
4,030 పోస్టుల్లో 2,659 ఖాళీలు
619 గైనిక్ పోస్టుల్లో 353 వేకెంట్
ప్రతి విభాగంలోనూ ఇదే దుస్థితి
డాక్టర్లపై భారం.. రోగులకు గండం
హైదరాబాద్, వెలుగు: సర్కార్ దవాఖాన్లలో కార్పొరేట్ తరహా వైద్యం అందిస్తామని పెద్దలు చెప్పే మాటలు అమలుకు నోచుకోవడం లేదు. కార్పొరేట్ వైద్యమేమోగానీ, కనీస వైద్యం అందించేందుకు అవసరమైన డాక్టర్లను నియమించడంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ (వీవీపీ) పరిధిలో 175 హాస్పిటల్స్ ఉన్నాయి. జిల్లా, ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు అన్నీ వీవీపీ పరిధిలోకే వస్తాయి. ఈ దవాఖాన్లలో స్పెషాలిటీ వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. ఈ ఆస్పత్రుల్లో ప్రతి వందలో 66 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనివల్ల రోగులకు ఇబ్బంది అవడంతో పాటు, డాక్టర్లపై పనిభారం పెరుగుతోంది. రాష్ట్రంలో నార్మల్ డెలివరీల సంఖ్య పెంచాలని కొన్ని రోజులుగా డాక్టర్లపై ప్రభుత్వం విపరీతంగా ఒత్తిడి చేస్తోంది. ఇందుకు అనుగుణంగానే డాక్టర్లు కూడా పనిచేస్తున్నారు. ప్రభుత్వ దవాఖాన్లకు వచ్చే గర్భిణుల సంఖ్య భారీగా ఉంటే, గైనకాలజిస్టుల సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంది. అన్ని దవాఖాన్లలో కలిపి 619 గైనిక్ పోస్టులు ఉంటే, అందులో 353 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 183 మంది మాత్రమే పనిచేస్తున్నారు. వీరే సుమారు లక్షన్నర మంది గర్భిణులకు వైద్య సేవలు అందిస్తున్నారు. నెలకు సగటున 13 వేలకుపైగా డెలివరీలు చేస్తున్నారు. ఒక్కో గైనకాలజిస్టు రోజూ సుమారు వంద మందికి ఓపీ చూడాల్సి వస్తోంది. దీంతో దవాఖాన్లలో గర్భిణులు గంటలకొద్దీ క్యూలైన్లలో వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. డాక్టర్ల సంఖ్య పెరిగితే ఇటు డాక్టర్లకు, అటు గర్భిణులకూ లాభం చేకూరుతుంది. కానీ, అదేమీ చేయకుండానే నార్మల్ డెలివరీలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. సరిపడా డాక్టర్లను నియమించకుండా, ఇలా ప్రెజర్ చేయడం ఎంతవరకు సబబు అని గైనిక్‌లు ప్రశ్నిస్తున్నారు.
అన్నింటా ఇదే దుస్థితి
గైనకాలజీ ఒక్కటే కాదు.. ప్రతి డిపార్ట్‌మెంట్‌లోనూ ఇదే దుస్థితి నెలకొంది. టీవీవీపీ పరిధిలోని దవాఖాన్లలో మొత్తం 4030 మంది స్పెషలిస్టు వైద్యులు పనిచేయాల్సి ఉండగా, ప్రస్తుతం 1371 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. ప్రతి విభాగంలోనూ సగానికిపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీ పోస్టులన్నింటి భర్తీకి మార్చిలోనే ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. కానీ, ఇప్పటివరకూ నోటిఫికేషన్ ఇవ్వలేదు. నేషనల్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ ప్రకారం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచి జిల్లా దవాఖాన వరకూ అన్నింటిలోనూ ఆర్థోపెడిక్ స్పెషలిస్టులు అందుబాటులో ఉండాలి. కానీ, మన దగ్గర 175 హాస్పిటల్స్ ఉంటే, 75 మంది ఆర్థోపెడిషియన్లు మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఇంకో 124 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ప్రైవేటుకు పోవాల్సిందేనా ?
కరోనా తర్వాత జనాలకు శ్వాస సంబంధిత సమస్యలు ఎక్కువయ్యాయి. ప్రభుత్వ దవాఖాన్లలో పల్మనాలజిస్టులు అందుబాటులో లేకపోవడం వల్ల జనాలు ప్రైవేటు దవాఖాన్లను ఆశ్రయిస్తున్నారు. 175 హాస్పిటళ్లకుగాను 112 పల్మనాలజీ పోస్టులు మంజూరయ్యాయి. ఇందులో 77 పోస్టులు ఖాళీగానే ఉండడం గమనార్హం. ఇక పనిచేసే 35 మందిలోనూ 20 మంది హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాల్లోనే ఉన్నారు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లోని రోగులకు సేవలు అందకుండా పోతున్నాయి. అత్యంత కీలకమైన జనరల్ మెడిసిన్ విభాగంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ విభాగంలో దాదాపు 70 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అన్ని హాస్పిటల్స్‌లో పోస్ట్ మార్టమ్స్ జరిపించాలని చెబుతున్న ప్రభుత్వం.. ఫోరెన్సిక్ ఎక్స్‌పర్ట్స్‌ను మాత్రం నియమించడం లేదు. ఈ విభాగంలో 103 సాంక్షన్డ్ పోస్టులు ఉంటే, అందులో 85 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఖాళీల వివరాలు
విభాగం – మొత్తం పోస్టులు – వర్కింగ్ – ఖాళీలు
అనస్తీషియా – 545 – 183 – 362
గైనకాలజీ – 619 – 266 – 353
పీడియాట్రిక్స్ – 538 – 224 – 314
జనరల్ ఫిజీషియన్ – 309 – 97 – 212
జనరల్ సర్జన్ – 312 – 102 – 210
జీడీఎంవో – 313 – 14 – 299