నో సమ్మర్ హాలిడేస్.. మండిపడుతున్న టీచర్ల సంఘాలు

నో సమ్మర్ హాలిడేస్.. మండిపడుతున్న టీచర్ల సంఘాలు
  • రోజూ బడులకు రావాలని విద్యాశాఖ ఆదేశాలు 
  • మండిపడుతున్న టీచర్ల సంఘాలు 

హైదరాబాద్, వెలుగు : స్కూల్  ఎడ్యుకేషన్, సమగ్ర శిక్షా అభియాన్  అధికారుల వింత నిర్ణయాలతో కేజీబీవీ టీచర్లకు ఇబ్బందులు తప్పడం లేదు. గత నెల 25 నుంచి స్కూళ్లు అన్నింటికీ విద్యా శాఖ వేసవి సెలవులు ప్రకటించింది. కానీ, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేసే టీచర్లంతా రోజూ బడులకు రావాల్సిందేనని స్కూల్  ఎడ్యుకేషన్  అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే, వాటిలో పనిచేసే వారంతా కాంట్రాక్టు ఉద్యోగులే కావడంతో అధికారులను ఎదురించలేకపోతున్నారు. ‘‘రోజూ కేజీబీవీ టీచర్లు బడులకు రావాలి.  మే 1 నుంచి 31 వరకూ సమ్మర్  యాక్షన్  ప్లాన్ చేయాలి. స్కూల్ కు వచ్చిన టీచర్లు బయోమెట్రిక్  అటెండెన్స్ వేయాలి.

చుట్టుపక్కల గ్రామాల్లో అడ్మిషన్ల కోసం కాన్వసింగ్​కు వెళ్లాలి. బోధనేతర సిబ్బందితో స్కూల్  ప్రాంగణాన్ని శుభ్రం  చేయించాలి” అంటూ పలువురు డీఈవోలు కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లకు మెసేజీలు పంపించారు. ఇవన్నీ సమగ్ర శిక్షా అభియాన్  ఏఎస్ పీడీ, సీజీడీఓ ఆదేశాల మేరకేనని, ఉన్నతాధికారులు ఎప్పుడైనా సందర్శించవచ్చని హెచ్చరికలు జారీ చేశారు. 12 నెలల జీతం ఇస్తున్నారనే పేరుతో ఇలా వేసవిలోనూ బడులకు రావాలని ఆదేశాలివ్వడం సరికాదని టీచర్లు వాపోతున్నారు. రోజూ బడులకు వచ్చే టీచర్లలో సగం మంది బడిలో ఉండాలని, మిగిలిన సగం మంది గ్రామాల్లో అడ్మిషన్ల కోసం ప్రచారం చేయాలని ఉన్నతాధికారుల పేరుతో డీఈవోలు ఆదేశిస్తున్నారు. అయితే, పిల్లలు లేకుండా బడులకు వచ్చి ఏం చేయాలని టీచర్లు ప్రశ్నిస్తున్నారు.

వేసవి సెలవులు ఇవ్వాలి: యూటీఎఫ్ 

కేజీబీవీ టీచర్లకు, సిబ్బందికి వేసవి సెలవులు  ఇవ్వాలని యూటీఎఫ్  రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జంగయ్య, చావ రవి డిమాండ్  చేశారు. ఏప్రిల్ 25 నుంచి బడులకు వేసవి సెలవులు ఇచ్చారని, అవి కాంట్రాక్టు వారికీ వర్తిస్తాయని వారు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కానీ, మానవత్వం లేకుండా కేజీబీవీ టీచర్లను బడులకు రావాలని ఆదేశించడం సరికాదన్నారు. కనీస వేతనాలు ఇవ్వకున్నా రెసిడెన్షియల్  పద్ధతిలో స్కూళ్లు నిర్వహిస్తూ, సెలవుల్లోనూ డ్యూటీలు చేయిస్తున్నారని మండిపడ్డారు. కేజీబీవీ టీచర్లకు వేసవి సెలవులు వర్తింపజేయకపోవడం అన్యాయమన్నారు.