ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

లోకేశ్వరం,వెలుగు: కేసీఆర్ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్​రావు పటేల్​ఫైర్​అయ్యారు. పేదలకు డబుల్​బెడ్​రూమ్​ఇండ్లు మంజూరు చేయాలని సోమవారం లోకేశ్వరంలో పేదలతో కలిసి మహా ధర్నా నిర్వహించారు. అనంతరం భారీ ర్యాలీగా వెళ్లి తహసీల్దార్​ఆఫీస్​లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సందర్భంగా మోహన్​రావు పటేల్​మాట్లాడుతూ సీఎం తన పాలనలో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. హామీలు మరిచిన కేసీఆర్​కు వచ్చే ఎన్నికల్లో ప్రజలు కర్రుకాల్చి వాతపెడుతారన్నారు. నిరసనలో పార్టీ పార్లమెంట్ కన్వీనర్ తాడేవార్ సాయినాథ్, కౌన్సిలర్ దిలీప్, గాలి రవి, లీడర్లు నగర్ నారాయణరెడ్డి, లింగాల పోతన్న సుభాష్ పటేల్, అనిల్ పటేల్, భూమయ్య, మహేందర్ రెడ్డి, నరహరి, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

హ్యాండ్​ బాల్​ విజేత వరంగల్​

మందమర్రి,వెలుగు: మందమర్రి సింగరేణి హైస్కూల్​ గ్రౌండ్​లో మూడు రోజులుగా నిర్వహించిన నాలుగో జూనియర్ బాయ్స్​ఇంటర్​ డిస్ట్రిక్ట్​హ్యాండ్​బాల్ చాపియన్​షిప్- పోటీలు సోమవారం ముగిశాయి. ఫైనల్ పోటీలో ఉమ్మడి వరంగల్ జిల్లా విజేతగా నిలువగా, హైదరాబాద్ జట్టు రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో ఉమ్మడి కరీంనగర్, నాలుగో స్థానంలో నల్గొండ జిల్లా జట్లు నిలిచాయి. విజేతలకు స్థానిక ఎమ్మెల్యే ట్రోఫీలు, వ్యక్తిగత బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర హ్యాండ్​బాల్ అసోసియేషన్ కార్యదర్శి సామల పవన్​కుమార్,  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రెసిడెంట్​గోనె శ్యాంసుందర్​రావు, జనరల్ సెక్రటరీ కనపర్తి రమేశ్, వరంగల్ కోచ్​ సత్యవాణి, అంజనీపుత్ర ఎస్టేట్​డైరెక్టర్ పిల్లి రవికుమార్,  జడ్పీటీసీ రవి, నిర్వాహకులు కాంపెల్లి సమ్మయ్య, ఆర్​. వెంకటేశ్వర్లు, సకినాల శంకర్, టీబీజీకేఎస్ లీడర్లు మేడిపల్లి సంపత్, జె.రవీందర్, సంపత్​కుమార్, ఓ.రాజశేఖర్​ తదితరులు పాల్గొన్నారు.

నకిలీ పోలీసు అరెస్టు

భైంసా,వెలుగు: నకిలీ పోలీసును సోమవారం అరెస్టు చేసినట్లు భైంసా ఏఎస్పీ కిరణ్​ఖారే తెలిపారు. సోమవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. గత సంవత్సరం నవంబర్ 5న కోతులగాం గ్రామానికి చెందిన భూమన్న బైక్​పై నిర్మల్–భైంసా రోడ్డుపై వెళ్తుండగా తిమ్మాపూర్ గ్రామం వద్ద నిర్మల్​పట్టణానికి చెందిన జహీర్ పోలీసునని చెప్పి వెహికల్​పేపర్స్, హెల్మెట్​ చూపించుమని అడిగి రూ. 2 లక్షలు ఎత్తుకెళ్లాడన్నారు. బాధితుడు భూమన్న భైంసా రూరల్​పోలీసులకు ఫిర్యాదు చేయడంతో  సీఐ చంద్రశేఖర్, ఎస్సై శ్రీకాంత్, హెడ్ కానిస్టేబుల్​నరహరి, హోంగార్డు శంకర్ ఎంక్వైరీ ప్రారంభించారు. సోమవారం నిందితుడు జహీర్​అనుమానాస్పదంగా తిరుగుతుండగా పట్టుకొని విచారించారు. డబ్బులు ఎత్తుకెళ్లిన విషయం వాస్తవమని చెప్పడంతో ఆయనను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించినట్లు ఏఎస్పీ వివరించారు. నకిలీ పోలీసు జహీర్ ఇప్పటికే పలు కేసుల్లో నిందితుడన్నారు. ఇటీవల నిర్మల్​లో కూడా రూ.50 వేలు వసూలు చేసినట్లు తేలిందన్నారు. నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులకు రివార్డులు అందజేశారు. 

317 జీవో బాధితులకు న్యాయం చేయాలి

నిర్మల్,వెలుగు: ప్రభుత్వ జీవో 317 ద్వారా స్థానికతను కోల్పోయిన టీచర్లకు వెంటనే న్యాయం చేయాలని టీయూటీఎఫ్, పీఆర్టీయూ సంఘాల లీడర్లు కోరారు. సోమవారం జిల్లాకు వచ్చిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతి పత్రం అందజేశారు. వెంటనే టీచర్ల ప్రమోషన్లు, బదిలీలు చేపట్టాలన్నారు. స్పౌజ్​సమస్యను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో టీయూటీఎఫ్ రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ మురళి మనోహర్ రెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మీప్రసాద్ రెడ్డి, తొడిశెట్టి రవికాంత్, పుట్ట రవి కిరణ్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నరేంద్రబాబు, రమణారావు, గజ్జారాం తదితరులు పాల్గొన్నారు.

పెసా తీర్మానాన్ని ఉల్లంఘించిన వారిపై చర్య తీసుకోవాలి

తిర్యాణి,వెలుగు: పెసా తీర్మాణం మేరకు మండలంలోని అరటిపల్లి స్టేజ్ వద్ద బస్ షెల్టర్ నిర్మించామని, దానిని తొలగించిన తిర్యాణి ఇన్​చార్జి ఫారెస్ట్​ఆఫీసర్​సంతోష్​పై చర్యలు తీసుకోవాలని ఆదివాసీలు డిమాండ్​చేశారు. సోమవారం స్థానిక కుమ్రంభీం చౌరస్తా ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్​అనంత రాజుకు వినతిపత్రం అందజేశారు. నిరసనలో తుడందెబ్బ డివిజన్ ప్రెసిడెంట్  వెడ్మ భగవంత రావు, లీడర్లు  ధర్ము, బీజేపీ అసెంబ్లీ  కో కన్వీనర్ సారా రమేశ్ గౌడ్, కొట్నాక గణపతి, సీతారాం పాల్గొన్నారు.

బెల్లంపల్లిలో అక్రమ కట్టడాల కూల్చివేత

బెల్లంపల్లి,వెలుగు: బెల్లంపల్లి టాకరీయనగర్​లో ప్రభుత్వ భూమి 170 పీపీలో అక్రమంగా నిర్మించిన రెండు ఇండ్లను సోమవారం పోలీసు బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. బెల్లంపల్లి తహసీల్దార్ కుమారస్వామి, రూరల్ సీఐ కోట బాబురావు, టూటౌన్ ఎస్సై ఆంజనేయులు, మున్సిపల్ సిబ్బంది అక్కడికి చేరుకొని జేసీబీ  సహాయంతో నిర్మాణాలు తొలగించారు. ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడితే సహించేది లేదని తహసీల్దార్​హెచ్చరించారు.