అవినీతి బండారం బయటపడ్తదనే అసెంబ్లీకి బీఆర్ఎస్ డుమ్మా : మంత్రి జూపల్లి

అవినీతి బండారం బయటపడ్తదనే అసెంబ్లీకి బీఆర్ఎస్ డుమ్మా : మంత్రి జూపల్లి
  • ఉమ్మడి పాలమూరులో ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయలేదు: మంత్రి జూపల్లి 
  • కృష్ణా జలాల్లో 299 టీఎంసీలే చాలు అని ఒప్పుకున్నారని ఫైర్

హైదరాబాద్, వెలుగు: కృష్ణా జలాలపై చర్చిస్తే తమ అవినీతి బండారం బయటపడ్తుందన్న భయంతోనే అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ డుమ్మా కొట్టిందని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. శనివారం అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా జూపల్లి మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు నీళ్లందించడం కంటే కమీషన్లకే ప్రాధాన్యం ఇచ్చిందని మండిపడ్డారు. ‘‘బీఆర్‌‌‌‌ఎస్ నేతలు కమీషన్ల మీద పెట్టిన ధ్యాస.. కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల మీద పెట్టలేదు. కాళేశ్వరం, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ మీద చూపిన ప్రేమ.. ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టులపై చూపలేదు. కృష్ణా జలాల్లో ఏపీకి 512 టీఎంసీలు ఇచ్చి, తెలంగాణకు 299 టీఎంసీలే చాలు అని ఒప్పుకున్నారు.

పదేండ్ల పాలనలో నీటి పారుదల శాఖలో రూ.1.80 లక్షల కోట్లు ఖర్చు పెట్టినా.. పాలమూరుకు మాత్రం అన్యాయమే చేశారు. పాలమూరు ప్రాజెక్టుకు రూ.87 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా, రూ.27 వేల కోట్లు ఖర్చు చేసి 90 శాతం పనులు పూర్తి చేశామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి, డిండి, గట్టు, కరివెన ప్రాజెక్టుల్లో ఏ ఒక్కటీ పూర్తి చేయలేదు” అని ఫైర్ అయ్యారు. పాలమూరు జిల్లా బీడుగా మారడానికి కేసీఆరే కారణమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.  

కేసీఆర్ ప్లాన్ ఫెయిల్: కూనంనేని 

మళ్లీ నీళ్ల సెంటిమెంట్‌‌ను రెచ్చగొట్టి ప్రజల్లోకి రావాలని కేసీఆర్ భావించారని, కానీ అది సాధ్యం కాలేదని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఎద్దేవా చేశారు. ‘‘కేసీఆర్, హరీశ్ సభలో ఉంటే బాగుండేది. తెలంగాణ అభివృద్ధి విషయంలో వాళ్ల చిత్తశుద్ధిని రుజువు చేసుకునే అవకాశాన్ని కోల్పోయారు. కడుపు నిండా విషం అనేది నిషేధిత పదం కాదు.. అయినా బీఆర్ఎస్ వాళ్లు సభ నుంచి ఎందుకు వెళ్లిపోయారో అర్థం కావడం లేదు” అని అన్నారు.