నార్త్ కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ ఓ వింత నిర్ణయం తీసుకున్నాడు. ఆ దేశంలో ఎవరూ తన స్టైల్ కాపీ కొట్టకుండా ఆదేశాలిచ్చాడు. సుప్రీం లీడర్ కిమ్ వేసుకున్న లెదర్ కోట్‌ను పోలినవి మరెవరూ వేసుకోకూడదని, దేశంలో లెదర్ కోట్లను నిషేధించాడు. ఈ మేరకు నార్త్ కొరియా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు రేడియో ఫ్రీ ఏషియా పేర్కొంది. 2019 డిసెంబర్‌లో మొదటిసారి కిమ్ జాంగ్ ఉన్ బ్లాక్ లెదర్ కోట్ వేసుకుని కనిపించారు. దీంతో ఆ దేశంలో ఉన్నత వర్గాల వాళ్లు కిమ్‌ను ఫాలో అవుతూ వాటిని వేసుకుని తిరుగుతూ కనిపిస్తున్నారు. తమ దేశాధినేత స్టైల్ ఫాలో అవుతూ బయట కనిపిస్తున్నారు.
మరోవైపు కరోనా ఆంక్షలు ఎత్తేశాక ఇటీవల ఉత్తర కొరియాలోని మార్కెట్లలోకి నకిలీ లెదర్ కోట్లు ఎక్కువగా వచ్చిపడుతున్నాయి. దీంతో ఈ నకిలీలను అరికట్టేందకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ నకిలీ లెదర్ కోట్లను అమ్ముతున్న షాపులపై రైడ్స్ చేస్తున్నారు. ఈ రకమైన ఫేక్ కోట్లను ప్రజలు వేసుకోని తిరగడం తమ దేశాధినేతను అవమానించడమేనని పోలీసులు చెప్పినట్లు రేడియో ఫ్రీ ఏషియా పేర్కొంది. అందుకే ఇకపై సుప్రీం లీడర్ స్టైల్‌ను ఎవరూ ఫాలో కావొద్దని నిషేధాజ్ఞలు విధించినట్లు తెలిపింది.
