పూర్తి కాని బిల్డింగ్​ టీ హబ్ ఫేజ్‌‌ 2

పూర్తి కాని బిల్డింగ్​ టీ హబ్ ఫేజ్‌‌ 2
  • రోజురోజుకీ లేట్ అవుతున్న టీహబ్ ఫేజ్‌‌ 2
  •  రాయదుర్గంలో 3 లక్షల చ.అడుగుల్లో నిర్మాణం
  •   ఈ ఏడాది చివరికి పూర్తవుతుందని అంచనా

టీ హబ్.. వన్ ఆఫ్ ది బెస్ట్ స్టార్టప్ ఇంక్యుబేటర్ ఇన్ ఇండియా.  స్టార్టప్ పెట్టాలనుకునే ప్రతీ ఒక్కరి డ్రీమ్, టీ హబ్‌‌లో ఇంక్యుబేట్ అవ్వాలనే ఉంటుంది. ఇందులో మెంటార్ షిప్ పొందిన ఎన్నో స్టార్టప్స్ ఇప్పటికే బయటకి వచ్చి మార్కెట్లో సక్సెస్ అయ్యాయి. బెస్ట్ స్టార్టప్ ఇకో సిస్టమ్ ఇక్కడ ఉండటంతో టీ హబ్‌‌కి డిమాండ్ పెరిగింది.. దీంతో మరిన్ని స్టార్టప్స్‌‌కి ఊతమివ్వాలనుకుని టీ హబ్ ఫేజ్‌‌ 2 ని ప్రారంభిస్తామని  ప్రభుత్వం ప్రకటించింది. కానీ దీని ఏర్పాటు మాత్రం రోజురోజుకీ లేట్ అవుతోంది.

హైదరాబాద్, వెలుగు : స్టార్టప్.. దేశీయ బిజినెస్ రంగంలో కొత్త జోష్ సృష్టిస్తున్న పేరు. ఒక వినూత్న ఐడియాతో సామాన్యుడు కుబేరుడుగా మారేందుకు దోహదం చేసేదే స్టార్టప్.  అయితే ప్రస్తుత కాలంలో స్టార్టప్స్‌‌కి మెంటర్ షిప్ అండో ఇకో సిస్టమ్  చాలా అవసరం. ఇలాంటి స్టార్టప్స్‌‌కి ఊతమివ్వడానికి తెలంగాణ ప్రభుత్వం టీ హబ్‌‌ని ప్రారంభించింది. 2015లో రతన్ టాటా చేతుల మీదుగా టీ హబ్ ప్రారంభమైంది.  గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీలో 35 కోట్లతో 60వేల చదరపు అడుగుల్లో ప్రారంభించారు. టీ హబ్ ఏర్పాటు చేసిన తర్వాత ఇందులో ఇంక్యుబేట్ అయ్యే స్టార్టప్స్‌‌కి బెస్ట్ ఇకో సిస్టమ్ ఏర్పడింది. ఇందులో ఉండే స్టార్టప్స్‌‌కి మెంటర్ షిప్‌‌తో పాటు ఫండ్స్ కూడా వచ్చాయి. స్టార్టప్స్ పై కాన్ఫరెన్సులు, ఇండస్ట్రీ లీడర్స్‌‌తో లెక్చర్స్ ఇలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఇక్కడ నిర్వహించడంతో ఇందులోని స్టార్టప్స్ డెవలప్ అవుతూ వచ్చాయి. రెగ్యులర్ స్టార్టప్స్‌‌తో పాటు ల్యాబ్ 32 పేరుతో 6 నెలల స్టార్టప్స్ ప్రోగ్రామ్ కూడా ఇందులో నిర్వహిస్తున్నారు. ఆరు నెలలపాటు ఆయా స్టార్టప్స్‌‌కి టీ హబ్ మెంటర్ షిప్ ఇస్తోంది. దేశంలోనే బెస్ట్ స్టార్టప్ ఇంక్యుబేటర్‌‌‌‌గా టీ హబ్ నిలిచింది. దేశ విదేశాల నుంచి ఇండస్ట్రీ లీడర్స్, ఏంజెల్ ఇన్వెస్టర్స్ టీ హబ్‌‌ని సందర్శించారు. దీంతో టీ హబ్‌‌లో ఇంక్యుబేట్ అవ్వాలనుకునే స్టార్టప్స్ సంఖ్య పెరిగిపోయింది.

టీ హబ్ సక్సెస్ అవ్వడంతో టీహబ్ ఫేజ్‌‌ 2ని ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం రాయదుర్గంలో రూ.300 కోట్లతో ఫేజ్‌‌ 2 ని నిర్మిస్తోంది. ఇప్పుడున్న టీ హబ్‌‌కి నాలుగు రెట్లు పెద్దదిగా మూడు లక్షల చదరపు అడుగుల్లో దీన్ని నిర్మిస్తున్నారు. దేశంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్‌‌‌‌గా టీహబ్ నిలవనుందని ప్రభుత్వం ప్రకటించింది. స్టార్టప్స్‌‌కి సహకారమందించేందుకు ఏర్పాటు చేస్తున్న ఈ స్టార్టప్ ఇంక్యుబేటర్ గతేడాది డిసెంబర్‌‌‌‌లోగా ఏర్పాటు చేయనున్నామని ప్రకటించింది. కానీ ఈ బిల్డింగ్ నిర్మాణంలో మాత్రం  రోజురోజుకి ఆలస్యమవుతోంది. విభిన్న మోడల్‌‌లో యూనిక్ బిల్డింగ్‌‌గా నిర్మించడానికి సమయం ఎక్కువ తీసుకుంటోంది. ఆ తర్వాత ఈ ఏడాది జూన్ చివరి కల్లా ఏర్పాటు చేస్తామని ప్రకటించినా అంతగా పురోగతి సాధించలేదు. బిల్డింగ్ నిర్మాణం జాప్యమవుతుందని గ్రహించిన ప్రభుత్వం ఈ డిసెంబర్‌‌‌‌ని టార్గెట్‌‌గా పెట్టుకుంది. దేశంలో ఉన్న స్టార్టప్స్‌‌లో రాష్ట్రానికి చెందిన స్టార్టప్స్ 20 శాతం వాటా కలిగి ఉన్నాయి. సుమారు నాలుగు వేలకు పైగా స్టార్టప్స్ రాష్ట్రంలో ఉన్నాయి. ఇప్పటికే స్టార్టప్స్‌‌కి క్యాపిటల్ హబ్‌‌గా మారిన హైదరాబాద్, టీ హబ్ ఫేజ్‌‌ 2తో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్‌‌‌‌తో పాటు ది బెస్ట్ ఇకో సిస్టమ్ ఉన్న సిటీ గా హైదరాబాద్ మారనుంది. ట్రిపుల్ ఐటీలో ఉన్న టీహబ్ బిల్డింగ్‌‌ను కూడా యూనిక్ డిజైన్ తో నిర్మించారు. ఇక టీ హబ్ ఫేజ్‌‌ 2 కూడా డిఫరెంట్ డిజైన్‌‌తో వస్తోంది. రాయదుర్గంలోని నోవార్టిస్ ఆఫీస్ పక్కన మూడెకరాల స్థలంలో టీహబ్ ఫేజ్‌‌ 2ని నిర్మిస్తున్నారు. జీ ప్లస్ నైన్ ఫ్లోర్స్ ఈ బిల్డింగ్స్‌‌లో ఉండనున్నాయి. దీనితో పాటు టూ సెల్లార్స్ కూడా ఉంటాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టీహబ్ ఫేజ్‌‌ 2 తొందరగా పూర్తయి అందుబాటులోకి వస్తే ఇంక్యుబేషన్ అండ్ మెంటర్ షిప్ కోసం వెయిట్ చేస్తున్న స్టార్టప్స్‌‌కి దారి చూపినట్లువుతుంది.

టీ హబ్ ఫేజ్‌‌ 2 నిర్మాణం లేట్ అవుతోంది. అనుకున్న సమయానికి పూర్తి కావట్లేదు. ఈ ఏడాదిలోపు బిల్డింగ్ పూర్తిగా నిర్మాణం అయ్యేలా లేదు. ఇప్పటికే జాప్యమవుతోంది కాబట్టి ఈ డిసెంబర్ వరకు కనీసం ప్రస్తుతం టీహబ్ ఫేజ్ 1లో ఎంత స్పేస్ అందుబాటులో ఉందో… అంత అయినా పూర్తి చేయాలని టార్గెట్‌‌గా పెట్టుకున్నాం. 60వేల చదరపు అడుగుల్లో అయినా అందుబాటులోకి తీసుకొచ్చి ఈ ఏడాది చివరికి టీహబ్ ఫేజ్‌‌ 2ని ప్రారంభిస్తాం..

– జయేష్ రంజన్, ఐటీ సెక్రెటరీ