
బెంగళూరు: హార్ట్ అటాక్ 26 ఏళ్ల యువకుడి ప్రాణాన్ని బలి తీసుకుంది. ఆ యువకుడు వైద్య విద్యార్థి కావడం గమనార్హం. కర్ణాటకు చెందిన వైద్య విద్యార్థి తమిళనాడు ట్రిప్కు వెళ్లిన సందర్భంలో హార్ట్ అటాక్తో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని బాగల్ కోట్ వీవీఎస్ మెడికల్ కాలేజ్లో వైభవ్ అనే యువకుడు ఎంబీబీఎస్ చదువుతున్నాడు.
ఫైనలియర్ చదువుతున్న వైభవ్ తమిళనాడుకు ట్రిప్కు వెళ్లాడు. టూర్ ముగించుకుని తిరిగి వచ్చాక.. శ్వాస తీసుకోవడానికి వైభవ్ ఇబ్బందిపడ్డాడు. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న వైభవ్ను అతని స్నేహితులు బెంగళూరులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతున్న క్రమంలో వైభవ్ చనిపోయాడు. హార్ట్ అటాక్ కారణంగా వైభవ్ చనిపోయాడని వైద్యులు తెలిపారు.
ALSO READ | ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు బీవీ పట్టాభిరామ్ కన్నుమూత
దేశంలో గుండె పోటుతో చనిపోతున్న వారి సంఖ్య ఈ మధ్య కాలంలో క్రమంగా పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా.. చిన్నవయసులోనే చాలా మంది ప్రాణాలు కోల్పతున్నారు. ఏదో ఒక పనిచేస్తూ ఒక్కసారిగా కార్డియాక్ అరెస్ట్తో కుప్పకూలుతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. వ్యాయమం చేస్తూ ఒకరు, డ్యాన్స్ చేస్తూ మరొకరు, కూర్చున్న వారు కూర్చున్నట్టే క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది.
పట్టరాని ఆనందం వచ్చినా, భయాందోళలకు గురైనా గుండె కొట్టుకునే వేగం పెరగడం సాధారణం. కానీ ఏ కారణం లేకుండానే కేవలం కొన్ని సెకన్ల పాటు గుండె వేగంగా కొట్టుకోవడం, తరుచూ అలా జరగడం గుండెపోటు లక్షణం అని వైద్యులు చెబుతున్నారు. పురుషుల్లో గుండెపోటు కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.