ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆఖరి రోజు భారీగా నామినేషన్లు

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆఖరి రోజు భారీగా నామినేషన్లు
  • మద్దతుదారులతో ర్యాలీగా వచ్చి దాఖలు చేసిన అభ్యర్థులు
  • ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో ముగిసిన నామినేషన్ల పర్వం
  •  ఫిబ్రవరి 3న ఉపసంహరణ
  • బుజ్జగింపు ప్రయత్నాల్లో     ప్రధాన పార్టీల లీడర్లు

మహబూబ్ నగర్/వనపర్తి/నాగర్ కర్నూల్/గద్వాల, వెలుగు: కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో చివరి రోజు శుక్రవారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. కార్పొరేటర్​, కౌన్సిలర్​ఆశావహులు తమ మద్దతుదారులతో ర్యాలీగా వచ్చి నామినేషన్​వేశారు. అలాగే మేయర్, చైర్మన్ పీఠాలను ఆశిస్తున్న లీడర్లు ఇదివరకే ఒకసారి నామినేషన్​దాఖలు చేయగా.. చివరి రోజు మరో సెట్ వేశారు. అయితే ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఖరారు చేయకపోవడంతో ఆయా స్థానాలకు ఒక్కో పార్టీ నుంచి ముగ్గురు, నలుగురు నామినేషన్​వేశారు. ఫిబ్రవరి 3న ఉపసంహరణ ఉండటంతో.. లీడర్లు వారిని బుజ్జగించే ప్రయత్నాలను మొదలుపెట్టారు. ఒక్కరినే ఎంపిక చేసి, బీ ఫామ్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. బీఫామ్​లు రాకపోతే పక్క పార్టీల్లోకి జంప్​చేయాలనే ఆలోచనలో నామినేషన్​వేసినవారు ఉన్నట్లు సమాచారం.

మహబూబ్​నగర్​ జిల్లాలో 956 నామినేషన్లు

జిల్లాలోని దేవరకద్ర మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉండగా.. 86 నామినేషన్లు దాఖలయ్యాయి. భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలో 10 వార్డులు ఉండగా.. 96 నామినేషన్లు వచ్చాయి. మహబూబ్​నగర్​ కార్పొరేషన్​లోని 60 డివిజన్లకు చివరి రోజు 579 మంది నామినేషన్​వేశారు. మూడు రోజులు కలిపి మొత్తం 774 నామినేషన్లు వచ్చాయి. మున్సిపాలిటీలతో కలిపి 956.
నారాయణపేట జిల్లాలో 541

జిల్లాలోని కోస్గి మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులు ఉండగా.. చివరి రోజు 80 నామినేషన్లు దాఖలయ్యాయి. మూడు రోజులు కలిపి 119 నామినేషన్లు వచ్చాయి. మద్దూరు మున్సిపాలిటీలో 16 వార్డులు ఉండగా.. 89, మక్తల్​ మున్సిపాలిటీలో 16 వార్డులు ఉండగా.. 131, నారాయణపేట మున్సిపాలిటీలో 24 వార్డులు ఉండగా.. 202 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలో మొత్తం నామినేషన్ల సంఖ్య 541.

వనపర్తి జిల్లాలో 812..

జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో కలిపి 812 నామినేషన్లు వచ్చాయి. వీటిలో కాంగ్రెస్​అభ్యర్థులవి 286, బీఆర్ఎస్​వారివి 199, బీజేపీ వారివి 151 ఉన్నాయి. అభ్యర్థులను ఖరారు చేసే విషయంలో బీఆర్ఎస్​తో పోలిస్తే కాంగ్రెస్​, బీజేపీలు వెనకబడ్డాయి. బీఆర్ఎస్​ వనపర్తిలోని 33 వార్డులకు గానూ 29 మంది అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ అన్ని వార్డులకు తమ పార్టీ తరఫున సింగిల్​ నామినేషన్​ వేయించింది.

బీ ఫామ్స్​ ఇచ్చే రోజున అభ్యర్థులు ఖరారు కానున్నారు. కాంగ్రెస్ తమకు నచ్చిన వార్డు నుంచి నామినేషన్లు వేసుకోమని పార్టీ నాయకులకు సూచించింది. బీ ఫామ్స్​ ఇచ్చే ముందు వారి నిర్ణయాన్ని బట్టి ఆయా వార్డులకు అభ్యర్థులను ప్రకటించనుంది. మిగతా కొత్తకోట మున్సిపాలిటీలోని 15 వార్డులు, పెబ్బేరులోని 12, ఆత్మకూరులోని 10, అమరచింతలోని 10 వార్డుల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.

నాగర్ కర్నూల్ జిల్లాలో 521 

జిల్లాలోని 3 మున్సిపాలిటీలకు మొత్తం 521 నామినేషన్లు రాగా.. శుక్రవారం 312 మంది నామినేషన్​దాఖలు చేశారు. అత్యధికంగా నాగర్​కర్నూల్​ మున్సిపాలిటీలో 224 వచ్చాయి. కల్వకుర్తిలో 152, కొల్లాపూర్​లో 145 నామినేషన్లు దాఖలయ్యాయి.   

గద్వాల జిల్లాలో 525

గద్వాల మున్సిపాలిటీలో శుక్రవారం 245,  అయిజలో 78, అలంపూర్ లో 44, వడ్డేపల్లిలో 34 మంది నామినేషన్​ వేశారు. అయిజ మున్సిపాలిటీలోని 20 వార్డులకు మూడు రోజుల్లో కలిపి మొత్తం 103 నామినేషన్లు, అలంపూర్ మున్సిపాలిటీలో 10 వార్డులకు 59, వడ్డేపల్లి మున్సిపాలిటీలో 10 వార్డులకు 57 నామినేషన్లు దాఖలయ్యాయి. గద్వాల మున్సిపాలిటీలోని 37 వార్డులకు మొత్తం 306  నామినేషన్లు వచ్చాయి. జిల్లాలో మొత్తం 525 నామినేషన్లు దాఖలయ్యాయి.