మునుగోడు బై పోల్.. ముగిసిన నామినేషన్ల పర్వం

మునుగోడు బై పోల్..  ముగిసిన నామినేషన్ల పర్వం

మునుగోడులో నామినేషన్ల పర్వం ముగిసింది. నామినేషన్ల దాఖలుకు చివరిరోజైన  ఇవాళ చండూరుకు అభ్యర్థులు క్యూ కట్టారు.  దాదాపు 129 మంది అభ్యర్థులు, మొత్తం 187 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ప్రధాన పార్టీలతో పాటు భూ నిర్వాసితులు, ఓయూ స్టూడెంట్స్, ఇండిపెండెంట్లు నామినేషన్లు వేశారు. రేపు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 17వరకు ఉపసంహరణకు టైం ఉంది.

ప్రధాన పార్టీలు..

మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం ముగిసింది. ప్రధాన పార్టీలైన.. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీజేఎస్, బీఎస్పీ నుంచి అభ్యర్థులు తమ నామినేషన్లు వేశారు. టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే నామినేషన్లు వేయగా.. చివరిరోజు కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి నామినేషన్ వేశారు. ఇక టీజేఎస్ నుంచి పల్లె వినయ్ కుమార్ మరో సెట్ నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి టీజేఎస్ చీఫ్ కోదండరామ్ హాజరయ్యారు. బీఎస్పీ నుంచి శంకరా చారి నామినేషన్ వేయగా.. చివరిరోజు ప్రజాశాంతి పార్టీ నుంచి KA పాల్ నామినేషన్ వేసి ట్విస్ట్ ఇచ్చారు. 

కిష్టరాంపల్లి, చర్లగూడెం భూ నిర్వాసితులు..

మునుగోడు ఉపఎన్నికలో నామినేషన్ వేసేందుకు చర్లగూడెం, కిష్టరాంపల్లి భూ నిర్వాసితులు చండూరుకు భారీగా తరలి వచ్చారు.అయితే నామినేషన్ వేసేందుకు పోలీసులు ఐదుగురికి మాత్రమే అనుమతి ఇచ్చారు. 50 మంది నామినేషన్ వేస్తామన్న నిర్వాసితులకు.. పోలీసులు అనుమతి ఇవ్వకపోవటంతో వాగ్వాదం జరిగింది. దీంతో 15 సెట్ల నామినేషన్ దాఖలు చేసేందుకు రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరకు వెళ్లారు.  వీరితోపాటు ఓయూ విద్యార్థులు, యుగ తులసి ఫౌండేషన్ తరఫున కొంతమంది, పలు కుల సంఘాల నేతలు, ఇండిపెండెంట్లు నామినేషన్లు వేసినట్లు తెలుస్తోంది.

ఇప్పటివరకు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మొత్తం 56 మంది అభ్యర్ధులు నామినేషన్లు వేయగా.. లాస్ట్ డే.. 70 మందికిపైగా నామినేషన్ వేసినట్లు సమాచారం. రేపు నామినేషన్లు పరిశీలన కార్యక్రమం ఉంటుంది. ఈ నెల 17వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడవు ఇచ్చారు. నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. 6న కౌంటింగ్ ఉంటుంది.  
 
గుర్రంపై వచ్చి నామినేషన్

మునుగోడు బై పోల్ సందర్భంగా వెరైటీగా గుర్రంపై వచ్చి నామినేషన్ వేశారు డాక్టర్ వీరబోగ వసంతరాయలు. నాంపల్లి మండలానికి చెందిన వసంతరాయలు... తమను సర్కార్ పట్టించుకోవటం లేదన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీలోని ఒక్క కుమ్మరి కూడా అసెంబ్లీకి వెళ్లలేదన్నారు. ఒగ్గు కళాకారుల ఆటపాటలు, బోనాలతో ర్యాలీగా వచ్చి నామినేషన్ వేయడం అందరినీ ఆకర్షించింది.

వినూత్న ప్రచారం..

మునుగోడు బైపోల్ లో కొందరు యువకులు వినూత్న ప్రచారం చేశారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర క్యాంపెయిన్ చేశారు దుప్ప సురేశ్ బృందం. రాజకీయ పార్టీల అభ్యర్థులకు కాకుండా.. నోటాకు ఓటు వేయాలని అభ్యర్థించారు. నోటాకు ఎక్కువ ఓట్లు వేస్తే.. ఎన్నిక రద్దవుతుందన్నారు. రాజ్యాంగం ఇచ్చే నిధులతో మునుగోడును అభివృద్ధి చేస్తామన్నారు యువకులు.