
చెన్నై: స్టార్ హీరో, తమిళగ వెట్రికజగం (టీవీకే) చీఫ్ విజయ్ ర్యాలీలకు భారీగా ప్రజలు తరలివస్తుండటంతో అన్నాడీఎంకే పార్టీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సభలకు వచ్చే వారంతా ఓట్లు వేయరని హెచ్చరించింది. అందువల్ల రాష్ట్రంలోని అధికార డీఎంకే పార్టీని ఓడించడానికి తమతో చేతులు కలపాలని మాజీ మంత్రి రాజేంద్ర బాలాజీ తెలిపారు. డీఎంకే నేతృత్వంలోని కూటమిని అధికారం నుంచి తొలగించడానికి ఉమ్మడి ప్రతిపక్షం అవసరమని చెప్పారు.
అన్నాడీఎంకే మద్దతు లేకుండా పోటీ చేస్తే డీఎంకేను ఓడించడం సాధ్యం కాదని పేర్కొన్నారు. విజయ్ ర్యాలీలకు భారీగా ప్రజలు తరలివస్తున్నారని చెబుతూ.. వచ్చిన వారంతా ఓట్లు వేయరని వివరించారు. ‘‘ఎంజీఆర్ తర్వాత బలమైన క్యాడర్ ఉండటంతో విజయకాంత్‌ను ప్రజలు అంగీకరించారు. విజయ్ విషయంలో అది ఇంకా జరగలేదు. ఆయన ప్రజాదరణను మనం కాదనలేం. కానీ, ప్రజాదరణ అంతా ఓట్లుగా మారాలి. విజయ్ ఒంటరిగా పోటీ చేస్తే, ఓటర్లు దానిని పరోక్షంగా డీఎంకేకు సహాయం చేసినట్టుగా భావిస్తారు” అని వెల్లడించారు.