రేషన్ ​కార్డులు లేవని లోన్లు ఇస్తలేరు

రేషన్ ​కార్డులు లేవని లోన్లు ఇస్తలేరు
  • రుణాలకు 1.73 లక్షల అప్లికేషన్లు
  • రెండేళ్లుగా నిలిచిన రేషన్ కార్డుల జారీ
  • రుణాలతో లింకు పెట్టడంతో తప్పని ఇక్కట్లు

జగిత్యాల, వెలుగు: ఎస్సీ నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వ కార్పొరేషన్ రుణాల ప్రణాళికలు విడుదల చేసింది. వివిధ రకాల స్కీమ్స్ కోసం నిరుద్యోగుల నుంచి ఫిబ్రవరి 10 వరకు ఆన్ లైన్ లో అప్లై చేయడానికి అవకాశం ఇచ్చింది. అయితే వీటికి రేషన్ కార్డులతో లింకు పెట్టడంతో  నిరుద్యోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. రెండేళ్లుగా సర్కారు రేషన్​కార్డుల జారీని నిలిపివేయడంతో అర్హులైనా రుణాలు అందని పరిస్థితి ఏర్పడుతోంది.

రాష్ట్ర ప్రభుత్వం అనాలోచిత విధానాలతో నిరుద్యోగ యువతకు అన్యాయం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇచ్చేందుకు నిరుద్యోగుల నుంచి ఫిబ్రవరి 10 వరకు అప్లికేషన్లు తీసుకుంది. గడువు వరకు ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం 1,73,834 మంది అప్లై చేసుకున్నారు. రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే గవర్నమెంట్ ​స్కీమ్స్​కు అర్హులు అవుతారని సర్కారు రూల్​ పెట్టింది. దీంతో సుమారు 30% మంది ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు అనర్హులవుతున్నారు. నిరుపేదలు ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డ్ అందిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం 2018 సెప్టెంబర్​ నుంచి కార్డుల జారీ పూర్తిగా నిలిపివేసింది. ఉమ్మడి కుటుంబంలో ఉంటూ వేరుపడిన వారు, పెండ్లవడంతో పేర్లు కట్​ చేసినవారు.. ఇలా పలువురు కొత్త రేషన్​కార్డుల కోసం అప్లై చేసుకున్నారు. అయితే ప్రభుత్వం కార్డుల జారీ నిలిపివేయడంతో తహసీల్దార్​ఆఫీస్ ​నుంచి సివిల్​సప్లై ఆఫీసర్​వరకు ఎక్కడికక్కడ రేషన్ ​కార్డుల అప్లికేషన్లు లక్షల్లో పెండింగ్​ పడ్డాయి. కొత్త రేషన్​కార్డుల కోసం జిల్లాల్లో 6 లక్షల మందికి పైగా అప్లై చేసుకుని ఎదురు చూస్తున్నారు. ఒకవైపు కార్డులు ఇవ్వకపోగా మరోవైపు కార్డులతో రుణాలకు లింకు పెట్టడంపై నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కార్డు లేదని ఫామ్ తీసుకోలేదు

2016–-17 సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్ కింద లేడీస్ ఎంపోరియం కోసం రూ. 2 లక్షల లోన్​కు అప్లై చేస్తే రాలేదు. అమ్మ వాళ్ల ఇంటి రేషన్ కార్డులో నా పేరును అధికారులు కట్ చేశారు. కొత్త రేషన్ కార్డ్ కోసం అప్లై చేసినా ఇంకా రాలేదు. ఇప్పుడు మళ్లీ సబ్సిడీ లోన్ కోసం అప్లై చేయడానికి మీసేవకు వెళ్తే రేషన్ కార్డు లేదని అప్లికేషన్​తీసుకోలేదు. –లావణ్య, మల్లాపూర్, జగిత్యాల జిల్లా

రేషన్ కార్డు తప్పనిసరి

ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేయడానికి రేషన్ కార్డు తప్పనిసరి. ప్రభుత్వ స్కీమ్స్ ప్రతి కుటుంబానికి అందేవిధంగా, ఒక్కో కుటుంబం 5 సంవత్సరాలకు ఒకసారి  తీసుకునేలా చూడడానికి రేషన్ కార్డు తప్పనిసరి. పై అధికారుల నుంచి ఆదేశాలు వస్తే రుణాలు అందజేస్తాం. – లక్ష్మీనారాయణ, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్, జగిత్యాల.

ఇవి కూడా చదవండి

ఆర్టీఏ సేవలకు ఆధార్ తప్పనిసరి

వరి సాగులో ఆల్‌‌టైమ్‌‌ రికార్డ్‌‌

పర్మినెంట్ చేయరు.. జీతాలు పెంచరు

తుంగభద్రకు తూట్లు : ఆర్డీఎస్ కుడి కాల్వ తవ్వకానికి రెడీ అయిన ఏపీ