ఆ ప్రాజెక్టుతో ఒక్క ఎకరానికీ సాగునీరు రాలే: షర్మిల

ఆ ప్రాజెక్టుతో ఒక్క ఎకరానికీ సాగునీరు రాలే: షర్మిల

బ్యాక్​ వాటర్​తో పంటలు మునిగిన రైతులకు పరిహారం ఇయ్యలే

జైపూర్, వెలుగు: సీఎం కేసీఆర్​ రూ.లక్షా 20 వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఒక్క ఎకరానికీ నీళ్లియ్యలేదని, తన ఫామ్​హౌస్​కు మాత్రం పట్టుకుపోతున్నారని వైఎస్ఆర్టీపీ చీఫ్​షర్మిల విమర్శించారు. కాళేశ్వరం బ్యారేజీల బ్యాక్​ వాటర్​తో ఆ ప్రాంతంలో 40 వేల ఎకరాల్లో పంటలు మునిగాయని, మూడేండ్లుగా పైసా పరిహారం ఇయ్యలేదని ఆమె మండిపడ్డారు. అప్పుల బాధతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వాపోయారు. కమీషన్ల కోసమే కేసీఆర్ ఈ ప్రాజెక్టు కట్టి రూ.70వేల కోట్లకు పైగా దోచుకున్నారని ఆరోపించారు. బుధవారం మంచిర్యాల జిల్లా చెన్నూర్​ నియోజకవర్గంలో ఆమె పాదయాత్ర చేశారు. 

భీమారం మండలం పోలంపల్లిలో మొదలైన యాత్ర జైపూర్, పెగడపల్లి, గంగిపల్లి, ఎల్కంటి, శెట్​పల్లి క్రాస్​ మీదుగా టేకుమట్ల వరకు సాగింది. టేకుమట్లలో జరిగిన బహిరంగసభలో ఆమె మాట్లాడారు. జైపూర్​లోని సింగరేణి థర్మల్​ పవర్​ ప్లాంట్​ కోసం రైతుల భూములు గుంజుకున్నారన్నారు. పవర్​ ప్లాంట్ కు భూములు త్యాగం చేసిన రైతులు అందులో లేబర్​ పనిచేస్తున్నారని, ఎదురు తిరిగిన వాళ్లను తొలగిస్తున్నారని మండిపడ్డారు. ఓపెన్​ కాస్టులతో తెలంగాణ బొందలగడ్డగా మారిందని ఆనాడు మొసలికన్నీరు కార్చిన కేసీఆర్..​ అధికారంలోకి వచ్చాక ఓపీసీలను తిరిగి తెరుస్తున్నారని చెప్పారు. వైఎస్సార్ పథకాలను కేసీఆర్​ భ్రష్టుపట్టించారన్నారు. 8 ఏండ్లలో ఎవరికీ న్యాయం చేయలేదన్నారు.. ఎమ్మెల్యే బాల్క సుమన్​.. కేసీఆర్, కేటీఆర్​కు బానిసగా మారాడని ఫైరయ్యారు.