దేశమంతటా నామినేషన్ల జోరు… పార్టీల్లో చేరికలు

దేశమంతటా నామినేషన్ల జోరు… పార్టీల్లో చేరికలు

దేశమంతటా నామినేషన్లు పర్వం కొనసాగుతోంది. కర్ణాటకలోని తుమకూరు నుంచి కాంగ్రెస్-JDS కూటమి అభ్యర్థిగా మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ నామినేషన్ వేశారు. అక్కడే కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ ముద్దహనుమేగౌడ రెబెల్ గా నామినేషన్ దాఖలు చేశారు. మాండ్యాలో దేవేగౌడ మనుమడు, సీఎం కుమారస్వామి కొడుకు నిఖిల్ కుమారస్వామి నామినేషన్ వేశారు. కాంగ్రెస్, JDS నేతల కోరికమేరకే తాను తుమకూరు నుంచి పోటీ చేసేందుకు అంగీకరించానని చెప్పారు దేవేగౌడ. కర్ణాటక అంతటా కాంగ్రెస్, JDS కోసం ప్రచారం చేస్తానని చెప్పారు. అలాగే ఆంధ్రాకు వెళ్లి చంద్రబాబు తరపున ప్రచారంలో పాల్గొంటానన్నారు దేవేగౌడ.

తమిళనాడులోని శివగంగలో కాంగ్రెస్ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కొడుకు కార్తి చిదంబరం నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని మథురలో బీజేపీ అభ్యర్థిగా హేమామాలిని నామినేషన్ వేశారు. జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్ లో నామినేషన్ వేశారు నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా. ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహాలో BSP అభ్యర్థి డానిష్ అలీ నామినేషన్ వేశారు. నాగ్ పూర్ లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ నామినేషన్ దాఖలు చేశారు.

మమతతో కమల్ హాసన్ భేటీ

బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిశారు మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్. హౌరాలోని నబన్నాలో మమత-కమల్ సమావేశం జరిగింది. అండమాన్ లో తృణమూల్-మక్కల్ నీది మయ్యం మిత్రపక్షాలుగా పనిచేస్తాయని కమల్ చెప్పారు. అండమాన్ లో తృణమూల్ అభ్యర్థి తరపున ప్రచారం చేస్తానన్నారు.

పారాలింపియన్ దీపా మాలిక్ బీజేపీలో చేరారు. హర్యానాకు చెందిన దీపా మాలిక్ 2016 సమ్మర్ పారాలింపిక్స్ లో షాట్ పుట్ విభాగంలో సిల్వర్ మెడల్ గెలిచారు. ఆమెతో పాటు ఇండియన్ నేషనల్ లోక్ దళ్ ఎమ్మెల్యే కెహార్ సింగ్ రావత్ కూడా బీజేపీలో జాయిన్ అయ్యారు.

కేంద్ర మాజీ మంత్రి సుఖ్ రామ్ .. మనవడు ఆశ్రయ్ శర్మతో కలిసి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.