కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో జోరుగా నామినేషన్లు

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో జోరుగా నామినేషన్లు
  • అథణి నుంచి లక్ష్మణ్​ సావడి పోటీ
  • హుబ్బళ్లి ధార్వాడ్​ నుంచి హస్తం గుర్తుపై ఇయ్యాల షెట్టర్ నామినేషన్​

బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. మంగళవారం ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన పలువురు ప్రముఖ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్​ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్​కు గట్టిపోటీని ఇవ్వడమే లక్ష్యంగా ఆయన పోటీ చేసే కనకపుర  స్థానం నుంచి రాష్ట్ర మంత్రి, సీనియర్​ నేత ఆర్.అశోకను బీజేపీ రంగంలోకి దింపింది. కార్యకర్తలతో భారీ ర్యాలీగా వెళ్లి అశోక నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు, తన సిట్టింగ్ ​స్థానమైన పద్మనాభనగర్​నుంచి కూడా ఆయన పోటీ చేస్తున్నారు. ‘‘ఎన్నికల వ్యూహరచనలో అమిత్​షా చాణిక్యుడి లాంటివారు. ఆయనే నన్ను కనకపురకు పంపించారు. ఇంతకుముందు ఈ నియోజకవర్గంలో బీజేపీ మీటింగ్​ జరిగితే 50 మంది కూడా వచ్చే వాళ్లు కాదు. ఇప్పుడు వేలాది మంది మా వెంట ఉన్నారు. ఇదే మా బలం” అని అశోక వ్యాఖ్యానించారు. ఇక, కాంగ్రెస్​ కర్నాటక చీఫ్​ డీకే శివకుమార్​ సోమవారమే కనకపుర స్థానం నుంచి నామినేషన్​ వేశారు. శివమొగ్గ జిల్లాలోని షికారీపుర సీటు నుంచి యడియూరప్ప కుమారుడు విజయేంద్ర సోమవారమే నామినేషన్​ వేశారు.

హుబ్బళ్లి ధార్వాడ్​ సెంట్రల్​ నుంచి షెట్టర్..

బీజేపీ నుంచి కాంగ్రెస్​లో చేరిన మాజీ సీఎం జగదీశ్​ షెట్టర్ ఈ నెల 19న నామినేషన్​ దాఖలు చేయనున్నారు. తన సిట్టింగ్​ స్థానం హుబ్బళ్లి ధార్వాడ్​ సెంట్రల్​ నుంచే పోటీ చేస్తానని, ఇందుకు కాంగ్రెస్​ పార్టీ సహకరిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ముధోల్​ బిల్గి అసెంబ్లీ స్థానాల్లో నామినేషన్​ దాఖలు చేసేందుకు  బీజేపీ అభ్యర్థులు గోవింద్​ కర్జోల్​, మురుగేశ్​ నిరానీ నిర్వహించిన ర్యాలీలలో సీఎం బొమ్మై పాల్గొన్నారు. మాజీ మంత్రి రమేశ్​ జర్కిహోలీ గోకక్​స్థానం నుంచి బీజేపీ టికెట్​తో బరిలోకి దిగారు. ఇక జేడీ(ఎస్) నేత, మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి చన్నపట్న స్థానం నుంచి, ఆయన కుమారుడు నిఖిల్​ కుమారస్వామి రామనగర నుంచి బరిలోకి దిగారు.