స్పోర్ట్స్ పర్సన్స్ కామన్‌గా 36 ఏండ్లకే రిటైర్మెంట్ తీసుకుంటారు. కానీ, ఈమె మాత్రం తన కెరీర్‌ను 36 ఏండ్ల తర్వాత స్టార్ట్ చేసింది. 20 ఏండ్ల వయసున్న వాళ్లతో పోటీ పడుతోంది. రన్నింగ్ రేస్‌లో దూసుకుపోతోంది. ఎవరి గైడెన్స్.. కోచింగ్ లేకున్నా.. ఆత్మవిశ్వాసం, పట్టుదలతో రన్నింగ్ రాణిగా పేరు తెచ్చుకుంది. తాను పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఈవెంట్లో టాప్‌లో నిలుస్తోంది కమ్మరి సరస్వతి.
సరస్వతిది పాలమూరు జిల్లా మహ్మదాబాద్. స్థానిక జిల్లా పరిషత్ గర్ల్స్ హైస్కూల్లో టెన్త్ వరకు చదివింది. ఆ తర్వాత ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్, పాలమూరులోని ఎంవీఎస్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత టీటీసీ కూడా చేసింది. ప్రస్తుతం ఓ ప్రైవేట్ స్కూల్లో నెలకు ఐదు వేల రూపాయల శాలరీకి తెలుగు టీచర్‌గా పనిచేస్తోంది. స్కూల్ డేస్ నుంచే రన్నింగ్ కాంపిటీషన్లలో పార్టిసిపేట్ చేసేది. అంతేకాదు ఎన్నో పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది కూడా. డిగ్రీ తర్వాత 2004లో సత్యనారాయణ చారిని పెండ్లి చేసుకుంది. తర్వాత ఇంటి పనులు, పిల్లలతోనే సరిపోయేది. దాంతో రన్నింగ్ కెరీర్‌కి బ్రేక్ పడింది. ఇంటి పట్టునే ఉంటూ పిల్లల ఆలనా పాలనా చూసుకునేది. అయితే, 2019లో ఈమెకు అనుకోకుండా ఓ అవకాశం వచ్చింది. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ స్టేట్ లెవల్‌లో ‘అమ్మా నాన్నల హల్చల్’ పేరుతో స్పోర్ట్స్ ఈవెంట్ పెట్టారు. అందులో రన్నింగ్ విభాగంలో పార్టిసిపేట్ చేసి సెకండ్ ప్లేస్‌లో నిలిచింది.
సెకండ్ ఇన్నింగ్స్
స్టేట్ లెవెల్ పోటీల్లో సత్తా చాటగానే ఆమెలో రన్నింగ్‌పై కొత్త ఆశలు చిగురించాయి. అప్పుడే రన్నింగ్ పోటీల్లో పాల్గొనాలని డిసైడ్ అయింది. దాంతో సెకండ్ ఇన్నింగ్స్‌ని మొదలుపెట్టింది సరస్వతి. మొదట జిల్లా స్థాయిల్లో జరిగిన రన్నింగ్ కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేసింది. కొత్తకోట, జడ్చర్ల మండలం మల్లెబోయిన్పల్లిలో పెట్టిన మూడు కిలోమీటర్ల రన్నింగ్ రేస్‌లో ఫస్ట్ ప్రైజ్ అందుకుంది. అదే ఏడాది పాలమూరు స్టేడియం గ్రౌండ్లో పది కిలోమీటర్ల జిల్లా స్థాయి మీట్లో పాల్గొని ఫస్ట్‌ప్లేస్‌లో నిలిచింది. ఆ తర్వాత స్టేట్, నేషనల్ లెవల్‌లో జరిగే ఎన్నో పోటీల్లో పార్టిసిపేట్ చేసింది. ఈ ఏడు ఏప్రిల్ 4న జయశంకర్ భూపాలపల్లిలోని అంబేద్కర్ స్టేడియంలో జరిగిన మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలకు సెలక్ట్ అయింది. 10 కిలోమీటర్ల రేస్‌లో పార్టిసిపేట్ చేసి గోల్డ్ మెడల్ సాధించింది. అక్కడి నుంచి నేషనల్ లెవల్‌కు కూడా సెలక్ట్ అయింది. అంతేకాదు ఏప్రిల్ 27 నుంచి మే 1వ తేదీ వరకు చెన్నైలో జరిగిన మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో పార్టిసిపేట్ చేసింది. పది కిలోమీటర్ల రన్నింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించింది. ఆసియాలో జరిగే అథ్లెటిక్స్ పోటీలకు సరస్వతిని పంపే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఆమె వయసు 40 ఏండ్లకు పైనే.
టికెట్ ఛార్జీలకు కూడా పైసల్లేవ్
సరస్వతి భర్త వడ్రంగి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వాళ్ల పిల్లలు భీష్మాచారి పది, మణికంఠ ఎనిమిదో క్లాస్ చదువుతున్నారు. సొంతిల్లు కూడా లేదు వాళ్లకు. కుటుంబం గడవడమే కష్టం. వేరే రాష్ట్రాల్లో జరిగే రన్నింగ్ పోటీలకు వెళ్లేందుకు డబ్బులు కూడా లేవు. టికెట్ ఛార్జీలకు కూడా ఇబ్బంది అవుతుందని చెప్తోంది సరస్వతి. అందుకే ఆమె కూడా వడ్రంగి పనుల్లో భర్తకు సాయం చేస్తోంది. సంగడి పట్టడం, మిషన్ రంపంతో కోయడం, డ్రిల్స్ వేయడం, ఉలితో తొలవడం, కట్టె ఫినిషింగ్ చేయడం, కిటికీలు, చౌకట్లు, పీటలు తయారు చేయడం లాంటి పనులు చేస్తోంది. దాంతో వచ్చే పైసలను కూడబెట్టుకుని టిక్కెట్లు కొనుక్కుంటోంది.
ఇంటర్నేషనల్ లెవల్‌లో ఆడతా..
నేషనల్ లెవల్‌లో నా టాలెంట్ ప్రూవ్ చేసుకున్నా. ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవల్‌లో ఆడాలని ఉంది. రన్నింగ్‌లో దేశానికి గోల్డ్ మెడల్ తీసుకురావాలని ఉంది. ప్రభుత్వం సాయం చేస్తే బాగుంటుంది. వేరే రాష్ట్రాలు, దేశాల్లో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు ఆర్థిక సాయం చేయాలి. స్పోర్ట్స్ కోటాలో ఏదైనా ఉద్యోగం ఇస్తే..
నా కుటుంబానికి బాసటగా ఉంటుంది.
- సరస్వతి
:: ధరణి కాంత్ అక్కల, హస్నాబాద్ రామకృష్ణారెడ్డి, వెలుగు
