సిద్దిపేటలో కలపడంతో  సింగరేణి జాబ్స్ కు నాన్ లోకల్

సిద్దిపేటలో కలపడంతో  సింగరేణి జాబ్స్ కు నాన్ లోకల్
  • సిద్దిపేటలో కలపడంతో  సింగరేణి జాబ్స్ కు నాన్ లోకల్
  • లోకల్ రిజర్వేషన్ కోల్పోయిన 8 మండలాల నిరుద్యోగులు 
  • ఉమ్మడి వరంగల్, కరీంనగర్  నుంచి విడదీయడంతో నష్టం 
  • తమనూ లోకల్స్ గా పరిగణించాలని  నిరుద్యోగుల విజ్ఞప్తి

వరంగల్ ప్రతినిధి, వెలుగు:   రాష్ట్ర ప్రభుత్వం చేసిన జిల్లాల పునర్విభజన ఎనిమిది మండలాల నిరుద్యోగులకు నష్టం తెచ్చి పెట్టింది. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి తీసి సిద్దిపేట‌‌ జిల్లాలో కలపడంతో ఆయా మండలాల నిరుద్యోగులు సింగరేణి ఏరియాకు నాన్ లోకల్స్ గా మారిపోయారు. దీంతో వారు సింగరేణి కాలరీస్ లిమిటెడ్ ఉద్యోగాల్లో లోకల్ రిజర్వేషన్ ను పొందే చాన్స్ కోల్పోయారు. గతంలో వరంగల్ జిల్లాలో ఉన్న చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, దూల్మిట్ట, కరీంనగర్ జిల్లాలో ఉన్న హుస్నాబాద్, కోహెడ, బెజ్జంకి, అక్కన్నపేట మండలాలను జిల్లాల పునర్విభజనలో భాగంగా ప్రభుత్వం సిద్దిపేట‌‌ జిల్లాలో కలిపింది. సింగరేణి జాబ్స్ కు వీరినీ లోకల్స్ గా పరిగణిస్తామని చెప్పినా.. ఆన్ లైన్ లో అప్లై చేసుకునేటప్పుడు ఈ మండలాలను నాన్ లోకల్ కేటగిరీలో చూపడంతో ఆయా మండలాల నిరుద్యోగులు నష్టపోయే పరిస్థితి వచ్చింది. 

95% ఉద్యోగాలు లోకల్ వాళ్లకే 

సింగరేణి కాలరీస్ సంస్థ జూన్ 18న 177 జూనియర్‌‌ అసిస్టెంట్‌‌ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఇందులో 95 శాతం ఉద్యోగాలను స్థానిక(ఉమ్మడి జిల్లాలైన వరంగల్, ఖమ్మం, కరీంనగర్‌‌, ఆదిలాబాద్‌‌ జిల్లాలు) అభ్య ర్థులతో భర్తీ చేస్తామని ప్రకటించారు. మిగిలిన 5 శాతం పోస్టులను అన్‌‌ రిజర్వ్ డ్‌‌ కోటా కింద మిగతా ఉమ్మడి జిల్లాల అభ్యర్థులకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. అయితే ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో గతంలో సింగరేణి ఏరియాలో ఉన్న మండలాలు జిల్లాల పునర్విభజన జరిగాక కూడా అవే జిల్లాల్లో కొనసాగుతున్నాయి. కానీ ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని 8 మండలాలు సిద్దిపేట‌‌లోకి వెళ్లడంతో ఆ మండలాల నిరుద్యోగులు 95 శాతం లోకల్ రిజర్వేషన్ ను కోల్పోయి 5 శాతం అన్ రిజర్వ్ డ్ కేటగిరీలో జాబ్ కోసం పోటీ పడాల్సి వస్తోంది. అందుకే తమ మండలాలను కూడా లోకల్ కేటగిరీలో చేర్చాలని, ఆన్ లైన్ అప్లికేషన్ లో మార్పులు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పదో తేదీతో ముగియనున్న అప్లికేషన్ గడువును పొడిగించాలని కూడా కోరుతున్నారు. 

నాన్ లోకల్ గా  మార్చడం అన్యాయం 

నోటిఫికేషన్ లో పేర్కొన్నట్లు ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని పాత మండలాలన్ని లోకల్ కేటగిరీలోకి రావా లి. కానీ ఆన్ లైన్ లో సిద్దిపేటలోని 8 మండలాలను నాన్ లోకల్ కేటగిరీలో చూపుతున్నారు. ఇది అన్యాయం. దీంతో భవిష్యత్​లో సింగరేణికి సంబంధించిన ఉద్యోగాలలో మేం నష్టపోవాల్సి వస్తుం ది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన మా మండలాలను లోకల్ కేటగిరీలోకి మార్చాలి. అప్లికేషన్ గడువును  పెంచాలి. 

- పృథ్వీరాజ్, అక్కన్నపేట మండలం