కేంద్ర మంత్రులెవరూ విదేశాలకు వెళ్లొద్దు: ప్రధాని మోడీ

కేంద్ర మంత్రులెవరూ విదేశాలకు వెళ్లొద్దు: ప్రధాని మోడీ

కరోనా వ్యాప్తి గురించి దేశ ప్రజలెవరూ భయపడొద్దని కోరారు ప్రధాని నరేంద్ర మోడీ. ముందు జాగ్రత్త చర్యలు పాటిస్తే వైరస్ వ్యాపించకుండా నియంత్రించవచ్చని చెప్పారు. దేశంలో పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉందని భరోసా ఇస్తూ ఆయన గురువారం సాయంత్రం ట్వీట్ చేశారు. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు విదేశీయుల వీసాల సస్పెన్షన్ సహా అన్ని చర్యలను కేంద్రం తీసుకుంటోందని తెలిపారు ప్రధాని మోడీ. అన్ని రాష్ట్రాలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ అనుకోని పరిస్థితులు తలెత్తినా.. చికిత్స అందించగలిగేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

అనవసర ప్రయాణాలొద్దు

పలు దేశాల్లో కరోనా వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రులెవరూ విదేశీ పర్యటనలకు వెళ్లొద్దని సూచించారు ప్రధాని మోడీ. ప్రజలు కూడా అనవసర ప్రయాణాలు చేయొద్దని కోరారు. కరోనా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని, ఈ లింక్‌ను బ్రేక్ చేసి సేఫ్‌గా ఉండేందుకు భారీ పబ్లిక్ ఈవెంట్స్ ఎక్కడా ఏర్పాటు చేయకుండా ఉండాలని చెప్పారు.

కాగా, భారత్‌లో ఇప్పటి వరకు 73 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో 17 మంది విదేశీయులేనని పేర్కొంది. దేశ వ్యాప్తంగా కరోనా టెస్టులు చేసేందుకు 52 ల్యాబ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. వైరస్ వ్యాప్తి నియంత్రణకు ఏప్రిల్ 15 వరకు టూరిస్టు వీసాలను రద్దు చేసింది భారత ప్రభుత్వం.