మెడికల్ కాలేజీల్లో టీచింగ్ ఫ్యాకల్టీ కొరత

మెడికల్ కాలేజీల్లో టీచింగ్ ఫ్యాకల్టీ కొరత
  • ఈ ఏడాదే 7 మెడికల్​ కాలేజీలకు ఎన్ఎంసీ ఆమోదం
  • మార్చిలోనే ఫైనాన్స్ క్లియరెన్స్‌‌‌‌‌‌‌‌..  భర్తీపై సర్కారు జాప్యం
  • వచ్చే నెల నుంచి ఎంబీబీఎస్ క్లాసులు షురూ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ప్రభుత్వ దవాఖాన్ల తీరుగనే, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కూడా స్టాఫ్ కొరత వేధిస్తోంది. జిల్లాకో కొత్త మెడికల్ కాలేజీ పెడ్తున్న సర్కార్, ఆయా కాలేజీల్లో టీచింగ్ ఫ్యాకల్టీ భర్తీలో మాత్రం జాప్యం చేస్తోంది. ఇప్పటికే ఉన్న కాలేజీల్లో వందల సంఖ్యలో అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండగా, ఈ ఏడాది మరో 7 మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వనపర్తి, నాగర్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌కర్నూల్, జగిత్యాల, రామగుండం, కొత్తగూడెం, మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌, సంగారెడ్డి కాలేజీల్లో 150 చొప్పున సీట్లు మంజూరయ్యాయి. మంచిర్యాల మెడికల్ కాలేజీకి సైతం పర్మిషన్ వచ్చే సూచనలు కనిపిస్తున్నయ్. కొత్త, పాత కాలేజీలు అన్నింట్లోనూ ఈసారి అడ్మిషన్లు జరగనున్నయి. ఇటీవలే నీట్ 2022 రిజల్ట్స్‌‌‌‌‌‌‌‌ కూడా విడుదలయ్యాయి. ఇంకో వారం, పది రోజుల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ షురూ కానుంది. వచ్చే నెల చివరి నాటికల్లా కౌన్సెలింగ్ పూర్తయి క్లాసులు ప్రారంభించాల్సి ఉంటుంది. కానీ ఫ్యాకల్టీ భర్తీకి మాత్రం రాష్ట్ర సర్కార్ ఇప్పటి వరకూ చర్యలు చేపట్టలేదు.

పాత వారినే కొత్త కాలేజీలకు డిప్యూట్​ చేసిన్రు
రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పోస్టుల భర్తీకి ఈ ఏడాది మార్చి 23న ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 1183,  ట్యూటర్ పోస్టులు 357, కాలేజీలకు అనుబంధంగా ఉండే దవాఖాన్లలో స్టాఫ్ నర్స్ పోస్టులు 3823 ఖాళీగా ఉన్నట్టు జీవోలో పేర్కొన్నారు. ఇవి కాకుండా ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, బయో మెడికల్ ఇంజనీర్లు, థియేటర్ అసిస్టెంట్స్‌‌‌‌‌‌‌‌, ఫిజియోథెరపిస్ట్‌‌‌‌‌‌‌‌ తదితర 1118 పోస్టుల భర్తీకి సైతం ఆర్థిక శాఖ గ్రీన్‌‌‌‌‌‌‌‌ సిగ్నల్ ఇచ్చింది. వాటిలో ఒక్క పోస్టు భర్తీకి కూడా ఇప్పటి వరకూ సర్కార్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. పైగా వాటికి అదనంగా కొత్త మెడికల్ కాలేజీలు వచ్చాయి. కొత్త కాలేజీల్లో ఫ్యాకల్టీ ఉన్నట్లు చూపించేందుకు పాత కాలేజీల్లోని ప్రొఫెసర్లు, అసోసియేట్‌‌‌‌‌‌‌‌, అసిస్టెంట్ ప్రొఫెసర్లనే కొత్త కాలేజీల్లోకి డిప్యూట్ చేశారు. ఇప్పుడు కొత్త, పాత కలిపి కాలేజీల్లో ఖాళీల సంఖ్య మరింత పెరిగింది.