కాలనీ నాదే.. ఖాళీ చేయండి !..కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా గర్శకుర్తి విజయనగర కాలనీవాసులకు నోటీసులు

కాలనీ నాదే.. ఖాళీ చేయండి !..కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా గర్శకుర్తి విజయనగర కాలనీవాసులకు నోటీసులు
  • భూ రికార్డుల ప్రక్షాళన టైంలో రెవెన్యూ ఆఫీసర్ల నిర్లక్ష్యం
  • కాలనీలోని ఇండ్లన్నీ వ్యవసాయ భూములుగా నమోదు
  • ఖాళీ చేయాలంటూ పాత పట్టాదారు వారసుల పేరిట లీగల్ నోటీసులు
  • ఆందోళనలో వంద కుటుంబాలు

కరీంనగర్, వెలుగు :  బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హయాంలో చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన లోపాలు జనాన్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. రెవెన్యూ సిబ్బంది, ఆఫీసర్ల తప్పిదాలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఆఫీసర్ల నిర్లక్ష్యం కారణంగా కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తిలోని విజయనగర కాలనీలో ఇండ్లు, ఇండ్ల స్థలాలు వ్యవసాయ భూములుగా నమోదు అయ్యాయి. దీన్ని అదనుగా తీసుకొని సదరు పట్టాదారు వారసుల పేరిట కొందరు వ్యక్తులు రంగంలోకి దిగి కాలనీని ఖాళీ చేయాలని లీగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నోటీసులు పంపిస్తున్నారు. దీంతో దశాబ్దాల కిందే సాదాబైనామాలతో స్థలాలు కొని, ఇండ్లు కట్టుకొని జీవిస్తున్న సుమారు వంద కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయి. 

దత్తపుత్రుడినంటూ వచ్చి...

గంగాధర మండలం గర్శకుర్తి గ్రామంలోని 566 సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న 12.33 ఎకరాల భూమిని అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు సాదాబైనామా కింద కల్వకోట లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు అనే వ్యక్తి దగ్గర కొనుగోలు చేశారు. ఆ స్థలాల్లో ఇండ్లు కట్టుకొని, విజయనగర కాలనీగా పేరు పెట్టుకొని ఐదారు దశాబ్దాలుగా అక్కడే ఉంటున్నారు. స్థలాలను కొనుగోలు చేసిన వ్యక్తులు చనిపోగా.. వారి పిల్లలు, వారసులు ఇప్పుడు ఆ ఇండ్లలో జీవిస్తున్నారు. స్థలాలు అమ్మిన కల్వకోట లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు సైతం చాలా ఏండ్ల కిందే చనిపోయారు. ఆయనకు పిల్లలు లేరు. ఈ క్రమంలోనే ఆయన తమ్ముడి కొడుకు, పెద్దపల్లి వాసి కల్వకోట హన్మంతరావు 2016లో లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు దత్తపుత్రుడినంటూ రంగంలోకి దిగాడు. అప్పటి రెవెన్యూ ఆఫీసర్లు, సిబ్బందిని మేనేజ్ చేసుకుని విజయనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలనీ భూములపై పట్టాదారు పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పొందాడు. ఆ తర్వాత ఆ కాలనీవాసులకు లీగల్ నోటీసులు పంపాడు. దీంతో కాలనీవాసులంతా ఏకమై ఆందోళనకు దిగడంతో అప్పటి కలెక్టర్, ఆర్డీవో స్పందించి ఎంక్వైరీ చేశారు. పహాణీల్లో పట్టాదారు పేరు లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావుగా ఉన్నప్పటికీ మోకా మీద హన్మంతరావు లేరని, అనుభవదారులుగా విజయనగర కాలనీ వాసుల పేర్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో హన్మంతరావు పేరిట జారీ అయిన పట్టాదారు పాస్ పుస్తకాలను రద్దు చేస్తూ 2016 ఆగస్టు 22న అప్పటి ఆర్డీవో చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రొసీడింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జారీ చేశారు. దీంతో విజయనగర కాలనీ వాసులు సంబురాలు చేసుకున్నారు. 

ఆఫీసర్ల నిర్లక్ష్యంతో మళ్లీ మొదటికొచ్చిన సమస్య

రెవెన్యూ సిబ్బంది, ఆఫీసర్ల నిర్వాకంతో విజయనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలనీ సమస్య మళ్లీ మొదటికొచ్చింది. బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హయాంలో చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన సమయంలో కాలనీకి సంబంధించిన 12.29 ఎకరాల భూమిని ఇండ్ల స్థలాలుగా నమోదు చేయాల్సి ఉంది. కానీ ఆఫీసర్లు ఆ విషయాన్ని పట్టించుకోకుండా... కాలనీకి సంబంధించిన మొత్తం స్థలాన్ని వ్యవసాయభూములుగా, పట్టాదారు పేరు కల్వకోట లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, తండ్రి కల్వకోటగా ఎంట్రీగా చేశారు. దీనిని అవకాశంగా తీసుకున్న హన్మంతరావు కుమారుడు శేషగిరిరావు పెద్దపల్లి నుంచి విజయనగర కాలనీవాసులకు నోటీసులు పంపారు. అంతేగాక లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు పేరిట ఉన్న భూమికి తన పేరిట పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జారీ చేయాలని శేషగిరిరావు భూభారతి పోర్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సైతం అప్లికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టుకున్నట్లు తెలిసింది. దీంతో కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. 

కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆందోళన

గర్శకుర్తి గ్రామంలోని 566/ఈ/బీ సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న 12.29 ఎకరాల భూమిపై కల్వకోట లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు పేరు తొలగించాలని, ఆ భూమినికి ఇండ్ల స్థలాలుగా మార్చాలని డిమాండ్ చేస్తూ విజయనగర కాలనీవాసులు సోమవారం ఆందోళనకు దిగారు. కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరుకుని ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. ఆర్డీవో మహేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలనీవాసులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.