెట్టింది.121.19 లక్షల మీటర్ల క్లాత్‌కు రూ.86 కోట్లు, స్టిచ్చింగ్‌కు మరో రూ.23.65 కోట్లు అవసరం. స్టిచ్చింగ్ డబ్బులు లేటయినా క్లాత్‌కు మాత్రం నిధులు ముందే విడుదల చేయాల్సి ఉంది. ప్రభుత్వం ఆ పనిచేయక పోవడంతో టెస్కో నుంచి క్లాత్ బయటకు రాలేదు. స్కూల్ యూనిఫాంకు సంబంధించిన క్లాత్‌ను పూర్తిగా సిరిసిల్ల చేనేత సహకార సంఘాల ద్వారా సేకరించాలని టెస్కో నిర్ణయించింది. సహకార సంఘాల నుంచి ఒత్తిడితో డబ్బుల కోసం టెస్కో పట్టుబడుతున్నట్టు సమాచారం. మరో నెల రోజుల్లో అన్ని జిల్లాలకు క్లాత్ చేరే అవకాశం ఉంది. కొలతలు, స్టిచ్చింగ్ పూర్తయ్యే వరకూ మరో మూడు నెలలు పట్టొచ్చు. ఈ లెక్కన పంద్రాగస్టుకు కొత్తబట్టలు కష్టమేనని తెలుస్తోంది. స్కూల్ డ్రెస్‌కు డబ్బులివ్వాలని ప్రభుత్వానికి ఎప్పుడో ప్రతిపాదనలు పంపినా స్పందన లేకఈ పరిస్థితి ఏర్పడిందని పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘వెలుగు’తో అన్నారు.