
తెలంగాణలో కొత్త ప్రభుత్వం రాబోతుంది. బీఆర్ఎస్ పార్టీ ఓటమితో.. తర్వాత పరిస్థితులను అంచనా వేసిన కార్పొరేషన్ చైర్మన్లు, సలహాదారులు, ఓఎస్డీలు వంటి పదవుల్లో ఉన్న వారు.. తమ తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికే 15 మంది కార్పొరేషన్ చైర్మన్లు రాజీనామా చేయగా.. మరికొందరు ఇదే బాటలో ఉన్నారు. ఈ పదవులు అన్నీ నామినేటెడ్ పోస్టులు. అధికార పార్టీకి చెందిన వ్యక్తులనే నియమిస్తూ ఉంటుంది. కొత్త ప్రభుత్వం వస్తే.. ఎలాగూ తమకు కచ్చితంగా తప్పిస్తుందని క్లారిటీకి వచ్చిన.. ఆయా కార్పొరేషన్ చైర్మన్లు.. ముందుగానే ఆఫీసులు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు.
ఇన్నిరోజులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పలు నామినేటెడ్ పోస్టుల్లో కొనసాగిన పలువురు రిటైర్ట్ ఉద్యోగులు, ఐఏఎస్‌లు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రాబోతుండడంతో తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ ఓఎస్డీ ప్రభాకర్ రావు, టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ రాధాకిషన్ రావు, సాంస్కృతిక సలహాదారు రమణాచారి, ట్రాన్స్ కో, జెన్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావులు తమ పదవులకు సోమవారం రాజీనామా చేశారు. వీరితోపాటు రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లకు ఛైర్మన్లుగా ఉన్న బీఆర్ఎస్ నాయకులు కూడా తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికే15 మంది ఛైర్మన్లు తమ పదవులకు రాజీనామా చేశారు. తమ రాజీనామా పత్రాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి పంపించారు.