- అర్హత ఉన్నా.. లిస్టులో కనిపించని పేర్లు
- మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వందల సంఖ్యలో మిస్సింగ్
- ఒక్కో ఊర్లో 10 – 50 పేర్లు గాయబ్
- 57 ఏండ్లు నిండి అప్లై చేసుకున్నోళ్లలో చాలా మందికి నిరాశ
- గతంలో ఎంపీడీఓలు అప్రూవ్ చేసిన లిస్టులోంచి కూడా కొన్ని పేర్ల తొలగింపు
- బతికి ఉండగానే కొందరు చనిపోయినట్లు నమోదు
- వచ్చిన దరఖాస్తులు 13 లక్షల పైనే.. ఇస్తామంటున్నది 10 లక్షల మందికి
హైదరాబాద్/ నెట్ వర్క్, వెలుగు : రాష్ట్ర సర్కార్ కొత్తగా ప్రకటించిన ఆసరా పింఛన్ లబ్ధిదారుల జాబితాలో లక్షల పేర్లు గల్లంతయ్యాయి. ఒక్కో ఊరిలో కనీసం 10 నుంచి 50 మంది పేర్లు కన్పించడం లేదు. పింఛన్ మంజూరైన కొందరిని బతికుండగానే చనిపోయినట్లు నమోదు చేయడంతో వారికి కొత్త పింఛన్ కార్డులు రాలేదు. మరోవైపు తమకు 57 ఏండ్లు నిండాయని నిరుడు ఆధారాలతో మీ సేవ కేంద్రంలో అప్లై చేసుకున్న చాలా మంది పేర్లు లబ్ధిదారుల జాబితాలో లేవు. దీంతో ఆందోళనకు గురైన బాధితులు సర్పంచ్, ఎంపీడీఓల వద్దకు క్యూ కడుతున్నారు. అర్హులైన చాలా మందికి పింఛన్లు మంజూరు కాలేదని ఎంపీడీఓలు స్వయంగా వెల్లడిస్తున్నారు. మరికొన్ని చోట్ల అనర్హులకు పింఛన్లు మంజూరు చేశారు. పింఛన్లు మంజూరైన వాళ్లలో భూ స్వాములతోపాటు ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు కూడా ఉన్నారు. 57 ఏండ్లు నిండినోళ్లు పెట్టుకున్న దరఖాస్తులపై ఎలాంటి ఎంక్వైరీ చేయకపోవడంతోనే ఇలాంటి పొరపాట్లు దొర్లాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తంగా గతంలో వచ్చిన అప్లికేషన్లు, ప్రభుత్వం మంజూరు చేసిన పింఛన్లు, ఊరికి 10 నుంచి 20 శాతం అర్హుల పేర్లు కనిపించకపోవడాన్ని బట్టి అంచనా వేస్తే సుమారు 3 లక్షల పేర్లు గల్లంతయినట్లు తెలుస్తోంది.
కేవలం ఉప ఎన్నిక జరిగిన చోటే..
సీఎం కేసీఆర్ 2018 డిసెంబర్ లో రెండోసారి అధికారం చేపట్టాక కొత్త పెన్షన్ల మంజూరు ప్రక్రియ నిలిచిపోయింది. కేవలం ఉప ఎన్నిక జరిగిన దుబ్బాక, నాగార్జునసాగర్, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో మాత్రమే పెండింగ్ లో ఉన్న వితంతు, వృద్ధాప్య, దివ్యాంగుల పెన్షన్లను మంజూరు చేశారు. 2018 ఎన్నికలకు ముందు 57 ఏండ్లు నిండినోళ్లకు కూడా పెన్షన్ ఇస్తామని టీఆర్ ఎస్ మేనిఫెస్టోలో ప్రకటించింది. కానీ ఆ హామీని మూడేండ్లు పక్కనపెట్టింది. నిరుడు హుజూరాబాద్ ఉపఎన్నికకు ముందు ఆగస్టులో 57 ఏండ్లు నిండినోళ్లు మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశమిచ్చారు. దీంతో 9.50 లక్షల మంది అప్లై చేసుకున్నారు. ఆ తర్వాత అక్టోబర్‌లో మరోసారి అవకాశం ఇవ్వడంతో మరో 50 వేల మంది వరకు అప్లై చేసుకున్నారు. వీరుగాక అప్పటికే 3.15 లక్షల మంది వితంతువులు, దివ్యాంగులు, 65 ఏళ్లు నిండిన వృద్ధులు, ఒంటరి మహిళలు, 50 ఏళ్లు నిండిన గీత, చేనేత, బీడి కార్మికులు, పైలేరియా, హెచ్ఐవీ పేషెంట్ల దరఖాస్తులు ఎంపీడీఓల లాగిన్ లో అప్రూవ్ అయి మంజూరు చేయడానికి రెడీగా ఉన్నాయి. మొత్తంగా సంవత్సరం క్రితమే 13.15 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. సీఎం కేసీఆర్ వచ్చే నెల నుంచి కొత్తగా 10 లక్షల పింఛన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో.. సుమారు 3.15 లక్షల మందికి కోత తప్పదనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు కొత్త పింఛన్ల జాబితాలో 57 ఏండ్లు నిండినోళ్ల పేర్లు, వితంతువులు, వికలాంగుల పేర్లు ఊరికి 10 నుంచి 50 వరకు గల్లంతుకావడంతో సర్కార్ ఉద్దేశపూర్వకంగానే కొన్ని పేర్లు డిలీట్ చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అనర్హులకూ పింఛన్లు
చాలా మంది అర్హులకు పింఛన్ ఇవ్వని ప్రభుత్వం.. కొన్నిచోట్ల అనర్హులకు పింఛన్లు మంజూరు చేయడం చర్చనీయాంశమైంది. మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెంలో గవర్నమెంట్ టీచర్, ఏడు కోట్ల తండాలో ఓ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి, తక్కెళ్లపాడు తండాలో ఓ సీఐ ఫ్యామిలీలకు, మాడ్గులపల్లి మండలంలోని దాచారం విలేజ్‌లో ఓ 20 ఎకరాల భూస్వామికి పింఛన్లు మంజూరయ్యాయి. వెంకటాద్రిపాలెంలో ప్రభుత్వ టీచర్ ఫ్యామిలీకి మంజూరైనట్టు గుర్తించిన గ్రామ కార్యదర్శి ప్రొసిడీంగ్ ఆర్డర్, ఐడీ కార్డును వెనక్కి తీసుకున్నారు.
71 మంది అప్లై చేసుకుంటే.. 15 మందికి రాలే
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ఎడవల్లిలో అర్హులైన 71 మంది పెన్షన్‌కు దరఖాస్తు చేసుకుంటే మంజూరైన లిస్టులో 15 మంది పేర్లు గల్లంతయ్యాయి. మూడు, నాలుగేండ్లుగా పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వాళ్లంతా సర్పంచ్ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. అందరూ నిరుపేదలేనని, అర్హులందరికీ పింఛన్ ఇవ్వాలని సర్పంచ్ చెరుకుపల్లి వెంకటేశ్వర్లు కోరారు.
54 మంది అప్లై చేసుకుంటే 13 మందికి రాలే
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొయ్యూరులో ఆసరా కొత్త పెన్షన్ లిస్టులో 10 మంది పేర్లు గల్లంతయ్యాయి. గ్రామంలో వివిధ కేటగిరీలకు చెందిన 51 మంది పెన్షన్ కోసం అప్లై చేసుకుంటే 41 మందికే మంజూరయ్యాయి. 57 ఏండ్లు నిండిన 10 మంది పేర్లు జాబితాలో లేవు. అలాగే ముగ్గురు వితంతువుల పేర్లు కూడా లిస్టులో గల్లంతయ్యాయి. బాధితులు ఫిర్యాదు చేయడంతో కొయ్యూరు పంచాయతీ సెక్రటరీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
800 మంది అప్లై చేసుకుంటే 161 మందికే...
చొప్పదండి మున్సిపాలిటీలోని 14 వార్డుల్లో వివిధ కేటగిరీలకు చెందిన సుమారు 800 మంది గత నాలుగేండ్లలో మీ సేవ, మున్సిపల్ ఆఫీసులో పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. చొప్పదండి మున్సిపాలిటీకి మూడు రోజుల కిందట పెన్షన్ మంజూరైన 161 మంది అర్హుల జాబితా డీఆర్డీఓ నుంచి చేరింది. ఆర్థికంగా ఉన్నవారు, రాజకీయ పలుకుబడి ఉన్నవారికి వచ్చాయని, పెన్షన్ల కోసం ఏండ్ల తరబడి ఎదురుచూస్తున్న నిరుపేద కుటుంబాలకు పెన్షన్లు మంజూరు కాలేదని చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ జాబితాలో దాదాపు 11 మంది అనర్హులుగా ఉన్నట్లు మున్సిపల్ ఆఫీసర్లు గుర్తించారు. అలాగే చాలా తక్కువ మందికి పెన్షన్లు మంజూరు కావడంతో మంజూరైన లిస్టును ఆఫీసర్లు వెనక్కి తీసుకున్నట్లు తెలిసింది.
పెన్షన్ కోసం పోతే చనిపోయావని చెప్పిన్రు
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువుకు చెందిన నాగుల్ మీరా దివ్యాంగుల కోటాలో పెన్షన్ కోసం 2020 నవంబర్‌లో అప్లై చేసుకున్నాడు. కొత్త పెన్షన్లు మంజూరైనట్లు తెలియడంతో ఎంపీడీఓ ఆఫీస్ కు వెళ్లి వాకబు చేశాడు. ఆసరా పోర్టల్ లో నీవు చనిపోయినట్లు ఉందని ఆఫీసర్లు చెప్పడంతో షాకయ్యాడు. 53 శాతం డిజేబిలిటీ సర్టిఫికెట్ జారీ చేశారని, బతికున్న మనిషి చచ్చిపోయాడని చెప్పడమేందని నాగుల్ మీరా వాపోయాడు.
పెన్షన్ లిస్టులో పేరు లేదు
ఈ ఫొటోలో కనిపిస్తున్న గిరిజనుడి పేరు జరుపుల మకోనా. వయసు 60 ఏండ్లు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం పెగడపల్లి. గతేడాది ఆగస్టులో పింఛన్ కోసం మీ సేవ కేంద్రంలో అప్లై చేసుకున్నాడు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన పెన్షన్ లిస్టులో ఆయన పేరు లేదు. ఆసరా పెన్షన్ కోసం అర్హుడైన తనకు పెన్షన్ లిస్టులో పేరు లేకపోవడంతో ఆవేదన చెందుతున్నాడు.
బతికున్నోళ్లను చంపేసిండ్రు..
యాదాద్రి జిల్లా ఆలేరుకు చెందిన కళ్లెం బుజ్జమ్మ భర్త సాయిలు 2019లో చనిపోయాడు. వితంతు పింఛన్ కోసం ఆమె అప్లయ్ చేసుకుంది. ఇటీవల ఇచ్చిన కొత్త లిస్టులో బుజ్జమ్మ చనిపోయినట్టుగా ఉంది. విషయం తెలుసుకున్న ఆమె మున్సిపల్ ఆఫీసుకు పోయి కమిషనర్‌ను నిలదీసింది. బతికున్న నన్ను చంపుతారా ? అంటూ బుజ్జమ్మ ఆగ్రహం వ్యక్తం చేసింది. సంస్థాన్ నారాయణపురం గ్రామానికి చెందిన గుత్తా సుగుణమ్మ, అదే మండలం జనగామకు చెందిన బచ్చన్నబోయిన లాలమ్మ పింఛన్లకు అప్లయ్ చేసుకోగా వారిద్దరూ చనిపోయినట్టుగా లిస్టులో రెడ్ మార్క్ పెట్టారు. దీంతో వారిద్దరూ ఎంపీడీఓ ఆఫీసులోని స్టాఫ్ తో గొడవకు దిగారు.
అధికారులు చేతులెత్తిసిండ్లు
ఈయన ఆకారపు సాంబయ్య. వయసు 59 ఏండ్లు. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం ముల్కలగూడెం. నిరుడు మీ సేవ కేంద్రంలో పెన్షన్ కోసం అప్లై చేసుకున్నాడు. రెండు రోజుల క్రితం రిలీజ్ చేసిన లిస్టులో ఈయన పేరు లేదు. పంచాయతీ సెక్రటరీని, ఎంపీడీఓను అడగ్గా ఎలా మిస్సయ్యిందో తమకు తెలియదని చేతులెత్తేశారని సాంబయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గ్రామంలో మరో 10 మంది అర్హులకూ పింఛన్లు మంజూరు కాలేదని సర్పంచ్ బండి పర్వతాలు చెప్పారు.
