
ఐసీసీ లేటెస్ట్ టెస్ట్ ర్యాంకింగ్స్ లో పాకిస్థాన్ స్పిన్నర్ నోమన్ అలీ దూసుకొచ్చాడు. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో అడగొడుతున్న ఈ పాక్ స్పిన్నర్.. బుధవారం (అక్టోబర్ 22) ప్రకటించిన ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్ లో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ సిరీస్ కు ముందు ఆరో స్థానంలో ఉన్న నోమన్ అలీ తొలి టెస్ట్ తర్వాత ఏకంగా నాలుగు స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరుకున్నాడు. లాహోర్ వేదికగా సౌతాఫ్రికాతో ముగిసిన తొలి టెస్టులో 10 వికెట్లు పడగొట్టిన నోమన్.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్ లో 6.. రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లు పడగొట్టి సఫారీలను తన స్పిన్ ధాటికి కుదేలు చేశాడు.
టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. నోమన్ ఆలీకి ఇది కెరీర్ బెస్ట్ ర్యాంక్ కావడం విశేషం. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కంటే అలీ కేవలం 29 పాయింట్ల దూరంలో ఉన్నాడు. బుమ్రా ఖాతాలో 882 రేటింగ్ పాయింట్స్ ఉంటే.. నోమన్ అలీ ఖాతాలో 853 రేటింగ్ ఉన్నాయి. ప్రస్తుతం సౌతాఫ్రికాతో పాకిస్థాన్ రావల్పిండి వేదికగా రెండో టెస్ట్ ఆడుతోంది. ఈ మ్యాచ్ లో నోమన్ అలీ తొలి టెస్ట్ ప్రదర్శనను రిపీట్ చేస్తే బుమ్రాను అధిగమించే అవకాశం ఉంది. హెన్రీ, రబడా, కమ్మిన్స్, హేజాల్ వుడ్ వరుసగా మూడు, నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో నిలిచారు.
►ALSO READ | ICC Cricket Schedule: రేపు అసలు మిస్ అవ్వకండి.. ఒక్క రోజే ఐదు ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు
విండీస్ తో జరిగిన సిరీస్ లో తన స్పిన్ మ్యాజిక్ తో రాణించిన కుల్దీప్ యాదవ్ ఏడు ర్యాంక్ లు ఎగబాకి 14 వ స్థానానికి చేరుకున్నాడు. ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ 12 ర్యాంక్ లో ఉన్నాడు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జో రూట్ అగ్ర స్థానంలోనే కొనసాగుతున్నాడు. బ్రూక్, విలియంసన్, స్మిత్ వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు. విండీస్ తో సిరీస్ కు ముందు ఏడో స్థానంలో ఉన్న జైశ్వాల్.. ఐదో ర్యాంక్ కు చేరుకున్నాడు. ఆల్ రౌండర్ విభాగానికి వస్తే జడేజా ఎవరికి అందనంత దూరంలో అగ్ర స్థానంలో ఉన్నాడు. మెహదీ హసన్ మిరాజ్, స్టోక్స్, ముల్డర్, కమ్మిన్స్ వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు.