లిక్కర్ కట్టడికి నో!.. ఎన్నికల్లో మద్యం నియంత్రణ ఊసెత్తని పార్టీలు

లిక్కర్ కట్టడికి నో!.. ఎన్నికల్లో మద్యం నియంత్రణ ఊసెత్తని పార్టీలు
  • లిక్కర్‌‌‌‌ ఆదాయంపైనే ఆధారపడుతున్న సర్కార్ ఖజానా
  • ఉపాధి మార్గంగానూ ప్రమోట్ చేస్తున్న ప్రభుత్వాలు
  • బెల్టుషాపులను మాత్రం అరికడ్తామని కాంగ్రెస్ ప్రకటన
  • కనీసం ఈ హామీకూడా ఇవ్వని మిగతా పార్టీలు  

హైదరాబాద్‌‌‌‌, వెలుగు :  ఎన్నికల్లో గెలిస్తే ఇది చేస్తాం.. అది చేస్తాం అని చెబుతున్న రాజకీయ పార్టీలు, లిక్కర్ ప్రవాహాన్ని అరికడతామని మాత్రం చెప్పడం లేదు. విచ్చలవిడి లిక్కర్‌‌‌‌ అమ్మకాల‌‌‌‌ వల్ల రాష్ట్రంలో లక్షల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వేల మంది మహిళలు, చిన్న వయసులోనే విడోస్‌‌‌‌గా మారుతున్నారు. పిల్లలను పెంచడానికి అష్టకష్టాలు పడుతున్నారు. లిక్కర్‌‌‌‌‌‌‌‌ను ఆదాయ మార్గంగా మాత్రమే చూస్తున్న బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం, ఇవేవీ పట్టించుకోవడం లేదని ఇన్నేండ్లుగా ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. మద్యం అమ్మకాలను పెంచుకోవడానికి ఎక్సైజ్ అధికారులకు టార్గెట్లు పెట్టి ప్రభుత్వం పని చేయిస్తోందని ఆరోపించాయి. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలోనూ మద్యం ఏరులై పారుతోంది. ఎన్నికల్లో గెలిస్తే మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని ఓ పార్టీ, రూ.3 వేల చొప్పున ఇస్తామని మరో పార్టీ హామీ ఇచ్చాయి. కానీ, తమ పార్టీలు అధికారంలోకి వస్తే లిక్కర్ ను కట్టడి చేస్తామని మాత్రం  ఏ పార్టీ చెప్పలేదు. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే బెల్టు షాపులను అరికడతామని చెబుతోంది. అయితే, మద్యం షాపులను తగ్గిస్తామని, తాగుడు అలవాటును మాన్పించే చర్యలు తీసుకుంటామని ఆ పార్టీ కూడా చెప్పడం లేదు.

ఉపాధి మార్గమా?

లిక్కర్‌‌‌‌‌‌‌‌ను ఆదాయ మార్గంగా చూస్తున్న ప్రభుత్వాలు, ఇప్పుడు దాన్నో ఉపాధి అంశంగా ప్రమోట్ చేస్తున్నాయి. ప్రస్తుతం వైన్ షాపుల కేటాయింపులో గౌడ సామాజిక వర్గానికి 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే షాపుల కేటాయింపులో గౌడ్లకు రిజర్వేషన్లను 25 శాతానికి పెంచుతామని కాంగ్రెస్ గ్యారంటీ ఇచ్చింది. అయితే మందు అమ్మకాలు అనేది ప్రభుత్వ ఆదాయంతో పాటు, వివిధ సామాజిక వర్గాల ఉపాధి అంశంగా మారిపోతోంది. భవిష్యత్‌‌‌‌లో వైన్ షాపులను తొలగించాలని ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటే, తమ ఉపాధిని దెబ్బ తీసే చర్యగా ఆయా సామాజిక వర్గాలు భావించే ప్రమాదం కూడా ఉంటుంది. లిక్కర్‌‌‌‌‌‌‌‌ను ఆదాయంగా మార్చుకున్న ప్రభుత్వాలు, దీన్ని ఒక సాకుగా చూపి వైన్ షాపుల సంఖ్యను తగ్గించకపోగా, ఉపాధి కల్పన పేరిట మరిన్ని షాపులను పెంచే ప్రమాదం లేకపోలేదు.  

అతిపెద్ద ఆదాయ వనరు

ఈ పదేండ్లలో మన రాష్ట్రంలో మద్యం అమ్మకాలు అతి భారీగా పెరిగిపోయాయి. సగటున ప్రతి రెండు గ్రామాలకు ఒక వైన్ షాపును ప్రభుత్వం ఓపెన్ చేయించింది. వీటికి అనుబంధంగా ప్రతి గ్రామానికి రెండు, మూడు బెల్టు షాపులు నడుస్తున్నయి. ఈ విచ్చిలవిడి అమ్మకాలతో లక్షల మంది మద్యానికి బానిసలయ్యారు. తాగి తాగి రోగాల బారిన పడి, ట్రీట్‌‌‌‌మెంట్ కోసం ఆస్తులు అమ్ముకుని రోడ్డున పడుతున్నారు. అనారోగ్యంతో, యాక్సిడెంట్లతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ తాగుడు వ్యవహారంతో వేల కుటుంబాలు పేదరికంలోకి వెళ్తున్నాయి. తాగుడుకు అలవాటు పడిన వ్యక్తులు పనిచేయడానికి కూడా బద్దకిస్తున్నారు. మద్యం కొనడానికి డబ్బుల కోసం తల్లిదండ్రులను, భార్య, పిల్లలను వేధిస్తున్నారు. ఈ వేధింపులు తట్టుకోలేక తల్లిదండ్రులే తమ బిడ్డలను హత్య చేసిన ఘటనలు రాష్ట్రంలో అనేకం జరిగాయి. తాగుబోతు భర్తను భార్య చంపడం, తాగి వేధిస్తున్న తండ్రిని కొడుకులు, బిడ్డలు చంపడం వంటి అనేక ఉదహరణలు ఉన్నాయి. ఇవన్నింటినీ పట్టించుకోకుండా, మద్యాన్ని ఆదాయ మార్గంగా మాత్రమే ప్రభుత్వాలు చూస్తున్నాయి. తెలంగాణ ఏర్పడినప్పుడు ఏడాదికి రూ. 1‌‌‌‌‌‌‌‌0 వేల కోట్లుగా ఉన్న లిక్కర్ రెవెన్యూ, ఇప్పుడు రూ.35 వేల కోట్లు దాటింది.