ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కరెంటోళ్ల ప్రజాబాట..17 సర్కిళ్ల పరిధిలో టీజీఎన్పీడీసీఎల్ నయా ప్రోగ్రాం

ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కరెంటోళ్ల ప్రజాబాట..17 సర్కిళ్ల పరిధిలో టీజీఎన్పీడీసీఎల్ నయా ప్రోగ్రాం
  • వారానికి మూడు రోజులు గల్లీల్లో డీఈ, ఏడీఈలు
  • సమస్యల గుర్తింపు.. 24 గంటల్లోపు క్లియర్‍
  • వరంగల్​లో కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎండీ వరుణ్‍రెడ్డి

వరంగల్‍, వెలుగు: ఉత్తర తెలంగాణ జిల్లాల్లో విద్యుత్‍ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కరెంటోళ్లు ప్రజాబాటకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ నార్తర్న్​ పవర్‍ డిస్ట్రిబ్యూషన్‍ కంపెనీ లిమిటెడ్‍ (టీజీఎన్‍పీడీసీఎల్‍) ఆధ్వర్యంలో 17 జిల్లాల సర్కిళ్ల పరిధిలో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. పెద్దాఫీసర్లు స్వయంగా వినియోగదారుల వద్దకు వెళ్లి కరెంటు సమస్యలు తెలుసుకుని తక్షణమే పరిష్కరించేందుకు సమాయత్తం అయ్యారు. మంగళవారం గ్రేటర్‍ వరంగల్​లో టీజీఎన్‍పీడీసీఎల్‍ సీఎండీ వరుణ్‍రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాల్లో ఆఫీసర్లు గల్లీలు, గ్రామాల బాట పట్టారు. 

ఫీల్డులో డీఈ, ఏడీఈలు..

విద్యుత్‍ వైర్‍ తెగిందని, కరెంట్‍ పోల్‍ వంగిందని, హాఫ్‍ కరెంట్‍ వస్తోందని, ట్రాన్స్​ఫార్మర్​లో రిపేర్లతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలుగుతోందని ఇంతకుముందు బాధితుల నుంచి ఫిర్యాదులు వస్తేనే అధికారులు స్పందించేది. ఇక నుంచి నేరుగా ప్రజల్లోకి వెళ్లి సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు విద్యుత్‍ శాఖ సీఎండీ ప్రజాబాట మొదలుపెట్టారు. 

వారంలో మూడు రోజులు మంగళ, గురు, శనివారం అన్ని సర్కిళ్ల డీఈలు, ఏడీఈ, ఏఈ స్థాయి అధికారులు స్వయంగా ప్రజల్లోకి వెళ్లాలని కార్యక్రమాన్ని రూపొందించారు. 11 కేవీ ఫీడర్ల వారీగా గ్రామాలను షెడ్యూల్‍ చేసి ఆఫీసర్లు ఏరోజు ఏ ప్రాంతానికి వెళ్తున్నారనే సమాచారాన్ని ముందురోజే వాట్సాప్‍ గ్రూపుల ద్వారా వినియోగదారులకు అందించాల్సి ఉంది. ఏఈ, స్థానిక సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో పట్టణాలు, గ్రామాలవారీగా వినియోగదారులను నేరుగా కలిసి సమస్యలను ఫిర్యాదుల బుక్‍లో చేర్చడం ద్వారా వేగవంతంగా సమస్యను పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నారు.

స్పాట్​లో సమస్య పరిష్కరించేలా..

ప్రజాబాటలో భాగంగా ఉన్నతాధికారులు విద్యుత్‍ సమస్యలను తెలుసుకునే క్రమంలో 11 కేవీ లైన్లు, డీటీఆర్‍ స్ట్రక్చర్లు, ఎల్‍టీ లైన్లలోని లోపాలను అక్కడికక్కడే గుర్తించి సరిచేయాల్సి ఉంది. లేదంటే 24 గంటల్లో క్లియర్‍ చేయాలి. కరెంట్‍ పోవడానికి కారణమయ్యే ట్రిప్పింగ్‍ ఫీడర్లలో క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టాల్సి ఉంటుంది. 

లోడ్‍ బ్యాలెన్స్, ఫీడర్‍ విభజన, పగిలిపోయిన ఇన్సులెటర్లు, సక్రమంగా లేని జంపర్లను సరిచేయాల్సి ఉంది. వివిధ కారణాలతో వంగిపోయిన కరెంట్‍ పోల్స్, రెక్టిఫికేషన్​లో లెవల్‍ రోడ్‍ క్రాసింగ్‍లను గుర్తించి వెంటనే సరిచేయాలి. అనవసర ఎల్‍సీలను నివారించడానికి ఏబీ స్విచ్‍లను ఏర్పాటు చేయాలి. లైన్లలో కెపాసీటర్లను పెట్టడం, ఎల్‍టీ లూజ్‍ లైన్లను స్ట్రింగ్‍ చేయడం, అవసరం మేర డీటీఆర్‍ సామర్థ్యం పెంపు వంటివి వెనువెంటనే క్లియర్‍ చేయడం ద్వారా ప్రజాబాటలో వినియోగదారుల నుంచి పాజిటివ్ ఫీడ్‍బ్యాక్‍ వచ్చేలా సీఎండీ కార్యాచరణ రూపొందించారు.

సేవలను మరింత స్పీడప్‍ చేయడమే లక్ష్యం..

ప్రజల నుంచి స్వయంగా విద్యుత్‍ సమస్యలను తెలుసుకుని వేగవంతంగా పరిష్కరించడమే లక్ష్యంగా ప్రజాబాట రూపొందించినట్లు టీజీఎన్‍పీడీసీఎల్‍ సీఎండీ కర్నాటి వరుణ్‍రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన గ్రేటర్ వరంగల్‍ హనుమకొండ సర్కిల్​లోని ఎస్‍ఎస్‍ 29, భవాని నగర్‍, నక్కలగుట్ట సెక్షన్‍లో ప్రజాబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు ఆఫీసర్ల వద్దకు రావడం కాకుండా.. అధికారులే ప్రజాబాటలో వారి వద్దకు వెళ్లి విద్యుత్​ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. 

డీఈ, ఏడీఈ స్థాయి అధికారులు విద్యుత్​ అంతరాయాన్ని పూర్తిగా తగ్గించి వినియోగదారుల్లో మరింత నమ్మకం పెంచాలన్నారు. కార్యక్రమంలో ఆపరేషన్‍ డైరెక్టర్‍ టి.మధుసూదన్‍, సీజీఎం కె.రాజుచౌహన్‍, హనుమకొండ ఎస్‍ఈ పి.మధుసూదన్‍ రావు, డీఈ సాంబరెడ్డి, టెక్నికల్‍ విభాగ డీఈ ఎ.విజయేందర్‍రెడ్డి, దర్శన్‍కుమార్‍, ఏడీ ఇంద్రసేనారెడ్డి, ఏఈ ప్రవీణ్‍ పాల్గొన్నారు.