
- వైఎస్ఆర్సీపీ, బీజేడీ మద్దతు కోసం బీజేపీ ప్రయత్నాలు
- ఉమ్మడి అభ్యర్థిపై ఇయ్యాల ప్రతిపక్షాల సమావేశం
న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రపతి ఎన్నికకు బుధవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల ప్రక్రియ కూడా షురూ కానుంది. ఈ నేపథ్యంలోనే అధికార, ప్రతిపక్షాలు తమ తమ అభ్యర్థుల విజయానికి కసరత్తులూ మొదలు పెట్టేశాయి. ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండగా.. ప్రతిపక్షాల తరఫున అభ్యర్థిని నిలబెట్టేందుకు మమత బెనర్జీ పావులు కదుపుతున్నారు. మెజారిటీకి స్వల్ప దూరంలో ఉండడంతో కాంగ్రెస్ సహా తటస్థ పార్టీలతో చర్చలు జరిపేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ప్రధాని నరేంద్ర మోడీ బాధ్యతలు అప్పగించారు. వైఎస్ఆర్సీపీ లేదా బీజేడీల మద్దతుతో ఎన్నికల్లో గట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించి ఏపీ సీఎం జగన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో మోడీ చర్చలు జరిపారు. ఇటు ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎంపికపై బుధవారం కాన్స్టిట్యూషన్ క్లబ్లో సమావేశం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి 22 మంది నేతలకు ఇటీవల మమత లేఖలు రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎన్సీపీ, డీఎంకే, సీపీఎం, సీపీఐలు సమావేశంలో పాల్గొనే తమ పార్టీల నేతల పేర్లను ప్రకటించాయి. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను నిలబెట్టేందుకు కాంగ్రెస్ ఇప్పటికే చర్చలు జరిపింది. ఆయన మాత్రం తాను నిలబడనని చెప్తున్నారు. మంగళవారం ఇదే విషయంపై పవార్‌తో మమత భేటీ కావడం
ప్రాధాన్యం సంతరించుకుంది.
రాష్ట్రపతి ఎన్నిక కోసం ప్రత్యేక సెల్
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎలక్షన్ కోసం ప్రత్యేక సెల్‌ను రాజ్యసభ సెక్రటేరియట్ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. కాగా ఈ సెల్‌కు రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోడీ నేతృత్వం వహిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు ఈ సెల్ ఏర్పాటు చేశారు. దీనిలో రాజ్యసభ సెక్రటేరియట్ టేబుల్ ఆఫీస్‌లోని దాదాపు అధికారులందరూ ఉంటారు. ఎన్నికల కోసం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా ఉన్న ముకుల్ పాండే, సురేంద్ర కుమార్ త్రిపాఠి ఇద్దరూ కూడా ఈ సెల్‌లో భాగమే. నామినేషన్ పత్రాలు పార్లమెంటు హౌస్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాబట్టి, ఫారమ్‌లను అడిగేవారికి, వారు నామినేషన్లను దాఖలు చేయడానికి సెల్ అన్ని రకాలుగా సహాయపడనుంది.