జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సోమవారం నోటిఫికేషన్ విడుదల

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సోమవారం నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. సోమవారం నుంచి 21 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. షేక్ పేట్ ఎమ్మార్వో ఆఫీస్లో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ ఆఫీస్లో నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్లకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. 

అక్టోబర్ 22న నామినేషన్ల పరిశీలన, 24వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుంది. నవంబర్ 14న యూసఫ్ గూడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ చేసి ఫలితాలను అదే రోజు ప్రకటిస్తారు. 

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం తుది ఓటర్ల జాబితాను ఎన్నికల అధికారి, బీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఇప్పటికే విడుదల చేశారు. మొత్తం 3 లక్షల 98 వేల 982 మంది ఓటర్లు ఉండగా ఇందులో పురుష ఓటర్లు 2,07,367 మంది, మహిళా ఓటర్లు 1.91,590 మంది ఉన్నారు. అలాగే ఇతరులు 25 మంది ఉన్నారని ప్రకటించారు. నియోజకవర్గం ఓటర్లలో 80 ఏండ్లకు పైబడిన వృద్ధుల్లో పురుషులు 3,280 మంది, మహిళలు 2,772 మంది ఉన్నారు.

ఇక ఎన్ఆర్ఐ ఓటర్లు 95 మంది కాగా, సర్వీస్ ఎలక్టోరల్స్ 18, పీడబ్ల్యూడీ ఓటర్లు 1,891 మంది నమోదయ్యారు. నియోజకవర్గంలో 407 పోలింగ్ స్టేషన్లుండగా.. ఒక్కో పోలింగ్​స్టేషన్లో యావరేజ్గా 980 మంది ఓటర్లు ఉన్నట్టు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలకు ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. ఎవరికి వారు ఈ స్థానం కైవసం చేసుకునేందుకు వ్యూహ ప్రతివ్యూహాలతో తలమునకలయ్యారు.