ఫిజిక్స్లో ముగ్గురు శాస్త్రవేత్తలకు ‘నోబెల్’ 

ఫిజిక్స్లో ముగ్గురు శాస్త్రవేత్తలకు ‘నోబెల్’ 

భౌతిక శాస్త్ర  (ఫిజిక్స్)  విభాగంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ ప్రైజ్ ను ప్రకటించారు. 2022 సంవత్సరానికిగానూ  ఫిజిక్స్ విభాగంలో అలెన్ యాస్పెక్ట్ (ఫ్రాన్స్),  జాన్ ఎఫ్.క్లాజర్ (అమెరికా), యాంటోన్ జీలింగర్ (ఆస్ట్రియా)లను నోబెల్ అవార్డుకు ఎంపిక చేశారు. ఈవిషయాన్ని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అధికారికంగా ప్రకటించింది. ఫోటాన్ల లో చిక్కుముడులు, బెల్ సిద్ధాంతంలో అసమానతలు,క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ లో  పరిశోధనలు జరిపి కొంగొత్త విషయాలను గుర్తించినందుకుగానూ వారిని నోబెల్ కు ఎంపిక చేసినట్లు తెలిపింది. 


వైద్య రంగంలో స్వాంటె పాబోకు నోబెల్  

ఇక అంతకుముందు రోజు (సోమవారం) వైద్య రంగంలో నోబెల్ ప్రైజ్ ను ప్రముఖ శాస్త్రవేత్త స్వాంటె పాబోకు ప్రకటించారు. మానవ పరిణామ క్రమంతో పాటు అంతరించిపోయిన హోమినిన్‌ జన్యువులకు సంబంధించిన ఆవిష్కరణలకుగానూ పాబోకు ఈ పురస్కారం దక్కింది. 67 ఏళ్ల స్వాంటె పాబో.. పరిణామ జన్యుశాస్త్రంపై పరిశోధనలు చేస్తూ పేరు ప్రఖ్యాతలు అందుకున్నారు. స్వాంటె పాబో తండ్రి కార్ల్ సనె బెర్గ్ స్ర్టోమ్ కూడా 1982లో వైద్యరంగంలోనే నోబెల్ బహుమతి అందుకోవడం విశేషం. 

నోబెల్ ప్రైజ్ గురించి..

నోబెల్‌ బహుమతి గ్రహీతలకు 10లక్షల స్వీడిష్‌ క్రోనర్‌ (సుమారు 9లక్షల డాలర్లు) నగదు అందిస్తారు. స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్‌, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందిస్తున్న వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. 1896లో ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ మరణించగా.. 1901 నుంచి ఏటా ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ప్రదానం చేస్తున్నారు.