
ఇప్పటివరకు నేతన్నలే చీరలు నేసేవాళ్లు. ఇప్పుడు నేతక్కలు కూడా మగ్గం పట్టి, బట్టలు నేస్తున్నారు. గతంలో ఆడవాళ్లు కండెలు చుడుతూ మగవాళ్లకు చేదోడువాదోడుగా ఉండేవాళ్లు. కొన్నాళ్లు నేతపనిలో ట్రైనింగ్ తీసుకుని కండెలు చుట్టడం దగ్గర నుంచి బట్ట నేయడం వరకు అన్ని పనులూ వాళ్లే చేస్తున్నారు.
సుల్తానాబాద్, వెలుగు: మగవాళ్లకు చేదోడుగా ఉండే ఆడవాళ్లు ఇప్పుడు బట్టలు నేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో ఎంతోమంది ఆడవాళ్లు బట్టలు నేస్తూ కుటుంబాలకు అండగా ఉంటున్నారు. ‘సుల్తానాబాద్, కనుకుల’ చేనేత సహకార సంఘాల్లో ఉన్న మహిళలు మగవాళ్లతో సమానంగా క్లాత్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. గతంలో కండెలు చుడితే 50 రూపాయలు మాత్రమే వచ్చేది. పొద్దంతా పనిచేసినా కూలీ గిట్టేది కాదు. అందుకే గవర్నమెంట్ నాలుగేళ్ల క్రితం కొందరు ఆడవాళ్లకు నేత పనిలో 45 రోజులు ట్రైనింగ్ ఇచ్చింది. తర్వాత వాళ్లే స్వయంగా మగ్గం నేయడం మొదలుపెట్టారు. మీటర్ క్లాత్ నేయడానికి 28 రూపాయల చొప్పున కూలీ తీసుకుంటున్నారు. ఒక్కొక్కరు రోజుకు దాదాపు ఆరు మీటర్ల షర్టింగ్ క్లాత్ నేస్తున్నారు. ఉదయం ఇంటిపనులు చేసుకుని సొసైటీకి వస్తారు. పొద్దంతా పని చేసి, చీకటిపడే సరికి ఇంటికెళ్తారు. కరీంనగర్ జిల్లా పచ్చనూరు, జమ్మికుంటల్లో కూడా ఆడవాళ్లు బట్టలు నేస్తున్నారు.
కూలీ రేట్లు పెంచాలి
కులవృత్తిపై మమకారంతో చేనేత పనిలోకి వచ్చాం. ఇంతకుముందు మా సంపాదన ఎటూ సరిపోయేది కాదు. ఇప్పుడు నేయడం వల్ల కాస్త ఎక్కువ సంపాదిస్తున్నాం. వచ్చే ఆదాయంతో కుటుంబానికి కాస్త తోడుగా ఉంటున్నామనే సంతృప్తి ఉంది. మీటరు బట్ట నేస్తే గవర్నమెంట్ 28 రూపాయలు మాత్రమే ఇస్తుంది. కనీసం 50 రూపాయలైనా ఇస్తే గిట్టుబాటవుతుంది. – గుండ లక్ష్మి, కనుకుల
త్రిఫ్ట్ ఫండ్ స్కీమ్..
చేనేత కార్మికుల కోసం గవర్నమెంట్ మొదలుపెట్టిన ‘త్రిఫ్ట్ ఫండ్ స్కీమ్’ ద్వారా మేం 800 రూపాయల చొప్పున జమ చేస్తే సర్కార్ 1,600 రూపాయలు ఇస్తుంది. ఈ స్కీమ్ చాలామందికి ఉపయోగంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ స్కీమ్‌ని ఆపేశారు. ఇల్లు గడవడం కష్టంగా ఉంది. ఆ స్కీమ్‌ను మళ్లీ మొదలుపెడితే బాగుంటుంది. మేం సంపాదించే డబ్బు ఆ స్కీమ్‌లో పెట్టాలనుకుంటున్నాం. – జి. నర్సమ్మ, కనుకుల