15న నాగర్​కర్నూల్ జడ్పీ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్

15న  నాగర్​కర్నూల్ జడ్పీ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్
  • 22న ఎన్నిక నిర్వహించాలని ఈసీ ఆర్డర్స్​
  • రేసులో కల్వకుర్తి, తెలకపల్లి జడ్పీటీసీలు భరత్, శాంతికుమారి
  • శాంతికుమారికే ఎమ్మెల్యేల మద్దతు..
  • తన కొడుకు భరత్​కే ఇవ్వాలంటున్న ఎంపీ రాములు

 

నాగర్ కర్నూల్, వెలుగు: ఈ నెల 22న నాగర్​కర్నూల్​జడ్పీ చైర్మన్ ఎన్నిక జరపాలని  స్టేట్​ ఎలక్షన్ కమిషన్ ఆర్డర్స్​ఇవ్వడంతో జిల్లాలో టీఆర్ఎస్​  రాజకీయాలు హాట్​హాట్​గా మారాయి.  ఎన్నికలకు ఈ నెల 15న జిల్లా ఎన్నికల అధికారి నోటిఫికేషన్​ జారీ చేయనున్నారు. జడ్పీ చైర్మన్​ పదవి  ఎస్సీ జనరల్​కు రిజర్వ్ చేయగా, జిల్లాలో 20 జడ్పీటీసీ సీట్లకు గాను 2019 లో టీఆర్ఎస్​కు 17, కాంగ్రెస్​కు 3 సీట్లు దక్కాయి.   తెల్కపల్లి జడ్పీటీసీ మెంబర్​ పెద్దపల్లి  పద్మావతి  జడ్పీ తొలి చైర్​పర్సన్​గా ఎన్నికయ్యారు. ఇటీవల ఆమెకు ముగ్గురు పిల్లలున్నారన్న కేసులో కోర్టు అనర్హత వేటు వేయడంతో  రెండో సారి జడ్పీ చైర్మన్​ ఎన్నిక అనివార్యమైంది. 
ఎస్సీ  రిజర్వ్డ్​ స్థానాల నుంచి టీఆర్ఎస్​నుంచి గెలుపొందిన వారిలో కల్వకుర్తి, ఊర్కొండ జడ్పీటీసీలు మిగిలారు. ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి. కల్వకుర్తి జడ్పీటీసీ భరత్​కు ఈసారి జడ్పీ చైర్మన్​పదవి దక్కకుండా చేయడమే లక్ష్యంగా ఇద్దరు ఎమ్మెల్యేలు పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. పద్మావతిపై అనర్హత  వేటు పడగానే జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ  సింగ్​కు  ఇన్​చార్జి బాధ్యతలు అప్పగించారు. అయితే జడ్పీ చైర్మన్​ఎన్నికను వీలైనంత వరకు సాగదీస్తూ ఇన్​చార్జితోనే  నెట్టుకురావాలని సదరు ఎమ్మెల్యేలు  వీలైనన్ని ప్రయత్నాలు చేశారు. ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై ముందు నుంచే అనుమానంతో ఉన్న  జిల్లా ప్రజాసంఘాలు, దళిత వర్గానికి చెందిన లీడర్లు ఎస్సీ లకు రిజర్వ్ చేసిన స్థానంలో బీసీని కొనసాగించాలని చూస్తే  తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. జడ్పీ చైర్మన్​ ఎన్నిక పెట్టాలని కలెక్టర్, ఎలక్షన్​కమిషన్​కు కూడా వినతిపత్రాలు ఇచ్చారు.

ఎమ్మెల్యేలకు మింగుడు పడని భరత్​వైఖరి

జడ్పీ కుర్చీ రేసులో కల్వకుర్తి , ఊర్కొండ జడ్పీటీసీ మెంబర్లు భరత్, శాంతాకుమారి ఉన్నారు.    భరత్​ యువకుడు, ఉన్నత విద్యావంతుడు కావడంతో అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చురుకుగా వ్యవహరించడం సదరు   ఎమ్మెల్యేలకు మింగుడు పడడం లేదు.  జడ్చర్ల అసెంబ్లీ  , పాలమూరు పార్లమెంట్​పరిధిలోకి వెళ్లే  ఊర్కొండ జడ్పీటీసీని చైర్​పర్సన్​గా ఎంపిక చేస్తారా? అన్నది ఇంట్రెస్టింగ్​గా మారింది.

వైరం పెంచిన ఇసుక దందా..

జిల్లాలోని వాగులు, చెరువుల నుంచి అక్రమంగా ఇసుక తవ్వుతున్నారని జడ్పీటీసీ భరత్  చాలా సార్లు జడ్పీ మీటింగ్స్​లో ఆఫీసర్లను నిలదీశారు.  భరత్​కు మద్దతుగా పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని ఆఫీసర్లపై వత్తిడి తెచ్చారు. ఎంపీ రాములు, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కూడా ఇసుక అక్రమ దందాపై నిలదీశారు. అనర్హతకు గురైన పెద్దపల్లి పద్మావతి, భరత్ కొంతమంది జడ్పీటీసీలు ఇసుక అక్రమ రవాణాన అడ్డుకోవాలని ఎస్పీ ఆఫీస్​కు వెళ్లి ఎస్పీకి కంప్లైంట్​చేయడం అప్పట్లో సంచలనంగా మారింది.   దీని ఎఫెక్ట్  ఫస్ట్​ పద్మావ తిపై , ఇప్పుడు భరత్ పై పడిందనే  కామెంట్స్ వస్తున్నాయి.  ఊర్కొండ  జడ్పీటీసీ మెంబర్​శాంతికుమారి ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, మర్రి జనార్దన్ రెడ్డిని కలిసి తనకు మద్దతివ్వాలని కోరినట్లు సమాచారం. కాగా భరత్​ కేటీఆర్​మీదే భారం పెట్టినట్లు తెలుస్తోంది. మంత్రి నిరంజన్​రెడ్డి, ఎమ్మెల్యేలు  ఎవరిని ఎంపిక చేస్తారో నన్నది ఆసక్తికరంగా మారింది.

కొడుకు కోసం ఎంపీ పట్టు..

జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మంత్రి నిరంజన్ రెడ్డి వద్ద కూర్చొని మంత్రాంగం నడుపుతుండగా, ఎంపీ రాములు, ఆయన కొడుకు భరత్​కేటీఆర్​ను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని కోరు తున్నారు. అయితే అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిని చైర్మన్​క్యాండిడేట్ గా​ఎంపిక చేయాలని మంత్రి నిరంజన్ రెడ్డికి కేటీఆర్ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.