కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌‌ చెల్లదు

కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌‌ చెల్లదు
  • ప్రాజెక్టు నిర్వహణపై కేంద్ర నోటిఫికేషన్‌‌ చెల్లదు
  • హైకోర్టులో టీడీఎఫ్‌‌ పిల్‌‌ 

హైదరాబాద్, వెలుగు: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న నీటి వివాదాల నేపథ్యంలో ఇరిగేషన్‌‌ ప్రాజెక్టులను కృష్ణా, గోదావరి రివర్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ బోర్డుల పరిధిలోకి తీసుకువచ్చేలా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌‌ను సవాల్‌‌ చేస్తూ హైకోర్టులో తెలంగాణ డెవలప్‌‌మెంట్‌‌ ఫోరమ్‌‌ (టీడీఎఫ్‌‌) పిల్‌‌ దాఖలు చేసింది. నోటిఫికేషన్‌‌ రాజ్యాంగ వ్యతిరేకమని, ఫెడరల్‌‌ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉందని, రాష్ట్ర ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనం చేసేందుకే నోటిఫికేషన్‌‌ ఇచ్చిందని పిల్‌‌లో పేర్కొంది. 

టీడీఎఫ్​కు చెందిన పాండురంగారెడ్డి సహా మరో ముగ్గురు వేసిన ఈ పిల్‌‌కు హైకోర్టు నంబర్‌‌‌‌ కేటాయించలేదు. పిల్‌‌కు విచారణ అర్హతను తేల్చేందుకు గురువారం చీఫ్‌‌ జస్టిస్‌‌ ఉజ్జల్‌‌ భూయాన్, జస్టిస్‌‌ సీవీ భాస్కర్‌‌రెడ్డిల డివిజన్‌‌ బెంచ్‌‌ విచారణ చేపట్టింది. వాదనలు విన్న కోర్టు విచారణను సెప్టెంబర్‌‌ 20కి వాయిదా వేస్తూ ఉత్తర్వులిచ్చింది.