
దేశంలో కరోనా వ్యాక్సిన్ కొరత లేదన్నారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్. వ్యాక్సిన్‌కు సంబంధించి ప్రతీ రాష్ట్రంతోనూ మాట్లాడుతున్నామని...వ్యాక్సిన్ అయిపోయే లోపు భర్తీ చేస్తున్నామని ఆయన అన్నారు. 11 రాష్ట్రాల ఆరోగ్య శాఖ కార్యదర్శుల సమావేశంలో కొన్ని రాష్ట్రాలు వ్యాక్సిన్ కొరత గురించి మాట్లాడిన మాట నిజమని అన్నారు. వారి దగ్గర స్టాక్ ఉన్నా..అయిపోతోందన్న ఆందోళనతో వారు కొరత ఉందని అంటున్నారని తెలిపారు. ఉత్పత్తిని బట్టి ఎప్పటికపుడు తాము పరిస్థితి అంచనా వేసి వ్యాక్సిన్ సరఫరా చేస్తున్నామని చెప్పారు. గతంలో తాము వ్యాక్సిన్ వేస్తాం.. రమ్మని కోరినా రాలేదన్నారు. ఇపుడు ప్రజలు వ్యాక్సినేషన్ చేయించుకునేందుకు వస్తున్నారని తెలిపారు. కరోనా కేసుల ఉధృతి విషయంలో ప్రజల నిర్లక్ష్యం చాలా ఉందన్నారు. ఈ విషయాన్ని చాలా చిన్న విషయంగా తీసుకుని...కనీస జాగ్రత్తలు తీసుకోక పోవడం కారణంగానే కేసులు భారీగా పెరుగుతున్నాయని స్పష్టం చేశారు మంత్రి హర్షవర్ధన్.