నా బిడ్డ పేరున్న వాళ్లంతా పేర్లు మార్చుకోవాలి: కిమ్ జోంగ్

నా బిడ్డ పేరున్న వాళ్లంతా పేర్లు మార్చుకోవాలి: కిమ్ జోంగ్

మోడ్రన్ హిట్లర్ గా పేరు తెచ్చుకున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ మరోసారి సంచలన నిర్ణయంతో వార్తల్లోకెక్కారు. వింత వింత నిబంధనలు పెడుతూ అక్కడి ప్రజలను మూడు చెరువుల నీళ్లు తాగించే కిమ్.. ఈ సారి మరో రూల్ తీసుకొచ్చారు. తన కూతురు జు ఏ పేరును ఇంకెవరు కలిగి ఉన్నా... వారు వెంటనే పేరు మార్చుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. గత కొన్ని రోజుల క్రితమే తన రెండో కూతురు జు ఏను కిమ్ ప్రపంచానికి పరిచయం చేశారు. దీంతో ఉత్తర కొరియాకు కాబోయే వారసురాలు ఆమెననే రూమర్స్ కూడా వచ్చాయి. 

ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 8న జు ఏ పేరున రిజిష్టర్ చేసుకున్న మహిళలను పిలిపించి, వెంటనే తమ పేర్లను మార్చుకోవాల్సిందిగా ఆదేశించారు. అయితే వారు పేరు మార్చుకోవడానికి ఒక వారం గడువు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఉత్తర కొరియాలో ఈ రకమైన ఆంక్షలు విధించడం ఇదేం మొదటిసారి కాదు. అప్పట్లో తన భార్య సోల్ జు పేరుతో ఉన్న వారిని కూడా తమ పేర్లను మార్చుకోవాలని ఆదేశించడం గమనార్హం. కాగా గత వారం రోజుల క్రితం జరిగిన ఆర్మీ ఫౌండేషన్ డే సందర్భంగా నిర్వహించిన సైనిక కవాతుకు అధ్యక్షుడు కిమ్ తో పాటు, అతని 9ఏళ్ల జు ఏ కూడా హాజరై అందర్నీ ఆకర్షించింది.