ఆపరేషన్ స్టోలెన్ కిట్ క్యాట్ ట్రాకర్ : పోయిన 4 లక్షల కిట్ క్యాట్లను ఇలా కనిపెడతారంట.. !

ఆపరేషన్ స్టోలెన్ కిట్ క్యాట్ ట్రాకర్ : పోయిన 4 లక్షల కిట్ క్యాట్లను ఇలా కనిపెడతారంట.. !

ప్రపంచవ్యాప్తంగా చాక్లెట్ లవర్స్‌ని అలరించే కిట్‌క్యాట్ ఇప్పుడు వార్తల్లో హాట్ టాపిక్‌గా మారాయి. 12 టన్నుల బరువున్న లక్షలాది చాక్లెట్ బార్లు మాయమవ్వడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. మొదట్లో ఇదంతా ఏప్రిల్ ఫూల్స్ డే సందర్భంగా కంపెనీ ఆడుతున్న డ్రామా అని.. పబ్లిసిటీ స్టంట్ అని సోషల్ మీడియాలో నెటిజన్లు అభిప్రాయపడ్డారు. దీనిపై కిట్‌క్యాట్ యాజమాన్యం అధికారికంగా స్పందించడంతో ఈ చాక్లెట్ దొంగతనం వెనక ఉన్న అసలు రహస్యం బయటపడింది.

ఈ భారీ చోరీపై కిట్‌క్యాట్ సంస్థ 'X' వేదికగా స్పందిస్తూ సంచలన ప్రకటన చేసింది. మాయమైన కిట్‌క్యాట్‌లపై ఆసక్తి కనబరిచినందుకు ధన్యవాదాలు. ఒక విషయాన్ని స్పష్టం చేయాలనుకుంటున్నాం.. ఇది ఎటువంటి పబ్లిసిటీ స్టంట్ లేదా ఏప్రిల్ ఫూల్స్ జోక్ కాదు. ఎవరో నిజంగానే 12 టన్నుల కిట్‌క్యాట్‌లను దొంగిలించారు. అవి ఎక్కడికి వెళ్లాయో తెలుసుకోవాలని మేము చాలా సీరియస్‌గా ఉన్నాం అంటూ కంపెనీ వివరణ ఇచ్చింది. ఈ ప్రకటనతో నెటిజన్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు. సాధారణ దొంగతనం కాకుండా ఇంత భారీ స్థాయిలో రవాణాలో ఉన్న సరుకు మాయమవ్వడం వెనక పెద్ద నెట్‌వర్క్ ఉందని కంపెనీ భావిస్తోంది.

ఈ మిస్టరీ వెనక ఉన్న లెక్కలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. సెంట్రల్ ఇటలీ నుంచి పోలాండ్ వెళ్తున్న ట్రక్కులో సుమారు 4 లక్షల 14వేల చాక్లెట్ యూనిట్లు ఉన్నాయి. యూరప్‌లోని వివిధ దేశాలకు పంపిణీ చేయాల్సిన ఈ కొత్త రేంజ్ చాక్లెట్లు మార్గమధ్యలోనే అదృశ్యమయ్యాయి. ఇదొక ప్లాన్డ్ లాజిస్టిక్స్ ఆపరేషన్ అని, ట్రక్కును.. అంత భారీ సరుకును తరలించడం సామాన్యమైన విషయం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దొంగిలించిన ఈ చాక్లెట్లు మార్కెట్లోకి రాకుండా అడ్డుకోవడానికి నెస్లే యాజమాన్యం కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది.

చోరీకి గురైన చాక్లెట్లను కనిపెట్టేందుకు కంపెనీ 'స్టోలెన్ కిట్‌క్యాట్ ట్రాకర్' అనే టూల్‌ను లాంచ్ చేసింది. ప్రతి కిట్‌క్యాట్ బార్‌పై ఒక యూనిక్ కోడ్ ఉంటుందని.. వినియోగదారులు ఆ కోడ్‌ను స్కాన్ చేసి తాము కొన్న చాక్లెట్ దొంగిలించబడిన బ్యాచ్‌లోనిదా కాదా అని చెక్ చేసుకోవచ్చని తెలిపింది. ఒకవేళ అది దొంగిలించబడిన సరుకు అని తేలితే.. వెంటనే కంపెనీకి సమాచారం అందించాలని కోరింది. సోషల్ మీడియాలో దీనిపై రకరకాల మీమ్స్ వస్తున్నప్పటికీ, కిట్‌క్యాట్ మాత్రం తన పోయిన చాక్లెట్లను వెతికే పనిలో చాలా సీరియస్‌గా పనిచేస్తోంది.