బంగ్లాను ఇంకా ఎందుకు ఖాళీ చేయలే.. మొయిత్రాకు షోకాజ్‌ నోటీసు

బంగ్లాను ఇంకా ఎందుకు ఖాళీ చేయలే..  మొయిత్రాకు షోకాజ్‌ నోటీసు

గత ఏడాది డిసెంబర్‌ 8న లోక్‌సభ నుంచి బహిష్కరణకు గురైన టీఎంసీ మాజీ ఎంపీ మహువా మొయిత్రా తన కేటాయించిన ప్రభుత్వ బంగ్లాను జనవరి 7లోగా ఖాళీ చేయాలని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ చేసినప్పటికీ మహువా ఇంకా బంగ్లాను ఖాళీ చేయకపోవడంతో దీనిపై  మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని కోరుతూ డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎస్టేట్స్‌ (డీవోఈ) షోకాజ్‌ నోటీసు జారీ చేసింది.  డీవోఈ నోటీసును సవాలు చేసిన సందర్భంగా తనకు కేటాయించిన బంగ్లాలో కొనసాగే అవకాశం కల్పించాలంటూ డీవోఈకే విజ్ఞప్తి చేసుకోవాలని జనవరి 4న మొయిత్రాకు ఢిల్లీ హైకోర్టు సూచించింది. ఈ క్రమంలో తాజాగా ఆమెకు షోకాజ్‌ నోటీసు జారీ కావడం గమనార్హం. 

పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలతో మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు పడిన సంగతి తెలిసిందే.  2023 డిసెంబర్ 8న క్యాష్ ఫర్ క్వెరీ కేసులో మొయిత్రాను దోషిగా నిర్ధారించిన ఎథిక్స్ కమిటీ నివేదికను సభ ఆమోదించిన తర్వాత ఆమెను లోక్‌సభ నుండి బహిష్కరించారు. 

అదానీ గ్రూప్‌ గురించి పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు మహువా వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందానీ నుంచి డబ్బులు , విలువైన బహుమతులు తీసుకుందంటూ బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దూబే ఆరోపించారు. దీనిపై ఆయన లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఆరోపణలను టీఎంసీ నేత తీవ్రంగా ఖండించారు.  సస్పెన్షన్‌ ముందు వరకు ఆమె పశ్చిమ బంగాల్‌లోని కృష్ణా నగర్ ఎంపీగా ఉన్నారు.