
టీ20 వరల్డ్ కప్ 2022 చివరి దశకు వచ్చింది. సండే జరిగే ఫైనల్‌తో విన్నర్ ఎవరో తేలిపోనుంది. అయితే ప్రస్తుతం ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు ఎవరికి లభిస్తోందని ఆసక్తి నెలకొంది. టీ20 వరల్డ్ కప్‌లో ప్రదర్శన ఆధారంగా ఈ అవార్డు రేసులో 9 మంది ప్లేయర్లు నిలిచారు. ఇందులో ఇంగ్లాండ్ నుంచి ముగ్గురు ఉండగా..పాక్ నుంచి ఇద్దరున్నారు. అటు భారత్ నుంచి కూడా ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు కోసం ఇద్దరు ఆటగాళ్లు పోటీపడుతున్నారు.
టైటిల్ మిస్సయింది..కనీసం అవార్డ్ అయినా..
టీ20 వరల్డ్ కప్ 2022 ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు రేసులో టీమిండియా నుంచి కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. ఈ టోర్నీలో కోహ్లీ 6 మ్యాచుల్లో 98.66 సగటు, 136.40 స్ట్రైక్ రేట్‌తో 296 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్ధశతకాలు సాధించి.. టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అటు సూర్యకుమార్ కూడా అవార్డు కోసం పోటీ పడుతున్నాడు. టోర్నీలో సూర్య 6 మ్యాచుల్లో 239 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలున్నాయి. అయితే కోహ్లీ ఇప్పటికే రెండు సార్లు టీ20 ప్రపంచకప్పుల్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. మరోసారి కోహ్లీకే దక్కే అవకాశాలున్నాయి.
షాదాబా..లేక షాహీనా..
దాయాది పాక్ నుంచి కూడా ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు కోసం ఇద్దరు పోటీ పడుతున్నారు. టోర్నీలో నిలకడగా రాణించిన షాదాబ్ ఖాన్..ఆరు గేముల్లో...75 పరుగులు చేశాడు. అలాగే బౌలింగ్ లో 10 వికెట్లు సాధించాడు. పేసర్ షహీన్ అఫ్రిదీ కూడా అవార్డు రేసులో ఉన్నాడు. ఆరు గేముల్లో షాహీన్ 6.17 ఎకానమీతో 10 వికెట్లు తీసుకున్నాడు.
ఇంగ్లండ్ నుంచి రేసులో ముగ్గురు
టీ20 వరల్డ్ కప్ 2022 ఫైనల్ చేరిన ఇంగ్లండ్ నుంచి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు కోసం ముగ్గురు పోటీ పడుతున్నారు. జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ తో పాటు..సామ్ కర్రన్ ఉన్నారు. బట్లర్ 5 మ్యాచుల్లో 143.16 స్ట్రైక్ రేట్ తో 199 పరుగులు సాధించాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలున్నాయి. అలాగే హేల్స్ ఐదు మ్యాచుల్లో 148.59 స్ట్రైక్ రేట్ తో 211 రన్స్ కొట్టాడు. ఇందులో రెండు అర్థసెంచరీలున్నాయి. అటు సామ్ కర్రన్..7.28 ఎకానమీతో 10 వికెట్లు పడగొట్టాడు.
లంక నుంచి ఒకరు..జింబాబ్వే నుంచి ఒకరు..
ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు కోసం లంక నుంచి వానిందు హసరంగ, జింబాబ్వే నుంచి సికందర్ రజా రేసులో ఉన్నారు. ఈ టోర్నీలో మొత్తం 8 మ్యాచులు ఆడిన రజా..219 రన్స్ సాధించాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది. అలాగే బౌలింగ్ లో 10 వికెట్లు పడగొట్టాడు. అటు లంక స్పిన్ మాంత్రికుడు హసరంగా 8 మ్యాచుల్లో 13.26 సగటు, 6.41 ఎకానమీతో 15 వికెట్లు దక్కించుకోవడం విశేషం . అంతేకాదు..టోర్నీలోనే హసరంగా టాప్ వికెట్ టేకర్ గా ఉన్నాడు.