స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్

తెలంగాణలో మరో ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆదిలాబాద్, వరంగల్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కొక్క సీటుకు.. కరీంనగర్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో రెండు స్థానాలకు ఎన్నిక జ‌రుగుతుంద‌ని ఎన్నికల సంఘం పేర్కొంది. 

నామినేషన్ల స్వీకరణ నేటి నుంచి ప్రారంభంకాగా.. చివరి తేదీ నవంబర్ 23గా నిర్ణయించారు. నవంబర్ 24న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నవంబర్ 26 ఉపసంహరణకు చివరి తేదీగా ఎన్నికల సంఘం నిర్ణ‌యించింది. డిసెంబర్ 10న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నిక‌లు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. డిసెంబర్ 14న కౌంటింగ్ ఉంటుందని ప్రకటించింది. 

స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన పురాణం సతీష్ కుమార్, భానుప్రసాదరావు, నారదాసు లక్ష్మణరావు, భూపాల్ రెడ్డి, సుంకరి రాజు, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, కల్వకుంట్ల కవిత పదవీకాలం జనవరి నాలుగో తేదీతో పూర్తి కానుంది.