హైదరాబాద్: వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. ఆరోగ్య శాఖలో 1,623 స్పెషలిస్ట్ డాక్టర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆసుపత్రుల్లో 1,616 పోస్టులు, ఆర్టీసీ ఆసుపత్రుల్లో మరో 7 స్పెషలిస్ట్ వైద్యుల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు 2025, ఆగస్ట్ 22న ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి 2025, సెప్టెంబర్ 8 నుంచి 22 వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఆరోగ్య శాఖ అధికారిక వైబ్ సైట్ సందర్శించాలని సూచించారు అధికారులు.
స్పెషాలిటీ వైద్య సేవలు పల్లెలకు మరింత చేరువ కావాలనే లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య శాఖలో ఇప్పటికే 8 వేల పోస్టుల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. మరో 7 వేల పోస్టులకు భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వ తాజా నిర్ణయంతో స్పెషాలిటీ వైద్య సేవలు పల్లెలకు మరింత చేరువ కావడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల సంఖ్య గణనీయంగా పెరగనుంది. జిల్లా, ఏరియా హస్పిటళ్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో మరిన్ని వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందనుంది.
►ALSO READ | మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో జాబ్స్.. పరీక్ష లేదు.. మెరిట్ ఆధారంగా ఎంపిక.. ట్రై చేయండి
