
విచారణ నేటికి వాయిదా
హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో కొత్తగా నలుగురిని నిందితులుగా చేర్చుతూ తాము దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు కొట్టేయడాన్ని సవాల్ చేస్తూ సిట్ హైకోర్టులో క్రిమినల్ అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే.. అత్యవసర లంచ్ మోషన్ పిటిషన్‌లో ప్రతివాదులకు నోటీసులు జారీ చేయకుండా విచారణ చేపట్టలేమని జస్టిస్ డి.నాగార్జున బుధవారం తేల్చిచెప్పారు.
సిట్ తీరు న్యాయ సూత్రాలకు విరుద్ధం: శ్రీనివాస్ తరఫు అడ్వొకేట్
కేసులో రామచంద్రభారతి, నందుకుమార్, సింహయాజిని నిందితులుగా చేర్చుతూ మొయినాబాద్ పోలీసులు దాఖలు చేసిన క్రిమినల్ కేసును గతంలో ప్రభుత్వం సిట్‌కు బదిలీ చేసింది. సిట్ తాజాగా బీజేపీ జాతీయ నేత సంతోష్, బీడీజేఎస్ అధ్యక్షుడు తుషార్, కేరళకు చెందిన జగ్గు స్వామి, కరీంనగర్ అడ్వొకేట్ శ్రీనివాస్‌ను నిందితులుగా చేర్చింది. వీరంతా 4 నుంచి 7 వరకు నిందితులని పేర్కొంటూ సిట్ దాఖలు చేసిన మెమోను మంగళ వారం ఏసీబీ కోర్టు తిరస్కరించిన విషయం తెలి సింది. దీంతో సిట్ బుధవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అడ్వొకేట్ శ్రీనివాస్ తరఫు సీనియర్ లాయర్ రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. క్రిమినల్ రివిజన్ పిటిషన్ కాపీలను ఇవ్వలేదని, ఈ పరిస్థితుల్లో సిట్ అప్పీల్ విచారణ చేయడానికి వీల్లేదన్నారు. అప్పీల్ కాపీ ఇవ్వకుండా హడావుడిగా లంచ్ మోషన్ పిటిషన్ వేయడం సరికాదని తెలిపారు. అప్పీల్‌లోని విషయాలను పరిశీలించే అవకాశం లేకుండా వాదనలు ఎలా కొనసాగించగలమని ఆయన ప్రశ్నించారు. ఇలా చేయడం సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించడమే అవుతుందన్నారు. నోటీసు జారీ చేయకుండానే హైకోర్టు విచారణ చేపట్టడానికి వీల్లేదన్నారు.
ఏసీబీ కోర్టు ఉత్తర్వులు రద్దు చేయాలి: సిట్
సిట్ తరఫున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. సిట్ దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు తిరస్కరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు ఏమాత్రం చెల్లుబాటు కాదన్నారు. ఏసీబీ కోర్టు ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని కోరారు. కేసులో సాక్ష్యాధారాలు లభ్యమైన తర్వాతే కొత్త వాళ్లను నిందితులుగా సిట్ చేర్చిందని అన్నారు. సిట్ వద్ద కీలకమైన ఆధారాలు ఉన్నందునే బీఎల్ సంతోష్ మరో ముగ్గురిని నిందితులుగా చేర్చాలని నిర్ణయించిందని, దీనిపై మెమోను ఏసీబీ కోర్టు రద్దు చేయడమంటే పోలీసుల దర్యాప్తును ఆదిలోనే అడ్డుకోవడమని పేర్కొన్నారు. సిట్ దర్యాప్తు వేగంగా జరిగేందుకు వీలుగా ఏసీబీ కోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలన్నారు. తెలంగాణ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతాప్ రెడ్డి జోక్యం చేసుకుంటూ.. సిట్ దర్యాప్తు చేసే క్రమంలో ఎవరిని నిందితులుగా చేర్చాలో ఆధారాలను బట్టి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఈ కేసులో కొత్తగా చేర్చిన నలుగురు నిందితులకు ఏవిధమైన పాత్ర ఉండదని, ఇక్కడ వారంతా ప్రేక్షకులే అవుతారని చెప్పారు. ఎవరిని నిందితులుగా చేర్చాలనే అంశం పోలీసులకు సంబంధించిందని పేర్కొన్నారు. వాదనల తర్వాత హైకోర్టు.. ప్రతిపాదిత నలుగురు నిందితులకు సిట్ వేసిన క్రిమినల్ రివిజన్ పిటిషన్ కాపీలను అందజేయాలని సిట్‌ను ఆదేశించింది. బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామి, శ్రీనివాస్‌కు నోటీసులు జారీ చేసింది. గురువారం తొలి కేసుగా విచారణ చేపడతామని హైకోర్టు ప్రకటించింది.