
నోరా ఫతేహి పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చేవి స్పెషల్ సాంగ్స్. టెంపర్ మొదలు బాహుబలి, కిక్ 2, లోఫర్, ఊపిరి, మట్కా సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిందామె. తెలుగే కాదు హిందీ చిత్రాల్లోనూ తనదైన డ్యాన్స్ మూమెంట్స్‌తో ఇంప్రెస్ చేసింది. తాజాగా హిందీ చిత్రం ‘థామా’లోనూ ఆమె ఓ ప్రత్యేక గీతంలో కనిపించింది. ‘దిల్‌బర్ కీ ఆంఖోం కా..’ అంటూ సాగే ఈ పాటను మంగళవారం (అక్టోబర్ 07) విడుదల చేశారు.
సచిన్ జిగర్ కంపోజ్ చేయగా, రశ్మిత్ కౌర్, జిగర్ సరైయా పాడారు. ఈ పాట విడుదల సందర్భంగా నోరా స్పందించింది. ‘‘సత్యమేవ జయతే’ చిత్రంలోని దిల్‌బర్ పాట నాకు ఎంతగా గుర్తింపు తెచ్చిందో.. ‘స్త్రీ’లోని కమారియా పాట కూడా అంతే గుర్తింపును తెచ్చింది. ఒకే టైమ్‌లో షూటింగ్ చేసిన ఆ రెండు పాటలతో బాలీవుడ్‌లో నేను ఫేమస్ అయ్యాను.
ఇప్పుడు ‘థామా’లో చేసిన స్పెషల్ సాంగ్ కూడా అదే స్థాయిలో గుర్తింపు తెస్తుందని ఆశిస్తున్నా. నా అభిమానులు గత కొంతకాలంగా ఇలాంటి స్పెషల్ సాంగ్స్‌లో నన్ను మిస్ అయ్యారు. ఈ పాటలోని హుక్ స్టెప్స్‌తో మరోసారి ఆ వైబ్‌ని తీసుకురాబోతున్నా..”అని ఆమె చెప్పింది. ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న జంటగా ఆదిత్యా సర్పోత్దార్ దర్శకత్వంలో మాడాక్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 21న విడుదల కాబోతోంది.